Hajj Deaths 2024: హజ్ యాత్రలో చనిపోయిన వాళ్లలో 98 మంది భారతీయులున్నారని భారత విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇవన్నీ సహజ మరణాలే అని వెల్లడించింది. ఇప్పటి వరకూ హజ్ యాత్ర కోసం లక్షా 75 వేల మంది సౌదీకి వెళ్లారని స్పష్టం చేసింది. అక్కడి భారతీయులకు ఎలాంటి సాయం అందించేందుకైనా సిద్ధంగానే ఉన్నామని ప్రకటించింది. ఇప్పటి వరకూ 10 దేశాలకు చెందిన దాదాపు 1,081 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయినట్టు తేలింది. సరిగ్గా సౌదీలో వేసవి మొదలైనప్పుడే ఈ యాత్ర మొదలవుతుంది. ఫలితంగా అక్కడి వేడిని తట్టుకోలేక చాలా మంది చనిపోతున్నారు. గంటల కొద్ది నడుస్తూ యాత్ర చేస్తారు. ఈ కారణంగానే డీహైడ్రేషన్‌కి గురవుతున్నారు. ఈ వారంలో సౌదీలో ఉష్ణోగ్రతలు 51 డిగ్రీలకుపైగానే నమోదయ్యాయి.


ఎండల కారణంగా చనిపోతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. సాధారణం కన్నా 30 రెట్లు ఎక్కువగా మరణాలు నమోదయ్యే ప్రమాదముందని హెచ్చరించింది. కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. హజ్ యాత్రకు వెళ్లాలనుకునే భారతీయులు వైద్య సాయం ఎలా పొందాలో వివరిస్తూ ఓ డాక్యుమెంట్ విడుదల చేసింది. పూర్తి స్థాయి మెడికల్ కేర్ అందించనుంది. ఫిట్‌నెట్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వనుంది. హెల్త్ కార్డులు ఇవ్వడంతో పాటు వ్యాక్సిన్‌లు కూడా అందించి యాత్రలో ఎక్కడా ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడనుంది. కొన్ని కీలక ప్రాంతాల్లో హెల్త్ డెస్క్‌లు అందుబాటులోకి తీసుకురానుంది. మరి కొన్ని చోట్ల వైద్య వసతులూ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది.