Kuwait News: కువైట్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం ఈ మృతుల్లో 5 గురు భారతీయులున్నారు. వీళ్లంతా కేరళకి చెందిన వాళ్లే. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది.  Kuwait News Agency (KUNA) ఈ విషయం వెల్లడించింది. ఓ బిల్డింగ్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఇవాళ ఉదయం (జూన్ 12) బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు భవనం అంతా వ్యాపించాయి. లోపల చాలా మంది చిక్కుకున్నారు. మంటలు అదుపులోకి వచ్చాయని స్థానిక మీడియా తెలిపింది. ప్రమాదానికి కారణమేంటో అధికారులు విచారణ చేపడుతున్నారు. మంగఫ్ బ్లాక్‌లోని ఆరంతస్తుల బిల్డింగ్‌లో ఈ ప్రమాదం జరిగింది. కింది అంతస్తులోని కిచెన్‌లో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రమాదం జరగ్గా తరవాత కాసేపటికే అపార్ట్‌మెంట్‌లోని అన్ని ఫ్లోర్స్‌కీ వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమై కొందరు బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలోనే మంటల్లో చిక్కుకుని ఆహుతి అయ్యారు. మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంకొందరు శ్వాస తీసుకోడానికి ఇబ్బంది పడుతున్నారు. వీళ్లలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని స్థానిక మీడియా తెలిపింది. 


43 మంది బాధితులు హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నట్టు కువైట్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ ప్రమాదంపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. ఈ ఘటన తనకెంతో దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపారు. భారత ప్రతినిధులు ప్రమాదంపై విచారణ జరుపుతున్నారని, అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. 


"కువైట్‌లో జరిగిన ప్రమాదం నాకెంతో దిగ్భ్రాంతికి కలిగించింది. దాదాపు 40 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. మా దేశ ప్రతినిధి అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పూర్తి సమాచారం కోసం ఎదురు చూస్తున్నాం. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను"


- ఎస్‌ జైశంకర్, భారత విదేశాంగ మంత్రి






ఎంబసీ కీలక ప్రకటన..


కువైట్‌లోని ఇండియన్ ఎంబసీ భారతీయుల కోసం ప్రత్యేకంగా ఓ హెల్ప్‌లైన్ నెంబర్ కేటాయించింది. బాధితులకు అన్ని విధాలుగా సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది. చాలా మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొని ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు వెల్లడించారు. పరిమితికి మించి బిల్డింగ్‌లో ఎవరినీ ఉంచొద్దని హెచ్చరించినా ఎవరూ పట్టించుకోడం లేదని, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం ఎక్కువ అవుతోందని అధికారులు చెబుతున్నారు.


Also Read: Annamalai vs Tamilisai: తమిళనాడులో అన్నామలైతో క్లాష్, ఏపీలో అమిత్ షా క్లాస్‌ - తమిళసై చుట్టూ నడుస్తున్న వివాదమిదే