Bus Accident in Iran: ఇరాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాకిస్థాన్ నుంచి ఇరాక్‌కి వెళ్తున్న బస్ యజ్ద్ ప్రావిన్స్ వద్ద అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 35 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. బస్సులో మొత్తం 53 మంది ప్యాసింజర్స్ ఉన్నట్టు అక్కడి మీడియా వెల్లడించింది. మృతులంతా పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌కి చెందిన లర్కానా వాసులేనని తెలిపింది. ఇరాన్‌కి చెందిన IRNA న్యూస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం...ఆగస్టు 20వ తేదీన రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 18 మంది గాయపడినట్టు పాకిస్థాన్ Dawn న్యూస్ వెల్లడించింది. స్థానిక ఆసుపత్రికి తరలించి వాళ్లకి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పాకిస్థాన్ డిప్యుటీ ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ స్పందించారు. మృతులు కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడిన వాళ్ల గురించి ఆరా తీస్తున్నామని, వాళ్లకు అన్ని విధాలుగా అండగా ఉంటామని వెల్లడించారు.
"టెహ్రాన్‌ని యజ్ద్ ప్రావిన్స్‌లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పాకిస్థాన్ పౌరుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. గాయపడిన వాళ్లు సురక్షితంగా ఉండేలా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం. టెహ్రాన్‌లోని దౌత్యవేత్తకి ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నాం. మృతదేహాల్ని వీలైనంత త్వరగా పాకిస్థాన్‌కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం"
- ఇశాక్ దర్, పాకిస్థాన్ డిప్యుటీ ప్రధాని