దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో 13 ఏళ్ల తర్వాత గుజరాత్ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో 49 మంది దోషులుగా, 28 మంది నిర్దోషులుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.







జస్టిస్ ఏఆర్ పటేల్.. బుధవారం దోషులకు శిక్ష వేయనున్నారు. ఈ కేసులో మొత్తం 77 మందిని విచారించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ కేసు విచారణ ముగిసింది. అయితే పలు వాయిదాల తర్వాత ఈరోజే తీర్పు వచ్చింది.


వరుస పేలుళ్లు..



2008లో ఉగ్ర‌వాదులు అహ్మదాబాద్‌లో వ‌రుస  బాంబు పేలుళ్ల‌కు పాల్ప‌డ్డారు. జులై 26న గంట వ్యవధిలోనే అహ్మదాబాద్‌ నగరంలో సుమారు 21 చోట్ల వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో సుమారు 56 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. నిషేధిత స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమీ)కి చెందిన ఉగ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం)తో సంబంధమున్న మూక‌లే ఈ బాంబు దాడుల‌కు పాల్ప‌డ్డాయ‌ని ద‌ర్యాప్తు వ‌ర్గాలు తేల్చాయి. 

 

ప్రతీకారంగా..

 

2002 గోద్రా అల్లర్లకు ప్రతికారంగానే ఉగ్రవాదులు 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్లకు  పాల్ప‌డ్డార‌ని ద‌ర్య‌ప్తు వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఈ అల్లర్లలో మైనార్టీ వర్గానికి చెందిన చాలా మందిని చంపేశారు. 

 

అహ్మదాబాద్ పేలుళ్ల తర్వాత గుజరాత్ పోలీసులు 85 మందిని అరెస్ట్ చేశారు. విచారణ తర్వాత 78 మందిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. 13 ఏళ్ల సుదీర్ఘ విచారణలో దాదాపు 11 వందల మందిని ప్రాసిక్యూషన్ ప్రశ్నించింది.