ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపై జెండా ఎగరేయనున్నారు. వరుసగా ఇది ఎనిమిదోసారి. కరోనా మహమ్మారి వచ్చాక.. స్వాతంత్య్ర వేడుకలు వరుసగా ఇది రెండో సంవత్సరం. జాతీయ జెండాను ఎగురవేసిన కొద్దిసేపటికే ప్రధాని మోదీ ఉదయం 7:30 గంటలకు తన ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. జాతిని ఉద్దేశించి మాట్లాడతారు. 75 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని దూరదర్శన్ లో ప్రత్యక్షప్రసారం చూడొచ్చు.


డిసెంబర్ 2021 వరకూ అందరికీ వ్యాక్సిన్ అని మోడీ ప్రభుత్వం వాగ్దానం చేసింది. దీనిపై మాట్లాడే అవకాశం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. కరోనా కారణంగా దేశం ఎదుర్కొన్న పరిస్థితులను వివరించే అవకాశం ఉంది.   


ఈ ఏడాది కరోనా కారణంగా ఎక్కువ మందిని ఉత్సవాలకు ఆహ్వానించలేదు. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ నుంచి ఎంతో మంది క్రీడాకారులు పతకాలు సాధించారు. వారు సాధించిన ఆ పతకాలను చూపుతూ దేశ గౌరవాన్ని పెంచారు. అందుకే ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు వారినే ముఖ్య అతిథులుగా ఆహ్వానించింది ప్రభుత్వం. ‘నేషన్ ఫస్ట్.. నేషన్ ఆల్వేస్’ అనే థీమ్ తో ఈ సారి వేడుకలు జరుగుతున్నాయి.


కట్టుదిట్టమైన ఏర్పాట్లు..
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ దేశ రాజధానిలో పోలీసులు హైఅలర్ట్  ప్రకటించారు. ఎర్రకోట వద్ద 5 వేల మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎర్రకోట పరిసరప్రాంతాల్లో ఎత్తైన భవనాలపై ఎన్‌ఎస్‌జీ, స్వాత్ కమాండోలు..కైట్ క్యాచర్స్‌, షార్ప్ షూటర్లు పహరా కాస్తున్నారు. ఆగస్టు 15న డ్రోన్లు, బెలూన్లు వంటివి ఎగురవేయడంపై నిషేధం విధించారు. ఎర్రకోట చుట్టూ సాధారణ ప్రజలకు ఉదయం 4 నుంచి ఉదయం 10 వరకూ ఆంక్షలు ఉంటాయి. ఈ ప్రాంతంలో అధికారుల వాహనాలు మాత్రమే అనుమతిస్తారు.


ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్రయానికి వ‌చ్చిపోయే విమానాల‌కు అధికారులు కొన్ని ప‌రిమితులు విధించారు. ఈ మేర‌కు నోట‌మ్-నోటీస్ టూ ఎయిర్‌మెన్‌ జారీచేశారు. దీని ప్రకారం షెడ్యూల్డ్ విమానాలు అన్నీ షెడ్యూల్ ప్రకారమే న‌డుస్తాయి. ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్‌), బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఆర్మీకి చెందిన హెలికాప్టర్లతోపాటు ముఖ్యమంత్రులు, గ‌వ‌ర్నర్లు ప్రయాణాల కోసం వినియోగించే రాష్ట్రాల సొంత హెలికాప్టర్లకు ఎలాంటి పరిమితులు లేవని చెప్పారు.


Also Read: 75th Independence day: ఎర్రకోట మీదనే జెండాను ప్రధాని ఎందుకు ఎగరేస్తారు? ఏంటీ దాని ప్రత్యేకత? 


                  75th independence day : సుసంపన్న భారత్ దిశగా సుస్థిర ప్రయాణం..!