ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు రోజుల్లో 617.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ వర్షాలతో చైనాను వరదలు ముంచెత్తుతున్నాయి. శనివారం నుంచి ఇప్పటివరకు నాలుగు రోజుల్లో కురిసిన వర్షంతో చైనాలో చాలా ప్రదేశాలు మునిగిపోయాయి. ఈ వరదల్లో దాదాపు 25 మంది వరకు చనిపోయినట్లు సమాచారం.
ముఖ్యంగా చైనాలోని హెనన్ ప్రావిన్స్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత 1000 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో కుంభవృష్టి కురవడంతో భీకర వరదలు సంభవించాయి. ప్రావిన్స్‌లోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
హెనన్ ప్రావిన్స్.. అనేక వ్యాపార కార్యకలాపాలు, పరిశ్రమలు, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదిక. చైనా అతిపెద్ద ఐఫోన్ తయారీ ప్లాంట్ కూడా ఇక్కడే ఉంది. ఈ రాష్ట్రంలో గత శనివారం నుంచి కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. 'ఐఫోన్ సిటీ'గా పిలిచే రాష్ట్ర రాజధాని జెంగ్జౌలో శనివారం నుంచి మంగళవారం వరకు 617.1 మీమీ వర్షంపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే ఇక్కడ ఒక్క ఏడాదిలో నమోదయ్యే వర్షపాతం సగటున 640.8 మి.మీలు. అంటే దాదాపు ఏడాది పాటు పడే వర్షం నాలుగు రోజుల్లో కురిసింది. గత 1000 ఏళ్లలో ఇంత భారీ స్థాయిలో వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారి అని అక్కడి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
భారీ వర్షాలతో ఈ ప్రావిన్స్‌ను ఆనుకుని ఉన్న ఎల్లో నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వరదలు సంభవించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలోకి వెళ్లాయి. వీధులు నదులను తలపిస్తున్నాయి. రోడ్లపై ఉండాల్సిన కార్లు నీటిపై పడవల్లా తేలియాడుతున్నాయి. ఇప్పటికే అనేక వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. హెనన్ వ్యాప్తంగా అనేక జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. జెంగ్జౌకు పశ్చిమాన ఉన్న యిహెతన్ డ్యామ్ ఏ క్షణానైనా కూలేలా ఉన్నట్లు తెలుస్తోంది.
రైల్లో చిక్కుకున్న ప్రయాణికులు..
వరదల కారణంగా ఇప్పటివరకు 25 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. జెంగ్జౌలో లక్ష మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రోడ్లపైకి వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. బస్సు, రైళ్ల సర్వీసులను నిలిపివేశారు. 250కి పైగా విమానాల రాకపోకలను నిలిపివేశారు.
జెంగ్జౌలోని ఓ సబ్‌వే టన్నెల్‌లోకి వరద నీరు భారీగా చేరడంతో అందులో నుంచి వెళ్తోన్న రైల్లోకి నీరు వచ్చింది. అనేక మంది రైల్లో చిక్కుకుపోయారు. ఛాతీ వరకు నీటిలో నిల్చున్న ప్రయాణికుల వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. సహాయకచర్యలు చేపట్టిన అధికారులు ప్రయాణికులను టన్నెల్ నుంచి బయటకు తీసుకొస్తున్నారు.