King Cobra Rescued: కర్ణాటకలో 12 అడుగుల కింగ్ కోబ్రా స్థానికులను టెన్షన్ పెట్టింది. చెట్టుపైకి ఎక్కిన పాముని చూసి అంతా హడలిపోయారు. రోడ్డు దాటుతూ వచ్చిన పాము ఓ ఇంట్లోని చెట్టుపైకి వెళ్లింది. అక్కడి నుంచి ఎంత సేపటికీ కదలలేదు. ఇది గుర్తించిన స్థానికులు వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఓ టీమ్‌ రంగంలోకి దిగింది. పాముని పట్టుకునే ముందు స్థానికులకు కొన్ని సూచనలు చేశారు. ఆ సమయంలో ఏం చేయాలి..? ఏం చేయొద్దో వివరించారు. పాముని పట్టుకునే క్రమంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వచ్చిన వెంటనే ఓ పెద్ద రాడ్‌ని తీసుకున్నారు. ఆ రాడ్‌ని పాము ఉన్న కొమ్మపైన పెట్టారు. మెల్లగా ఆ రాడ్ సాయంతో పాముని కిందకు దించారు. ఆ వెంటనే తమతో తెచ్చుకున్న ఓ పెద్ద బ్యాగ్‌లో దాన్ని పంపించారు. చాలా ఒడుపుగా పాముని పట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పాముని చూస్తేనే వెన్నులో వణుకు పుడుతోంది. అయినా ఏ మాత్రం భయపడకుండా రెస్క్యూ టీమ్‌ చాలా జాగ్రత్తగా ఆ పాముని రక్షించింది. ఆ తరవాత అడవిలో వదిలేసింది. 


"పాముని చూసిన వెంటనే స్థానికులు మాకు సమాచారం అందించారు. టీమ్ వెళ్లిన వెంటనే అందరికీ కొన్ని సూచనలు చేశాం. పరిసరాలు పరిశీలించిన వెంటనే ఆ పాముని ఎలాగైనా రక్షించి అడవిలో వదిలేయాలని అనుకున్నాం. స్థానికుల్లోనూ అవగాహన కల్పించాం. కొన్ని డాక్యుమెంట్స్‌నీ అందరికీ పంచాం. మొత్తానికి ఆ పాముని పట్టుకుని జాగ్రత్తగా అడవిలో వదిలాం"


- అటవీ అధికారులు