AAP WhatsApp Campaign: అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ వరుస వీడియోలు విడుదల చేస్తూ కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు మాట్లాడిన ఆమె ఇప్పుడు మరోసారి ఓ వీడియో విడుదల చేశారు. జైల్‌లో ఉన్న కేజ్రీవాల్‌కి ఏమైనా చెప్పాలనుకుంటే వాట్సాప్‌ నంబర్‌కి మెసేజ్‌ చేయండి అంటూ ఓ నంబర్‌ని వెల్లడించారు. ఆ మెసేజ్‌లన్నింటినీ కేజ్రీవాల్‌కి చేరవేస్తానని హామీ ఇచ్చారు. Kejriwal ko Aashirvaad పేరిట ఈ వాట్సాప్ క్యాంపెయిన్‌ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. తనకు చాలా మంది ఫోన్ చేసి కేజ్రీవాల్ గురించి ఆరా తీస్తున్నట్టు వెల్లడించారు. అంతే కాదు. కొంత మందైతే కేజ్రీవాల్ త్వరగా విడుదల కావాలని కోరుతూ ఉపవాసం కూడా చేస్తున్నారని చెప్పారు. ఇంత మంది ఆయనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. అభిమానులందరూ ఏమనుకుంటున్నారో మెసేజ్‌ల ద్వారా చెబితే కచ్చితంగా వాటిని ఆయనకు చేరవేరుస్తానని, ఇవి చదివి ఆయన ఆనందపడతారని అన్నారు. కేవలం ఆప్‌ పార్టీకి మద్దతునిచ్చే వాళ్లే కేజ్రీవాల్‌ అభిమానులు అయ్యుండాలన్న నిబంధన ఏమీ లేదని స్పష్టం చేశారు. 


"కేజ్రీవాల్‌ కో ఆశీర్వాద్ పేరిట ఇవాళ్టి నుంచి మేము ఓ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మీ ఆశీర్వాదాల్ని, మీ ప్రేమని, సందేశాన్ని వాట్సాప్ నంబర్‌కి పంపించండి. మీరు ఏం పంపాలనుకున్నా పంపొచ్చు. వాటిని నేను ఆయనకు చూపిస్తాను. ఇంత మంది ఆయనపై అభిమానం చూపిస్తున్నారంటే కచ్చితంగా సంతోషపడతారు"


- సునీత కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ భార్య 






ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆయన అరెస్ట్‌ని రాజకీయ కుట్ర అని తేల్చి చెప్పారు సునీత కేజ్రీవాల్. ఈడీ కస్టడీలో ఆయన ఆరోగ్యం రానురాను క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కస్టడీలో ఆయనను వేధిస్తున్నారని ఆరోపించారు.


"కేజ్రీవాల్ ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదు. కస్టడీలో ఆయనను వేధిస్తున్నారు. ఇంతకింతకి కచ్చితంగా ప్రజలు గట్టిగా సమాధానం చెబుతారు"


- సునీత కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ భార్య


లిక్కర్ పాలసీ స్కామ్‌ కేసులో భాగంగా అరవింద్ కేజ్రీవాల్‌ని మార్చి 21న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్‌లు అరెస్ట్ అయ్యారు. ఈ లిక్కర్ స్కామ్‌లో ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్ అని ఈడీ కోర్టులో వెల్లడించింది. ఈ పాలసీ ద్వారా కొంత మందికి లబ్ధి చేకూర్చేందుకు భారీ మొత్తంలో డిమాండ్ చేశారని ఆరోపించింది. ఈ డబ్బుని గోవాలోని అసెంబ్లీ ఎన్నికల కోసం వినియోగించినట్టు తేల్చి చెప్పింది. 


Also Read: కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు