సినిమా రివ్యూ: సప్త సాగరాలు దాటి సైడ్ బి 
రేటింగ్: 2.5/5
నటీనటులు: రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్, చైత్ర జె అచార్, అచ్యుత్ కుమార్, రమేష్ ఇందిరా తదితరులు  
ఛాయాగ్రహణం: అద్వైత గురుమూర్తి
సంగీతం: చరణ్ రాజ్!
నిర్మాతలు: రక్షిత్ శెట్టి, టీజీ విశ్వప్రసాద్!  
రచన - దర్శకత్వం: హేమంత్ ఎం రావు
విడుదల తేదీ: నవంబర్ 17, 2023  


Sapta Sagaradaache Ello Side B Review In Telugu: కన్నడ హీరో రక్షిత్ శెట్టికి తెలుగులో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 'సప్త సాగరాలు దాటి - సైడ్ ఏ' విడుదలైన విషయం తెలుగు ప్రేక్షకుల్లో కొందరికి తెలియదు. కానీ, ఆ సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. కానీ, వసూళ్లు రాలేదు. ఆ సినిమాకు సీక్వెల్ 'సప్త సాగరాలు దాటి - సైడ్ బి' నేడు థియేటర్లలో విడుదలైంది.   
 
కథ (Saptha Sagaralu Dhaati Side B Story): జైలు నుంచి మను (రక్షిత్ శెట్టి) బయటకు వస్తాడు. కానీ, ప్రియా (రుక్మిణీ వసంత్) జ్ఞాపకాలు నుంచి బయటకు రాలేకపోతాడు. అతని మనసు మార్చడానికి స్నేహితుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలో మనుకు వేశ్య సురభి (చైత్ర జె అచార్) పరిచయం అవుతుంది. ఆమె సహాయంతో ప్రియా ఆచూకీ తెలుసుకుంటాడు. పెళ్లి తర్వాత ఆమెకు ఓ బాబు జన్మిస్తాడు. అయితే... ప్రియా వైవాహిక జీవితం సంతోషంగా లేదని తెలుసుకుంటాడు.పైగా, ఆమె పాడటం కూడా ఆపేసిందని అర్థం అవుతుంది. 


ప్రియా సంతోషం కోసం మను ఏం చేశాడు? ఆమె మళ్ళీ పాడిందా? లేదా? సురభి, మను పరిచయం ఏ తీరాలకు దారి తీసింది? జైలులో మను కారణంగా వినికిడి కోల్పోయిన సోమ (రమేష్ ఇందిరా), బయటకు వచ్చిన తర్వాత ఏం చేశాడు? అనేది వెండితెరపై చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ (Saptha Sagaralu Dhaati Side B Review): 'సప్త సాగరాలు దాటి - సైడ్ ఏ' సినిమాలో క్యారెక్టరైజేషన్లు, డిటైలింగ్ పరంగా దర్శకుడు హేమంత్ రావు ఓ స్టాండర్డ్ సెట్ చేశారు. హృదయానికి హత్తుకునే సంగీతం కూడా ప్రేక్షకులకు చేరువైంది.  అందువల్ల, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో 'సైడ్ బి' మీద అంచనాలు పెరిగాయి. వాటిని, అందుకునే స్థాయిలో 'సైడ్ బి' ఉందా? అంటే... 'లేదు' అని చెప్పాలి.


తొలి ప్రేమ ఎప్పుడూ ప్రత్యేకమే. దాన్ని అంత త్వరగా మర్చిపోలేరనే కథాంశాలతో తెరపై వచ్చాయి. అయితే... ప్రేమించిన అమ్మాయి మరొకరిని పెళ్లి చేసుకున్నా, ఆమె సంతోషం కోసం ప్రేమికుడు ఏం చేశాడనేది సినిమా కథ. ఆ పాయింట్ స్క్రీన్ మీదకు తీసుకు రావడానికి దర్శకుడు కొంచెం తడబడ్డాడు. 'సైడ్ ఏ'లో కమాండ్ చూపించిన హేమంత్ రావు... 'సైడ్ బి'లో క్యారెక్టరైజేషన్లను పూర్తిగా ఎలివేట్ చేయలేదు. 


పురాణాల నుంచి మనం నేర్చుకున్నది ఒక్కటే... మరొకరి భార్యపై మనసు పడిన రావణ బ్రహ్మది తప్పు అని! మరి, ఆ చిన్న లాజిక్ రైట్స్ హేమంత్ రావు, గుండు శెట్టి ఎలా మర్చిపోయారో? 'సప్త సాగరాలు దాటి - సైడ్ బి'లో రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth)కు తెలియకుండా నీడలా రక్షిత్ శెట్టి తిరిగిన సన్నివేశాలను యాక్సెప్ట్ చేయడం కష్టమే. ఆ సన్నివేశాలు సైతం సాగదీసినట్లు ఉంటాయి. ఇక... రుక్మిణీ వసంత్, ఆమె భర్త మధ్య బంధాన్ని సైతం సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు.


'సైడ్ బి'లో రైటింగ్ పరంగా చైత్ర అచార్ క్యారెక్టర్ బావుంది. రచయితగా హేమంత్ రావు వంద శాతం మెప్పించలేదు. కానీ, దర్శకుడిగా మాత్రం ఆయన మార్క్ చూపించారు. కొన్ని సింబాలిక్ షాట్స్ తీసిన విధానం సూపర్. నిశితంగా గమనిస్తే తప్ప ప్రేక్షకులు అందరూ వాటిని గమనించలేదు. 'సైడ్ ఏ'తో పోలిస్తే... 'సైడ్ బి'లో ఆ స్థాయి పాటలు లేవు. నేపథ్య సంగీతం కూడా! మరొకటి... సినిమాను సాగదీసి సాగదీసి వదిలారు. ఫస్ట్ పార్టుతో పోలిస్తే... ఇది ఇంకా స్లో!


నటీనటులు ఎలా చేశారంటే: 'సప్త సాగరాలు దాటి - సైడ్ ఏ'తో పోలిస్తే... గెటప్, లుక్స్, యాక్టింగ్ పరంగా ఇప్పుడీ సినిమాలో రక్షిత్ శెట్టి డిఫరెన్స్ చూపించారు. ఎప్పటిలా ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. క్లైమాక్స్ ఫైట్‌లో సహజంగా చేశారు. 


గృహిణి పాత్రకు రుక్మిణీ వసంత్ పరిమితం అయ్యారు. క్యారెక్టర్ పరంగా ఎక్కువ ఎమోషన్స్, వేరియేషన్స్ చూపించే అవకాశం ఆమెకు రాలేదు. కానీ, రుక్మిణి ఫేస్ మీద కెమెరా ఉన్నంత సేపూ నటనతో ఆకట్టుకున్నారు. ప్రేక్షకులకు ఈ సినిమాలో సర్‌ప్రైజ్ ఇచ్చే ఆర్టిస్ట్... హీరోయిన్ చైత్ర అచార్. వేశ్యగా కేవలం కళ్ళతో చాలా హావభావాలు పలికించారు. గోపాల్ పాత్రలో నటించిన వ్యక్తి చెప్పే కొన్ని డైలాగ్స్, ఆయన కామెడీ టైమింగ్ నవ్విస్తాయి. 


Also Read మంగళవారం సినిమా రివ్యూ: హత్యలు చేసింది ఎవరు - హీరోయినా? ఇంకొకరా?


చివరగా చెప్పేది ఏంటంటే... : 'సప్త సాగరాలు దాటి - సైడ్ ఏ'లో ఓ జంట కలల సౌధం కళ్ళ ముందు కూలిన తీరును హృదయానికి ఆకట్టుకునేలా చూపించిన దర్శకుడు హేమంత్ రావు... 'సప్త సాగరాలు దాటి - సైడ్ బి'లో తాను ప్రేమించిన అమ్మాయి మరొకరి భార్య అయినప్పటికీ, ఆమె సంతోషం తప్ప మరొక అంశం ఏదీ పట్టనట్లు ఆమె కోసం హీరో చేసే పనులు హర్షించేలా లేవు. 'సైడ్ ఏ' నచ్చన వాళ్ళకు ఈ సినిమా అసలు నచ్చదు. ఫస్ట్ పార్ట్ నచ్చిన వాళ్ళు సైతం 'సైడ్ బి' చూసి డిజప్పాయింట్ అవుతారు. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ చూసి... ఇందులో యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉంటుందని ఆశిస్తే... అందులో ఉన్నంత కూడా లేదు. 


Also Read జపాన్ రివ్యూ : వాటీజ్ థిస్ కార్తీ - స్లాంగ్ బావుంది సార్, మరి సినిమా?