YSRCP opposes AP capital bill in RajyaSabha: రాజ్యసభలో అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుపై జరిగిన చర్చలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత  వైవీ సుబ్బారెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.  రాజ్యసభలో అమరావతి బిల్లుపై మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి, ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక  పెద్ద డ్రామా గా అభివర్ణించారు. ప్రస్తుత రూపంలో ఉన్న అమరావతి బిల్లును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. అసలు రాజధాని నిర్ణయం అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని గతంలో కేంద్రమే అఫిడవిట్ దాఖలు చేసిందని గుర్తు చేస్తూ, మరి ఇప్పుడు కేంద్రం ఈ బిల్లును ఏ ప్రాతిపదికన ప్రవేశపెట్టిందని ఆయన ప్రశ్నించారు. కేంద్రానికి బిల్లు పెట్టే అధికారం లేదన్నారు.  అమరావతి నిర్మాణం వల్ల రాష్ట్రంపై పడే ఆర్థిక భారాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఒక్కో ఎకరా అభివృద్ధికి రూ. 2 కోట్లు ఖర్చవుతుందని చెబుతున్నారని, మొత్తం ప్రాజెక్టుకు అవసరమైన రూ. 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని  ప్రశ్నించారు.  ఇప్పటికే వడ్డీల రూపంలోనే రూ. 20 వేల కోట్లు చెల్లించాల్సిన దుస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతిలో ప్రతి చదరపు అడుగుకు రూ. 12 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారని, దీని వెనుక పెద్ద ఎత్తున కుంభకోణాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసమే తమ ప్రభుత్వం గతంలో మూడు రాజధానుల  నిర్ణయం తీసుకుందని వైవీ సుబ్బారెడ్డి  తెలిపారు.   అమరావతిని శాసన రాజధానిగా ఉంచుతూనే, విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా, కర్నూలును జ్యుడీషియల్ క్యాపిటల్‌గా చేయాలన్నదే తమ విధానమని చెప్పారు. అమరావతి ప్రాంతం వరదలతో మునిగిపోతుందని ఇప్పటికే ఆధారాలు ఉన్నాయని, అటువంటి ప్రాంతంలో వేల కోట్లు కుమ్మరించడం సరైన నిర్ణయం కాదని వాదించారు. 

అసెంబ్లీలో సరైన చర్చ జరపకుండానే తీర్మానం చేశారని సుబ్బారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం కేవలం ఒక ప్రాంతానికే పరిమితమై మిగిలిన ప్రాంతాలను విస్మరిస్తోందని విమర్శించారు. తన ప్రసంగం అనంతరం, బిల్లుకు నిరసనగా వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ సభ్యులు రాజ్యసభ నుంచి  వాకౌట్ చేశారు.