ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన 13వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం నేడు జరిగింది. కరోనా కారణంగా వర్చువల్ గా ఈ సమావేశం నిర్వహించారు. భారత్ అధ్యక్షత వహించడానికి సహకరించినందుకు సభ్య దేశాల అధినేతలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అఫ్గానిస్థాన్, కరోనా సహా పలు అంశాలపై సభ్య దేశాధినేతలు కీలక వ్యాఖ్యలు చేశారు.
రాబోయే 15 ఏళ్లలో బ్రిక్స్ కూటమి మరింత బలంగా మారాలి. ఈ ఏడాది సదస్సుకు నేతృత్వం వహించిన భారత్ ఇదే ఆకాంక్షిస్తోంది. బ్రిక్స్ సాధించిన ఘనతలు చూసి గర్విస్తున్నాను. బ్రిక్స్ కౌంటర్ టెర్రరిజం యాక్షన్ ప్లాన్ ను అమలు చేస్తాం - నరేంద్ర మోదీ, ప్రధాని
అంతా అమెరికా వల్లే..
అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా, తన మిత్ర దేశాల బలగాలను ఉపసంహరించుకోవడం వల్ల కొత్త సంక్షోభం వచ్చింది. ఇది ఈ ప్రాంతం సహా ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై స్పష్టత లేదు. ఈ అంశంపై బ్రిక్స్ సభ్యదేశాలు దృష్టి సారించడం అభినందనీయం. ఉగ్రవాదం, డ్రగ్స్ సరఫరాకు అఫ్గానిస్థాన్ వేదిక కాకూడదు. సరిహద్దు దేశాలకు ముప్పుగా పరిణమించకూడదు. - వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు
ఈ భేటీలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోజా పాల్గొన్నారు.