Aadhaar App Mandatory For All Smartphones : స్మార్ట్‌ఫోన్‌లలో కొత్త ఆధార్ యాప్‌ను ముందస్తుగా ఇన్‌స్టాలేషన్ (Pre-installation) చేయాలనే ప్రతిపాదనపై గత కొద్దిరోజులుగా జరుగుతున్న చర్చకు కేంద్ర ప్రభుత్వం ,పరిశ్రమ వర్గాలు తెరదించాయి. ఫోన్లలో ఆధార్ యాప్ ఉండటం తప్పనిసరి కాదని, దీనిపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాయి.
ప్రతిపాదన దశలోనే.. ఉత్తర్వులు కావు!
స్మార్ట్‌ఫోన్ తయారీదారులు, ప్రభుత్వానికి మధ్య ఈ విషయంలో విభేదాలు తలెత్తాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం సంప్రదింపుల దశలోనే ఉందని, దీనిని అమలు చేయాలని ఎవరికీ ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. 2025 నవంబర్‌లో ఐటీ మంత్రిత్వ శాఖకు సమర్పించిన ఈ ప్రతిపాదనపై ప్రస్తుతం వివిధ స్టేక్‌హోల్డర్లతో చర్చలు జరుగుతున్నాయని, దీనిని ఇంకా కంపల్సరీ చేయలేదని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.
పేద ప్రజల సౌకర్యం కోసమే ఈ ఆలోచన
ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశాన్ని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) వివరించింది. ముఖ్యంగా తక్కువ ధర కలిగిన ఫోన్లను వాడే పేద ప్రజలకు సౌకర్యంగా ఉంటుందనే ఈ ఆలోచన చేసినట్లు తెలిపింది. తక్కువ మెమరీ, పరిమిత వనరులు ఉన్న ఫోన్లు వాడేవారు ప్లే స్టోర్ నుండి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం, ఇన్‌స్టాల్ చేయడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. అదే ఫోన్ కొనేటప్పుడే అందులో యాప్ ఉంటే వారికి సులభంగా ఉంటుంది. యాప్ స్పేస్ గురించి వారు ఆందోళన చెందాల్సిన పని ఉండదు అని అధికారులు పేర్కొన్నారు.
వినియోగదారులదే తుది నిర్ణయం
ఒకవేళ ఈ ప్రతిపాదన భవిష్యత్తులో అమల్లోకి వచ్చినా, ఆ యాప్‌ను వాడాలా వద్దా అనేది పూర్తిగా వినియోగదారుల ఇష్టమని ప్రభుత్వం స్పష్టం చేసింది. గూగుల్ మ్యాప్స్ లాంటి యాప్‌లు ఫోన్లలో ముందే ఎలా వస్తాయో.. ఇది కూడా అంతే. ఫోన్‌లో యాప్ ఉన్నంత మాత్రాన వాడాలని రూల్ ఏమీ లేదు. అది కేవలం ఒక ఆప్షన్ మాత్రమే. వాడటం, వదిలేయడం అనేది యూజర్ల ఛాయిస్ అని అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతానికి ప్రభుత్వం మరియు స్మార్ట్‌ఫోన్ కంపెనీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. తక్షణమే ఈ యాప్ ఫోన్లలో వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
