బ్రిటన్‌ను సుదీర్ఘకాలం పాలించిన మహారాణి క్వీన్‌ ఎలిజెబెత్‌ 2 గౌరవార్థంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నాణాన్ని విడుదల చేశారు. ఎలిజెబెత్‌ 2 మరణించి సంవత్సరం అయిన సందర్భంగా రూ.192 కోట్ల విలువైన నాణాన్ని ఆవిష్కరించారు. లగ్జరీ లైఫ్‌స్టైల్‌ బ్రాండ్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఈ నాణాన్ని తయారుచేసింది. ఇప్పటి వరకు ఇదే అత్యంత విలువైన నాణెం కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నాణెం తయారీకి దాదాపు 4 కిలోల బంగారం, 6400 కంటే ఎక్కువ వజ్రాలు ఉపయోగించారని, దీని విలువ సుమారు 23 మిలియన్‌ డాలర్లు (రూ.192కోట్లు ) అని సీఎన్‌ఎన్‌ తన కథనంలో వెల్లడించింది. నాణెం 9.6 అంగుళాల వ్యాసార్థంతో బాస్కెట్‌బాల్‌ పరిమాణంలో ఉన్నట్లు తెలుస్తోంది.


ప్రముఖ పోట్రెయిట్‌ ఆర్టిస్ట్‌ మేరీ గిల్లిక్‌, ఆర్నోల్డ్‌ మాచిన్‌, రాఫేల్‌ మక్లౌఫ్‌, ఇయాన్‌ ర్యాంక్‌ బ్రాడ్లీల చేత దివంగత మహారాణి ఎలిజెబెత్‌ 2 చిత్రాలను రూపొందించారు. పూర్తి నాణెంలో మధ్యలో ఉన్న కాయిన్‌ బరువు రెండు పౌండ్ల కంటే ఎక్కువగా ఉంది. చుట్టూ ఉన్న చిన్న చిన్న కాయిన్స్‌ ఒక్కొక్కటి ఒక ఔన్స్‌ బరువు ఉన్నాయని కథనాల్లో వెల్లడించారు. మధ్యలో ఒక పెద్ద కాయిన్‌ దాని చుట్టూ కాయిన్స్‌తో అమర్చిన ఒక పెద్ద నాణాన్ని చాలా అద్భుతంగా తయారు చేశారు. అందులో వజ్రాలు, బంగారు నాణేలు మెరిసిపోతున్నాయి. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది.


ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఈ కాయిన్‌కు సంబంధించిన చిత్రాలను సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాం ఎక్స్‌ (ట్విట్టర్‌) లో పంచుకుంది. నాణాన్ని 'ది క్రౌన్‌'గా పేర్కొన్నారు. ది క్రౌన్‌ను పరిచయం చేస్తున్నాం, క్వీన్‌కు జీవితంలో ఒకసారి ఇచ్చే గొప్ప గౌరవం లాంటిది ఇది. హర్‌ మాజెస్ట్రీ క్వీన్‌ ఎలిజెబెత్‌ 2 గొప్ప లెగసీని స్మరించుకునేందుకు ఈ నాణెం అద్భుతమైన నివాళి అని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది.


ఈ నాణాన్ని పూర్తిగా చేతులతో తయారు చేశారు. ఇందులో అమర్చిన వజ్రాలను కట్‌ చేసేందుకు సరిగ్గా అమర్చేందుకు చాలా కష్టపడ్డారని, డిజైన్‌ను ఎంతో చక్కగా, పర్‌ఫెక్ట్‌గా వచ్చేందుకు చాలా శ్రమించారని, అలాగే బ్రిటిష్‌ యూనియన్‌ ఫ్లాగ్‌ను ప్రతిబింబించడానికి రెండు విభిన్న సెట్టింగ్స్‌ ఉపయోగించామని ఈస్ట్‌ ఇండియా కంపెనీ తెలిపింది. క్వీన్‌ చెప్పిన వ్యాఖ్యలను కాయిన్‌ అంచుల చుట్టూ వచ్చేలా చేశారు. '
'వయస్సుతో అనుభవం వస్తుందని, సరిగ్గా ఉపయోగిస్తే అదే పుణ్యం అవుతుందని, ఇంకొకటి గత విభేదాలను వెనుక ఉంచి కలిసి ముందుకు సాగడానికి సిద్ధంగా ఉండాలి' అని ఆమె చెప్పిన మాటలు నాణెం అంచులో అమర్చారు. నాణెం ఒక వైపు అంచులో ఈస్ట్‌ ఇండియా కంపెనీ పేరు కూడా ఉంటుంది. క్వీన్‌ ఎలిజెబెత్‌ 2 2022 సెప్టెంబరు 8వ తేదీన తన 96 ఏళ్ల వయసులో మరణించారు. వృద్ధాప్యం కారణంగా తుదిశ్వాస విడిచారు.  తన స్కాటిష్‌ సమ్మర్‌ రెసిడెన్స్‌ అయిన బాల్మోరల్‌ లో చనిపోయారు. ఆమె దాదాపు 70 ఏళ్ల పాటు బ్రిటన్‌ను పాలించారు. 1952లో ఆమె బ్రిటన్‌ సింహాసనాన్ని అధిష్టించారు. అప్పటి నుంచి ఏకంగా 15 మంది యూకే ప్రధాన మంత్రుల హయాంలో ఆమె మహారాణిగా ఉన్నారు. 2022 ఫిబ్రవరిలో రాణి 70 సంవత్సరాల సేవకు గుర్తుగా ప్లాటినం జూబ్లీ జరుపుకున్నారు. ఈ ఘనత సాధించిన మొదటి బ్రిటిష్ చక్రవర్తిగా నిలిచారు.