ఆన్‌లైన్ పరిచయం కొంప ముంచింది..


సోషల్ మీడియా వచ్చాక ఆన్‌లైన్ పరిచయాలు పెరిగిపోతున్నాయి. ముక్కు, మొహం తెలియన వాళ్లతో గంటల తరబడి చాటింగ్‌లు చేయటం, పరిధులు దాటటం లాంటివి ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. ఇలాంటి పరిచయాలన్నీ మోసపోవటంతోనే ముగిసిపోతున్నాయి. దేశరాజధాని దిల్లీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఓ 55 ఏళ్ల వ్యక్తికి సోషల్ మీడియాలో ఓ అమ్మాయి పలకరించింది. పదేపదే మాట్లాడేది. వీరి పరిచయం కాస్త ముందుకెళ్లింది. ఉన్నట్టుండి ఓ రోజు తన ఫ్లాట్‌కు రమ్మంటూ ఆ అమ్మాయి మెసేజ్ చేసింది. ఆమె చెప్పినట్టుగానే అమ్మాయి ఫ్లాట్‌కి వెళ్లి రాత్రంతా గడిపాడు ఆ 55 ఏళ్ల వ్యక్తి. ఆ తరవాత  ట్విస్ట్‌కి ఆ పెద్దాయనకు షాక్ తగిలింది. వెంటనే పోలీస్ స్టేషన్‌కు పరుగులు పెట్టాడు. 


అసలు కథేంటంటే..? 


ఆ చనువుగా ఉన్న అమ్మాయి...పెద్దాయనను హనీట్రాప్ చేసింది. మెల్లగా మాటల్లోకి దించి తన ఫ్లాట్‌కి రప్పించుకుంది. ఇద్దరూ కాసేపు గడిపాక 
సడెన్‌గా ముగ్గురు వ్యక్తులు ఫ్లాట్‌కి వచ్చారు. పోలీసులమంటూ పెద్దాయనను బెదిరించారు. ఈ గుట్టు రట్టు కాకుండా ఉండాలంటేడబ్బులివ్వాల్సిందేనని పట్టు పట్టారు. చేసేదేమి లేక లక్షన్నర సమర్పించుకున్నాడు బాధితుడు. ఆ తరవాత కానీ అర్థం కాలేదు. ఆ నలుగురూ కలిసి ఆడిన నాటకమిదని. అప్పటికైనా మేలుకున్న బాధితుడు వెంటనే పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు. ఓ అమ్మాయి హనీప్రీత్ అనే ఓ అమ్మాయి తనను నమ్మించి మోసం చేసిందని చెప్పాడు. దర్యాప్తులో భాగంగా అమ్మాయి ఫ్లాట్‌కు వెళ్లిన పోలీసులు అసలు నిజాలు బయటపెట్టారు. హరియాణాకు చెందిన పవన్, మన్‌జీత్, దీపక్‌..పోలీసులమని నాటకమాడి బాధితుడి నుంచి లక్షన్నర రూపాయలు కొల్లగొట్టారని, ఆ అమ్మాయి పరారీలో ఉందని వెల్లడించారు. హనీప్రీత్ అనే అమ్మాయిని మిగతా ముగ్గురు నిందితులు తరచూ కలిసేవారని అపార్ట్‌మెంట్ యజమాని చెప్పాడు.


బడా బాబుల్ని బుట్టలో వేసుకోవటమే పని..


లక్షన్నరతో ఉడాయించిన నిందితులు, తమ వస్తువుల కోసం మరోసారి ఫ్లాట్‌కు వచ్చారు. అప్పటికే వీరిపై నిఘా ఉంచిన పోలీసులు వెంటనేఅరెస్ట్ చేశారు. పవన్ అనే వ్యక్తి ఈ ప్లాన్‌ చేశాడని, గతంలోనూ ఈ తరహా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఓ ఫ్లాట్‌ని అద్దెకు తీసుకున్నారని, బడా బాబుల్ని బుట్టలో వేసుకుని ఇలా మోసం చేయటం వీరికి అలవాటేనని చెప్పారు. పరారీలో ఉన్న అమ్మాయి కోసం వెతుకుతున్నారు పోలీసులు. సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్ రిక్వెస్ట్‌లను వెరిఫై చేయకుండా యాక్సెప్ట్ చేయకూడదని, ఫేక్ అకౌంట్‌గా అనుమానం వస్తే వెంటనే బ్లాక్‌ చేయాలని సూచిస్తున్నారు.