కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ గ్రేటర్‌ రాయలసీమకు గొడ్డలి పెట్టు అని మాజీ మంత్రి మైసూరారెడ్డి పేర్కొన్నారు. హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ, వెలుగొండ, సోమశిల, కండలేరు ప్రాజెక్టులకు నీరొచ్చే పరిస్థితి ఉండదని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మైసూరారెడ్డి మాట్లాడారు.


కేంద్రం చేతిలో అధికారం..



రాజకీయ లబ్ధి కోసం ఏపీ, తెలంగాణ సీఎంలు ఘర్షణ పడి కేంద్రం చేతిలో మొత్తం అధికారాన్ని పెట్టేశారని మైసూరా రెడ్డి ఆరోపించారు. ఈ వివాదంపై చర్చించుకుంటే ఏమయ్యేదని ప్రశ్నించారు. గ్రేటర్‌ రాయలసీమ ప్రాంతానికి ఓ ప్రభుత్వం ఉండి ఉంటే అన్యాయం జరిగేది కాదని వ్యాఖ్యానించారు. నదీజలాల వివాదాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకోవాలని మైసూరా సూచించారు. శ్రీశైలంలో విద్యుత్తు ఉత్పత్తి మూడు టీఎంసీల నీరు మాత్రమే వినియోగించాలని ఇష్టానుసారం విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే సీఎం జగన్ ఎందుకు మాట్లాడడం లేదని మైసూరారెడ్డి నిలదీశారు.


కూర్చొని మాట్లాడుకోలేరా?


ఈ గెజిట్ రాయలసీమ ప్రాజెక్టులకు గొడ్డలిపెట్టు అని మాజీ మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాయలసీమ ఏపీలో అంతర్భాగమా కాదా అన్నది సీఎం జగన్ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. గెజిట్ ను స్వాగతించే ముందు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాజెక్టుల గురించి ఆలోచన చేయలేదన్నారు. పోలవరంపై ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుతున్న సమయంలో కృష్ణా జలాల కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకోలేరా అంటూ ప్రశ్నించారు.


ప్రభుత్వం ఉండి ఉంటే.. 


రాయలసీమ ప్రాంతానికి ఒక ప్రభుత్వం ఉండి ఉంటే రాయలసీమ ప్రజలకు ఇంత అన్యాయం జరిగేది కాదని మైసూరా అభిప్రాయపడ్డారు. ఇరు రాష్ట్రాల సీఎంలు మాట్లాడక పోవడం వల్లే కేంద్రం జోక్యం చేసుకుందని, రాజకీయ లబ్ధి కోసం కీచులాడుకుని జుట్టుని కేంద్రం చేతిలో పెట్టారని వ్యాఖ్యానించారు. రాయలసీమ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేసిన ఆయన, గతంలో ప్రతిపక్ష నేతగా సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ ప్రాజెక్టు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేసింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు.


 


విద్యుత్ ఉత్పత్తి పేరుతో ఇష్టం వచ్చినట్లుగా నీటిని తోడేస్తే రెండు రాష్ట్రాలకు ఇబ్బందే. రాయలసీమ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం పోరాటం చేయడం లేదు. ఈ పరిస్థితి ఏపీ ప్రభుత్వానికి మంచిది కాదు. గ్రేటర్ రాయలసీమ ఒక రాష్ట్రం అయితే ఈ నష్టం జరిగేది కాదు.
                                                                                - మైసూరా రెడ్డి, మాజీ మంత్రి