దేశ రాజధానిలో బాలికలకు.. మహిళలకు భద్రతే లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్భయ దేశాన్ని ఎంతగా కదిలించిందో ఇంకా కళ్ల ముందు ఉంది. ఇప్పుడు కొత్తగా "బాల నిర్భయ" ఉదంతం వెలుగు చూసింది. ఆ బాలికను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి.. హత్య చేసిన ఘటన.. ప్రజల్లో చర్చనీయాంశవుతోంది. రాజకీయంగానూ దుమారం రేపుతోంది. ఆగస్టు 1న నైరుతి ఢిల్లీలో తొమ్మిదేళ్ల మైనర్‌ బాలికపై దాడి చేసి సామూహిక అత్యాచారం, హత్య చేశారు. అంతేకాకుండా బాలిక తల్లిదండ్రుల అనుమతి లేకుండానే రాత్రికి రాత్రే అంత్యక్రియలు పూర్తి చేశారు.  ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన దాదాపు 200 మంది స్థానికులు భారీ నిరసనకు దిగారు. సీసీటీవీ పుటేజీని పరిశీలించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన కారులు డిమాండ్ చేశారు.  


బాధితురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. అంత్యక్రియలకు సహకరించిన పూజారితోపాటు, శ్మశాన వాటికలో పనిచేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్ సైన్స్ లాబ్‌ అధికారులు ఆధారాలు సేకరించారు. హత్యాచారం విషయంపై పోలీసులు ఆలస్యంగా స్పందించడంతో... ఆగస్టు 4న నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఈ కేసును సుమోటోగా తీసుకుంది. అంతేకాకుండా 48 గంటల్లో దీనిపై నివేదికను సమర్పించాలని ఢిల్లీ పోలీసుల్ని ఆదేశించింది.  


ఈ ఘటనపై రాజకీయ దుమారం రేగుతోంది. రాజకీయ నాయకులు, ప్రముఖులు ఖండిస్తున్నారు. అయితే తాజాగా ఈ కేసును వేగంగా దర్యాప్తు చేయడానికి క్రైమ్‌ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. బాధిత కుటుంబాన్ని రాహుల్ గాంధీ సహా అనేక మంది నేతలు పరామర్శించారు. బీజేపీ మాత్రం ఈ ఘటనను.. రాజకీయంగా వాడుకుంటున్నారని .. విపక్ష నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటారు. వారు సరిగ్గా పని చేయకపోతే.. ఢిల్లీ ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఈ బాల నిర్భయ ఉదంతం.. దేశంలో మహిళలకు.. బాలికల రక్షణపై ఎన్నో సందేహాలు లేవనెత్తుతోంది. 


ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారిస్తోంది.  బాధిత కుటుంబం దళిత కుటుంబం కావడంతో.. మరింతగా రాజకీయంగా ఫోకస్ వస్తోంది. దళితులకు రక్షణ లేకుండా పోతోందని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశ కుమార్తెలకు న్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే పాలకులు ఎవరు ఉన్నా.. ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. వారికి రక్షణ మాత్రం కరవైందన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతోంది.