Varun Tej and Manushi Chhillar starrer aerial action film Operation Valentine review: జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతి, కొత్తదనంతో కూడిన సినిమాలు అందించడానికి ప్రయత్నించే యువ హీరో వరుణ్ తేజ్. ఇప్పటి వరకు టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ మీద ఎవరు టచ్ చేయనటువంటి ఏరియల్ కాంబాట్ జానర్ సినిమా 'ఆపరేషన్ వాలెంటైన్' చేశారు. పుల్వామా ఘటన తర్వాత పాకిస్తాన్ భూభాగంలోని తీవ్రవాద స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ప్రతీకార దాడి నేపథ్యంలో రూపొందించిన చిత్రమిది. ఎలా ఉందో రివ్యూలో చూడండి.


కథ (Operation Valentine Story): అర్జున్ దేవ్ (వరుణ్ తేజ్) ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో వింగ్ కమాండర్. అతని భార్య అహనా గిల్ (మానుషీ చిల్లర్) కూడా వింగ్ కమాండర్. అయితే... రాడార్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంటుందామె. ఆపరేషన్ వజ్ర పేరుతో ఎయిర్ ఫోర్స్ ఒక ప్రాజెక్ట్ చేపడుతుంది. తక్కువ ఎత్తులో ఫైటర్ జెట్స్ నడిపితే శత్రువుల రాడార్ కంటికి కనిపించకుండా ఉండటంతో పైలట్స్ ప్రాణాలు కావడవచ్చనేది దాని ఉద్దేశం. ఆ ప్రాజెక్ట్ టెస్ట్స్ జరుగుతుండగా... పుల్వామాలో భారతీయ జవాన్ల మీద దాడి జరుగుతుంది. అప్పుడు అర్జున్ ఏం చేశాడు? అర్జున్, అహనా మధ్య గొడవ ఎందుకు వచ్చింది?


పుల్వామా ఘటనకు ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాలాకోట్ స్ట్రైక్ చేశాక పాకిస్తాన్ ఎలా స్పందించింది? ఎయిర్ స్ట్రైక్ సమయంలో అర్జున్ ఏం చేశాడు? ఆపరేషన్ వజ్రలో కబీర్ (నవదీప్) ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఏమిటి? అనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడాలి. 


విశ్లేషణ: పుల్వామా ఘటన తర్వాత పాకిస్తాన్‌లోని బాలాకోట్ మీద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్ చేసిన సంగతి ప్రజలకు తెలుసు. ఆ వాస్తవ సంఘటన స్ఫూర్తితో ఏరియల్ యాక్షన్ నేపథ్యంలో ఇటీవల హృతిక్ రోషన్ 'ఫైటర్' వచ్చింది. ఆ సినిమాలో, ఇప్పుడీ 'ఆపరేషన్ వాలెంటైన్'లో కొన్ని కామన్ పాయింట్స్ మనకు కనిపిస్తాయి. కానీ, కథను చెప్పిన తీరు వేరు. హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్లతో పాటు పుల్వామా ఘటనకు ముందు, వెనుక చూపించిన సన్నివేశాలు కొత్తగా ఉంటాయి.


'ఆపరేషన్ వాలెంటైన్' కథ కొత్తది కాదు. అందువల్ల, ప్రేక్షకుల్ని ఆ ట్విస్టులు ఏమీ సర్‌ప్రైజ్ చేయవు. స్క్రీన్ మీద క్యారెక్టర్లతో ఎమోషనల్ బాండింగ్ ఏర్పడినప్పుడు మాత్రమే... కథతో ట్రావెల్ చేయగలరు. అటువంటి హ్యూమన్ ఎమోషన్స్ పరంగా దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా బలమైన సన్నివేశాలు రాసుకోలేదు. పుల్వామా ఘటనలో చిన్నారి ప్రాణం కాపాడటం కోసం సైనికుడు తన ప్రాణాల్ని అడ్డుగా వేస్తాడు. ఆ సన్నివేశాన్ని ఇంకా బాగా తీయవచ్చు.


నవదీప్ క్యారెక్టర్ మరణించినట్లు సినిమా ప్రారంభమైన కాసేపటికి ప్రేక్షకుడికి ఈజీగా అర్థం అవుతుంది. అయితే... నవదీప్, వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ బాండింగ్ సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఆపరేషన్ వజ్ర గురించి పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదు. దాంతో ఫస్టాఫ్ సోసోగా ఉంటుంది. ఫైటర్ జెట్ స్పీడుతో ట్రావెల్ చేసే మూమెంట్స్ ఏమీ లేవు. సెకండాఫ్, ముఖ్యంగా పాకిస్తాన్ మీద ఎటాక్ చేసే సీన్లు గూస్ బంప్స్ ఇస్తాయి. 


ఏరియల్ యాక్షన్ జానర్ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఏరియల్ కాంబాట్, ఆ ఫైటర్ జెట్ సీన్స్ కోసం విజువల్స్ ఎఫెక్ట్స్ అవసరం. హాలీవుడ్ మూవీ 'టాప్ గన్', 'ఫైటర్' చూసిన వాళ్లకు 'ఆపరేషన్ వాలెంటైన్'లో సీజీ వర్క్ తేలిపోతుంది. కానీ, ఈ మూవీ బడ్జెట్ (మేకింగ్ కాస్ట్ 42 కోట్లు, అందులో వీఎఫ్ఎక్స్ కాస్ట్ 5 కోట్లు) తెలిస్తే... ఆ ఖర్చుకు బెటర్ అవుట్ పుట్ ఇచ్చారని చెప్పవచ్చు. 


మిక్కీ జె మేయర్ సంగీతంలో మెరుపులు లేవు. కథకు తగ్గట్టు ఉంది. సాయి మాధవ్ బుర్రా క్లుప్తమైన సంభాషణల్లో బరువైన భావాన్ని చెప్పారు. 'ఇండియా పీక తెగే సమయం వచ్చింది' అని పాకిస్తాన్ ఆర్మీ జనరల్ చెప్పే మాట, 'నువ్వు వారియర్ కాదు, సేవియర్' అని హీరోతో హీరోయిన్ అనే మాట ఇప్పుడు చదివితే సాధారణంగా అనిపిస్తాయి. కానీ, ఆ సన్నివేశాలకు బలం తెచ్చాయి. హరి కె వేదాంతం సినిమాటోగ్రఫీ బావుంది.


Also Read: అందంతో కాదు, నటనతో... వెండితెరపై రాజకీయం రంగరించిన హీరోయిన్లు


అర్జున్ దేవ్ పాత్రకు వరుణ్ తేజ్ న్యాయం చేశారు. ఫైటర్ జెట్ పైలట్ అంటే నమ్మేట్టు ఆయన పర్సనాలిటీ ఉంది. పర్ఫెక్ట్ యాప్ట్ అని చెప్పవచ్చు. హెయిర్ స్టైల్, మేకప్ పరంగా తీసుకున్న జాగ్రత్తలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. అహనా గిల్  పాత్రలో మానుషీ చిల్లర్ ఓకే. నవదీప్ పాత్ర నిడివి తక్కువ. స్క్రీన్ మీద చూపించే ఇంపాక్ట్ కూడా! స్క్వాడ్రన్ లీడర్స్ పాత్రల్లో అలీ రేజా, రుహానీ శర్మ, పరేష్  పహుజా కనిపించారు. కమాండర్ ఇన్ చీఫ్ రాజీవ్ భక్షి పాత్రలో షతాప్ ఫిగర్ మంచి నటన కనబరిచారు. సంపత్ రాజ్, అనీష్ కురువిల్లా, అభినవ్ గోమఠం కీలక పాత్రల్లో కనిపిస్తారు.


ప్రతిరోజూ దేశ భద్రత కోసం ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సరిహద్దుల్లో తమ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతోంది. పుల్వామా ఘటన తర్వాత ఎయిర్ ఫోర్స్ చూపిన ధైర్య సాహసాలు, తెగువకు సెల్యూట్ చేసే చిత్రమిది. దేశం మీద ప్రేమతో చూసే వాళ్లకు 'ఆపరేషన్ వాలెంటైన్'లో లోపాలు కనిపించకపోవచ్చు. సినిమాగా చూస్తే... స్టార్టింగ్ టు ఎండింగ్ ఎంగేజ్ చేయడం కష్టం. గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్ ఉన్నాయి. కానీ, కొంత వరకే పరిమితం అయ్యాయి. సో... థియేటర్లకు వెళ్లాలా? వద్దా? అనేది ప్రేక్షకుల ఛాయస్! విజయం కోసం వరుణ్ తేజ్ మరో ప్రయత్నం చేయక తప్పదు. అయితే... నటుడిగా ఆయన్ను మరో మెట్టు ఎక్కించే చిత్రమిది.


Also Readప్రభాస్ సినిమా నుంచి తీసేశారు, పవన్‌ కళ్యాణ్ తో నటించలేదు... రకుల్ టాలీవుడ్ జర్నీలో ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్!