సినిమా రివ్యూ: మై నేమ్ ఈజ్ శృతి 
రేటింగ్ : 2.5/5
నటీనటులు : హన్సికా మొత్వానీ, ముర‌ళీ శ‌ర్మ‌, 'ఆడుకాలం' నరేన్, జ‌య‌ప్ర‌కాష్‌, వినోదిని, సాయి తేజ‌, పూజా రామ‌చంద్ర‌న్‌ తదితరులు  
ఛాయాగ్రహణం : కిశోర్ బోయిడ‌పు
సంగీతం: మార్క్ కె రాబిన్
నిర్మాత: బురుగు రమ్య ప్రభాకర్
దర్శకత్వం: శ్రీ‌నివాస్ ఓంకార్
విడుదల తేదీ: నవంబర్ 17, 2023  


My Name Is Shruthi Telugu Movie Review: కథానాయికగా హన్సిక కెరీర్ తెలుగులో మొదలైంది. యంగ్ హీరోలతో సినిమాలు కూడా చేశారు. తర్వాత తమిళంలో వరుస అవకాశాలు రావడం, జూనియర్ ఖుష్బూ అని పేరు పొందడం, అక్కడ ఆమెకు గుడి కట్టడంతో కోలీవుడ్ సినిమాలు చేస్తూ తెలుగు సినిమాలకు క్రమక్రమంగా దూరమయ్యారు. కొంచెం విరామం తర్వాత హన్సిక ప్రధాన పాత్రలో నటించిన తెలుగు సినిమా 'మై నేమ్ ఈజ్ శృతి'. తెలుగులో ఆమె నటించిన మొదటి మహిళా ప్రాధాన్య చిత్రమిది.
 
కథ (My Name Is Shruthi Story) : మంత్రి కావాలనేది ఎమ్మెల్యే గురుమూర్తి (ఆడుకాలం నరేన్)కి 20 ఏళ్ల కల. హైదరాబాద్ సిటీలో రహస్యంగా స్కిన్ ట్రేడింగ్ (మనుషుల చర్మాన్ని వలిచి వేరొకరికి కాస్మొటిక్ సర్జరీ) చేయడం అతని బిజినెస్. అడ్డొచ్చిన వాళ్ళను అతి కిరాతకంగా చంపడం అతని నైజం. అయితే అటువంటి గురుమూర్తిని ఎవరో బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. అతనికి శృతి (హన్సిక) ఫ్లాటులో దొరికిన అను (పూజా రామచంద్రన్) శవానికి సంబంధం ఏమిటి? 


ఈ కేసును ఏసీపీ రంజిత్ (మురళీ శర్మ) ఎలా సాల్వ్ చేశారు? అసలు, అనూని ఎవరు చంపారు? ఆమెకు, డ్రగ్ డీలర్స్, స్కిన్ ట్రేడర్స్ మధ్య సంబంధం ఏమిటి? పోలీసుల దగ్గర శృతి దాచిన నిజం ఏమిటి? ఆమె బాయ్ ఫ్రెండ్ చరణ్ (సాయి తేజ) ఎవరు? అతను ఏమయ్యాడు? అనేది సినిమా. 


విశ్లేషణ (My Name Is Shruthi Review): పిల్లిని అయినా సరే గదిలో బందించి కొడితే పులి అవుతుందనేది సామెత. అది ఈ సినిమాకు సరిగ్గా సరిపోతుంది. బలంతో, తెలివితో సమస్య నుంచి ఓ అమ్మాయి ఎలా బయట పడిందనేది క్లుప్తంగా సినిమా కథాంశం. అయితే... ఆ కథలోకి వెళ్ళడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నారు. 


'మే నేమ్ ఈజ్ శృతి' ప్రారంభం సాధారణంగా ఉంటుంది. జరిగిన క్రైమ్, ఆ తర్వాత ఎమ్మెల్యే చేసే అరాచకాలు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ రొటీన్ & నార్మల్ వ్యవహారమే. ఇంటర్వెల్ తర్వాత, ముఖ్యంగా పతాక సన్నివేశాలకు వచ్చే సరికి కథలో అసలు మజా మొదలైంది. ఒక ట్విస్ట్ తర్వాత మరో ట్విస్ట్... ఎంగేజ్ చేస్తుందీ సినిమా. ఎండింగ్ ఓ శాటిస్‌ఫ్యాక్టరీ ఫీలింగ్ ఇస్తుంది. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాల్లో, మెడికల్ మాఫియా తీరుతెన్నులను మరింత లోతుగా చూపించి ఉంటే సినిమా ఇంకా థ్రిల్ ఇచ్చేది. 


'మై నేమ్ ఈజ్ శృతి' ప్రారంభం సాదాసీదాగా ఉన్నప్పటికీ... సినిమాలో డిస్కస్ చేసిన స్కిన్ ట్రేడింగ్ టాపిక్ తెలుగు తెరకు కొత్త. హ్యూమన్ ఆర్గాన్స్ ట్రేడింగ్, మాఫియా నేపథ్యంలో ఆ మధ్య 'యశోద' వచ్చింది. అందులోనూ మహిళల శరీర యవ్వనం మెయిన్ టాపిక్. ఇందులోనూ ఇంచుమించు అంతే! కానీ, కథ & స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటాయి. హన్సిక తప్ప సినిమాలో మరో స్టార్ లేరు. మురళీ శర్మ, జయ ప్రకాష్ వంటి ఆర్టిస్టులు ఉన్నప్పటికీ వాళ్ళ పాత్రలు పరిమితమే. 


దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ మంచి పాయింట్ సెలెక్ట్ చేసుకున్నారు. స్క్రీన్ ప్లే కూడా బాగా రాసుకున్నారు. అయితే... స్టార్టింగ్ సీన్స్ రొటీన్ లేకుండా చూసుకుంటే బావుండేది. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ ఎక్కువ ఎంగేజ్ చేస్తుంది. క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. 'భయం అనేది చంపడంలో కాదు... చస్తూ బతకడంలో ఉంటుంది' వంటి కొన్ని మంచి డైలాగ్స్ పడ్డాయి. కానీ, సినిమా అంతటా ఆ టైపు డైలాగ్స్ లేవు. పాటలు గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం కూడా అంతే! ప్రొడక్షన్ వేల్యూస్ ఓకే. 


నటీనటులు ఎలా చేశారంటే...: 'కోపంలోనూ భలే కూల్‌గా ఉన్నావ్' - సీరియస్ సీన్‌లో హన్సికతో ఓ పాత్రధారి చెప్పే డైలాగ్. అది నిజమే! సినిమా అంతా ఆమె కూల్‌గా యాక్ట్ చేశారు. ఓవర్ ది బోర్డు వెళ్ళలేదు. క్యారెక్టర్ వరకు న్యాయం చేశారు. డ్రస్సింగ్ బావుంది. హన్సిక బాయ్ ఫ్రెండ్ రోల్ చేసిన అబ్బాయి ఓకే. 


డ్రగ్ డీలర్, గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో పూజా రామచంద్రన్ పర్ఫెక్ట్ యాప్ట్ అన్నట్లు ఉన్నారు. 'ఆడుకాలం' నరేన్, మురళీ శర్మలకు ఇటువంటి క్యారెక్టర్లు కొత్త కాదు. కానీ, ఉన్నంతలో బాగా చేశారు. నటీనటులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు చేశారు.     


Also Read : మంగళవారం సినిమా రివ్యూ: అమ్మాయిలో లైంగిక వాంఛ ఎక్కువ అయితే? కోరికలు పెరిగితే?


చివరగా చెప్పేది ఏంటంటే...: మెడికల్ మాఫియా మీద వచ్చిన డీసెంట్ థ్రిల్లర్ సినిమాల్లో 'మే నేమ్ ఈజ్ శృతి' ఒకటి. కాన్సెప్ట్ బావుంది. కానీ, స్టార్టింగ్ సీన్స్ అంతగా ఆకట్టుకోవు. ఇంటర్వెల్ తర్వాత సినిమాలో క్యూరియాసిటీ మొదలు అవుతుంది. పతాక సన్నివేశాలు మెప్పిస్తాయి. హన్సిక & ట్విస్టుల కోసం ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్ళవచ్చు. 


Also Read : 'సప్త సాగరాలు దాటి సైడ్ బి' సినిమా రివ్యూ: రక్షిత్ శెట్టి బ్లాక్ బస్టర్ కొట్టారా? డిజప్పాయింట్ చేశారా?