Yamuna Expressway Accident: మధురలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యమున ఎక్స్‌ప్రెస్‌ వేపై స్లీపర్ కోచ్ బస్, కార్ ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. బిహార్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న బస్‌ని కార్ బలంగా ఢీకొట్టింది. ఫలితంగా...ఒక్కసారిగా కార్‌లో మంటలు చెలరేగాయి. బస్‌లో ఉన్న వాళ్లంతా సురక్షితంగా బయటకు వచ్చినప్పటికీ కార్‌లో ఉన్న ఐదుగురు మంటలకు ఆహుతి అయ్యారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. మధురలోని మహావన్‌ ప్రాంతం వద్ద ఈ ప్రమాదం జరిగింది. డివైడర్‌ని ఢీకొట్టి అదుపుతప్పిన బస్ నేరుగా కార్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకి మంటలు చెలరేగాయి. బస్‌లో ఉన్న వాళ్లు వెంటనే అప్రమత్తమై దూకేశారు. కానీ కార్‌లో ఉన్న వాళ్లు మాత్రం ఎటూ కదల్లేక పోయారు. చివరకు సజీవ దహనమయ్యారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. అయితే స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం..ఈ ప్రమాదం జరిగిన అరగంట వరకూ ఎవరూ స్పందించలేదు. అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా రావడం వల్ల మంటల తీవ్రత పెరిగింది. 






"బస్‌ ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్‌ని ఢీకొట్టింది. ఆ తరవాత టైర్ పేలిపోయింది. కార్‌ని బలంగా ఢీకొట్టినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. మృతుల వివరాలు సేకరిస్తున్నాం"

 

- పోలీసులు 





 

గత నెల కూడా యమున ఎక్స్‌ప్రెస్‌వైపే ఘోర ప్రమాదం జరిగింది. రెండు బస్‌లు ఢీకొట్టుకున్న ఘటనలో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. గ్రేటర్ నోయిడాని, ఆగ్రాని అనుసంధానించే యమున ఎక్స్‌ప్రెస్‌వే దేశంలోనే ఆరో అతి పెద్ద ఎక్స్‌ప్రెస్‌వేగా నిలిచింది. మొత్తం ఆరు వరుసల ఈ రహదారి పొడవు 165.5 కిలోమీటర్లు. 

 

సిక్కిమ్‌లో ఓ మిల్క్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. రాణిపూల్‌ వద్ద ఓ ఫెయిర్ జరుగుతుండగా ఒక్కసారిగా అదుపు తప్పి అక్కడి వాళ్లపై దూసుకొచ్చింది. అక్కడే పార్క్ చేసి ఉన్న కార్‌లను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కనీసం 20 మంది తీవ్రంగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. వేగంగా వచ్చి ఢీకొట్టడం వల్ల తీవ్ర గాయాలయ్యాయి. రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. అక్కడి CC కెమెరాలో ఈ ప్రమాద దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. వాహనాల కింద నలిగిపోయిన వాళ్లకి స్థానికులు సాయం అందించి హాస్పిటల్‌కి తరలించారు. అయితే..ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మిల్క్ ట్యాంకర్‌ బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధరించారు.