మొరాకోలో శుక్రవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. సుమారు 820 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ప్రభుత్వ అధికారులు ప్రాథమిక అంచనాలలో వెల్లడించారు. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.8 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైనట్లు తెలిపారు. భూమి తీవ్రంగా కపించడంతో ఇల్లు, కట్టడాలు కూలిపోయి పరిస్థితి భయానకంగా మారిందని స్థానికులు చెప్తున్నారు.


ప్రస్తుత నివేదికల ప్రకారం.. అల్‌ హావోజ్‌, మరాకేశ్‌, ఔర్జాజేట్‌, అజిలాల్‌, చిచౌవా, టరౌడెంట్‌ ప్రావిన్సులు, మున్సిపాలిటీలలో 820 మంది మరణించారని, మరో 650 మంది గాయపడ్డారని మొరాకో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన మరాకేశ్‌కు నైరుతి దిశలో 71 కిలోమీటర్ల దూరంలో దాదాపు 18.5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది.


మరాకేశ్‌లో ఆస్పత్రులు క్షతగాత్రులతో నిండిపోయాయని స్థానిక మీడియా వెల్లడించింది. మరణించిన వారు, గాయపడిన వారితో అక్కడి పరిస్థితులు దయనీయంగా ఉన్నట్లు పేర్కొంది. శిథిలాలలో చిక్కుకున్న వారి కోసం సహాయకచర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.


భూ ప్రకంపనలు చాలా దారుణంగా వచ్చాయని, తాము చాలా భయపడ్డామని స్థానిక వ్యక్తి ఒకరు మీడియాకు తెలిపారు. భవనాలు కదులుతుండడం తాను చూశానని, ప్రజలంతా బయటకు పరుగులు పెట్టి రోడ్లపైకి వచ్చారని, అంతా భయంతో వణికిపోతున్నారని వెల్లడించారు. చిన్న పిల్లలు ఏడుస్తున్నారని, వారి తల్లిదండ్రులు కూడా భయంతో వణికిపోతూ కనిపించారని చెప్పారు. పది నిమిషాల పాటు కరెంటు, టెలిఫోన్‌ నెట్‌వర్క్‌ కట్‌ అయ్యాయని, తర్వాత తిరిగి వచ్చాయని, అందరము బయటే ఉన్నామని తెలిపారు.


తీర ప్రాంత నగరాలైనన రబాత్‌, కాసాబ్లాంకా, ఎస్సౌయిరాలో కూడా భూకంపం సంభవించింది. అయితే అంత తీవ్ర స్థాయిలో కాదు. తమ దగ్గర అంత నష్టం జరగలేదని, అందరూ అరుపులు కేకల పెట్టడం తాము చూశామని మరాకేశ్‌కు పశ్చిమాన 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎస్సౌయిరా నివాసి మీడియాకు తెలిపారు.  ప్రజలంతా రాత్రి బయటే ఉన్నారని ఇళ్లలోకి వెళ్లలేదని వెల్లడించారు. భూకంపం వచ్చినప్పుడు తాను డ్రైవింగ్ లో ఉన్నానని, వెంటనే వాహనం ఆపేశానని, పరిస్థితి తీవ్రత అర్థమయ్యిందని మరో వ్యక్తి తెలిపారు. నది ఒడ్డు చీలిపోవడం చూశానని చెప్పారు.


అమెరికా జియోలాజికల్‌ సర్వేకు చెందిన పేజర్‌ సిస్టమ్‌ భూకంప ప్రభావంపై ప్రాథమిక అంచనాలు చేసింది. ఆర్థికంగా నష్టం వాటిల్లడంపై ఆరెంజ్‌ అలర్ట్‌ ఇచ్చింది. పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టం జరిగినట్లు తెలిపింది. భూకంపం సంభవించిన ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా పెద్ద భవనాల్లో ఉన్నారని, భూకంపానికి తీవ్ర ప్రభావితమయ్యేలా భవనాలు ఉన్నాయని యూఎస్‌జీఎస్ పేర్కొంది. దేశ చరిత్రలో ఇదే భారీ భూకంపం అని మొరాక్‌ మీడియా చెప్తోంది.


2004 లో మొరాకో ఈశాన్య భాగంలోని అల్‌ హొసీమా పట్టణంలో సంభవించిన భూకంపంలో 628 మంది చనిపోగా, 926 మంది గాయపడ్డారు. 1980లో మొరాకో పక్కనే ఉన్న అల్జీరియాలో అతి పెద్ద భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 7.3 మ్యాగ్నిట్యూడ్‌ గా నమోదైంది. ఈ విపత్తులో 2500 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 3 లక్షల మంది ఇళ్లు లేని వారుగా మిగిలిపోయారు. పెద్ద మొత్తంలో ఇళ్లు కూలిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది.