AAP Drops Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీ  సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్ధాకు , పార్టీ అధిష్టానానికి మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఆయన్ని తప్పించి, ఆ బాధ్యతలను అశోక్ మిట్టల్‌కు అప్పగించడం ఈ ఊహాగానాలకు ప్రధాన కారణమైంది. చద్ధా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని , పార్టీ లైన్‌కు అనుగుణంగా వ్యవహరించడం లేదనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా మద్యం పాలసీ కేసులో క్లీన్ చిట్ పొందిన తర్వాత రాఘవ్ చద్ధా ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడం పార్టీ వర్గాలను విస్మయానికి గురిచేసింది. గతంలో కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సమయంలో కూడా ఆయన బ్రిటన్‌లో కంటి శస్త్రచికిత్స చేయించుకుంటున్నాననే కారణంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కీలక సమయాల్లో ఆయన మౌనంగా ఉండటం, పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశాలకు గైర్హాజరు కావడం అధిష్టానానికి ఆగ్రహం కలిగించినట్లు సమాచారం.

 రాజ్యసభ సచివాలయానికి పార్టీ రాసిన లేఖలో చద్ధాకు పార్టీ కోటా కింద మాట్లాడే సమయాన్ని కేటాయించవద్దని కోరడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. సాధారణంగా పార్టీలో అంతర్గత మార్పులు సహజమని కొత్త డిప్యూటీ లీడర్ అశోక్ మిట్టల్ పేర్కొన్నప్పటికీ, బీజేపీ నేతలు మాత్రం కేజ్రీవాల్ నియంతృత్వ ధోరణి వల్లే చద్ధాకు ఈ పరిస్థితి ఎదురైందని విమర్శిస్తున్నారు. రాఘవ్ చద్ధా త్వరలో బీజేపీలో చేరుతారనే ప్రచారాన్ని సంజయ్ సింగ్ వంటి నేతలు కొట్టిపారేసినా, అంతర్గత సమస్యలు ఉన్న మాట వాస్తవమని అంగీకరించారు.

పార్టీ ఆవిర్భావం నుండి కేజ్రీవాల్‌కు అత్యంత నమ్మకస్తుడిగా, పార్టీ జాతీయ ప్రతినిధిగా, అతి చిన్న వయసులోనే రాజ్యసభ ఎంపీగా చద్ధా కీలక పాత్ర పోషించారు. పంజాబ్ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంలో కూడా ఆయన వ్యూహాలు తోడ్పడ్డాయి. అటువంటి కీలక నేతను ఇప్పుడు పక్కన పెట్టడం వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటనేది చర్చనీయాంశమైంది. రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు ఎటువంటి బాధ్యతలు ఇస్తారనే దానిపైనే ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.   

ప్రస్తుతానికి ఆమ్ ఆద్మీ పార్టీలో రాఘవ్ చద్ధా ప్రాధాన్యత తగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. స్వాతి మలివాల్ ఉదంతం తర్వాత పార్టీలో మరో కీలక నేత ఇలా వివాదాల్లో చిక్కుకోవడం ఆప్ రాజకీయాలకు ఇబ్బందికరంగా మారింది. పార్టీ క్రమశిక్షణ చర్యల పేరుతో ఆయనను పూర్తిగా దూరం పెడతారా లేక చర్చల ద్వారా ఈ సంక్షోభాన్ని పరిష్కరిస్తారా అన్నది వేచి చూడాలి. ఎప్పుడూ చురుగ్గా ఉండే చద్ధా ఈ పరిణామాలపై ఇంకా అధికారికంగా స్పందించలేదు.