Single Movie Review - '#సింగిల్' రివ్యూ: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా? ట్రయాంగిల్ లవ్ స్టోరీ బావుందా? కామెడీ బావుందా?
Single Review In Telugu: శ్రీవిష్ణు హీరోగా... కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించిన సినిమా '#సింగిల్'. అల్లు అరవింద్ సమర్పణలో కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి.
కార్తీక్ రాజు
శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్, రాజేంద్రప్రసాద్ తదితరులు
Sree Vishnu's #Single Movie Review In Telugu: శ్రీ విష్ణు కామెడీ సినిమా చేసిన ప్రతిసారీ మంచి విజయాలు వచ్చాయి. 'సామజవరగమన', 'ఓం భీమ్ బుష్' హిట్స్ అవ్వగా... 'స్వాగ్' ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు '#సింగిల్'తో శ్రీ విష్ణు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కేతికా శర్మ, 'లవ్ టుడే' ఫేమ్ ఇవానా హీరోయిన్లుగా నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు. ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరి సినిమా?
కథ (Single Movie Story): ఆడి షోరూంలో పూర్వ (కేతికా శర్మ) సేల్స్ ఎగ్జిక్యూటివ్. మెట్రోలో ఆమెను చూసి ప్రేమలో పడతాడు విజయ్ (శ్రీ విష్ణు). అతను బ్యాంకు ఉద్యోగి. పూర్వను ప్రేమలో పడేయడానికి ప్లాన్ వేస్తాడు. అయితే... ప్లాన్‌లో చిన్న మిస్ కమ్యూనికేషన్ వల్ల హరిణి (ఇవానా) ప్రేమలో పడుతుంది. తనను ప్రేమించమని విజయ్ వెంట పడుతుంది.
విజయ్ మాత్రం పూర్వాను వదలడు. ఆమెతో పరిచయం పెంచుకొని ప్రేమలో పడేయాలని కార్ షోరూంకు వెళతాడు. కార్ కొంటానని ఆ అమ్మాయితో ట్రావెల్ చేస్తాడు. చివరకు అసలు విషయం చెప్తాడు. అప్పుడు విజయ్‌ను పూర్వ ఛీ కొడుతుంది. అప్పటి నుంచి అతడిని దూరం పెడుతుందని అనుకుంటే... మళ్లీ విజయ్ దగ్గరకు పూర్వ వస్తుంది. ఎందుకు?
పూర్వాను విజయ్ ప్రేమిస్తుంటే... విజయ్ ప్రేమ కోసం హరిణి వెంట పడుతుంది. చివరకు ఇద్దరిలో విజయ్ ఎవరిని ప్రేమించాడు? ఈ కథ మూర్తి (రాజేంద్ర ప్రసాద్) వల్ల ఎటువంటి మలుపులు తిరిగింది? ఎప్పుడూ విజయ్ వెంట ఉండే అతని స్నేహితుడు అరవింద్ (వెన్నెల కిషోర్) ఏం చేశాడు? చివరకు ఏమైంది? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (Single Review Telugu): శ్రీ విష్ణుకు 'కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్' అని ట్యాగ్ ఇచ్చారు. ఆ ట్యాగ్‌కు న్యాయం చేయాలన్నట్టుగా ప్రతి సినిమాలో వినోదం ఎక్కువ ఉండేలా చూసుకుంటున్నారు. 'సామజవరగమన', 'ఓం భీమ్ బుష్' విజయాలు సాధించాయంటే... ఆయా కథల్లో బలం కంటే కామెడీలో ఎక్కువ విషయం ఉండడం వల్లే. సింగిల్ విషయంలో కూడా సేమ్ స్ట్రాటజీ ఫాలో అయ్యారు శ్రీ విష్ణు.
తెలుగు ప్రేక్షకులకు ప్రేమ కథలు కొత్త కాదు. అందులోనూ హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తే... అతడిని మరో అమ్మాయి ప్రేమించడం... వంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ కూడా కొత్త కాదు. కథ పరంగా ఈ సినిమాలో కొత్తదనం ఏమీ లేదు. ప్రేక్షకులను నవ్వించాలని తీసిన సినిమాలలో కథ, కథనాల కంటే కామెడీ మీద దర్శక రచయితలు ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారు. దర్శకుడు కార్తీక్ రాజు, రచయితలు భాను భోగవరపు, నందు కూడా అదే పని చేశారు.
#సింగిల్ స్టోరీ చాలా సింపుల్... తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమలో పడడానికి హీరో ప్లాన్ చేస్తే, అతనిని ప్రేమలో పడేయడానికి మరో అమ్మాయి సేమ్ ప్లాన్ వేస్తోంది. ఇంటర్వెల్ వరకు అసలు కథ కొంచెం కూడా ముందుకు కదలదు. ఇంటర్వెల్ తర్వాత అసలు కథలోకి రావడానికి కూడా దర్శక రచయితలు చాలా సమయం తీసుకున్నారు. అయితే... కథలో లోపాలను కామెడీ & శ్రీ విష్ణు - వెన్నెల కిషోర్ టైమింగ్ కవర్ చేశాయి. స్టార్ హీరోలు చాలామందిని శ్రీ విష్ణు ఇమిటేట్ చేశారు. అంటే... పాపులర్ సీన్స్, డైలాగ్స్ వంటి వాటిని రీ క్రియేట్ చేశారు. అలాగే... 'జెన్ జి' లాంగ్వేజ్ మీద కొన్ని డైలాగ్స్ పడ్డాయి. అవన్నీ వర్కౌట్ అయ్యాయి. కామెడీ విషయంలో సినిమా ఫుల్ మీల్స్ పెట్టింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్, ఈ జనరేషన్ కాలేజ్ స్టూడెంట్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. రెగ్యులర్ క్లైమాక్స్ కాకుండా కొత్తగా ట్రై చేయడం బావుంది.
విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఈ చిత్రానికి బిగ్గెస్ట్ ఎస్సెట్. ఆయన అందించిన బాణీలు చాలా బాగున్నాయి. ఈ జనరేషన్ ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా సాంగ్స్ ఇచ్చారు. ఆర్ఆర్ కూడా బాగుంది. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే... ప్లజెంట్ ఫీలింగ్ ఇచ్చింది. ఆర్ వేల్రాజ్ ఫ్రేమ్స్, కలర్ గ్రేడింగ్ క్లాసి ఫీలింగ్ తీసుకొచ్చారు. ఎడిటింగ్ క్రిస్పీగా సాగింది. అయితే స్క్రిప్ట్ ఎడిటింగ్‌లో దృష్టి సారించినట్టు అయితే... సెకండ్ ఆఫ్‌లో ఇంటర్వెల్ తర్వాత నుంచి క్లైమాక్స్ వచ్చేవరకు కథ సాగదీసిన ఫీలింగ్ రాదు. నిర్మాణపరంగా లోపల ఏం లేవు. దర్శకుడు కార్తీక్ రాజు టెక్నికల్ టీం నుంచి మంచి అవుట్ పోర్ట్ తీసుకున్నారు.
Also Read: శుభం రివ్యూ: నిర్మాతగా సమంత మొదటి సినిమా - హారర్ కామెడీతో నవ్వించారా? భయపెట్టారా?
శ్రీ విష్ణుది టిపికల్ డైలాగ్ డెలివరీ. ఆయన చెప్పే విధానం వల్ల కొన్ని డైలాగ్స్ వింటుంటే నవ్వొస్తుంది. ఈ సినిమాలోనూ ఆ తరహాలో చాలా సన్నివేశాల్లో డైలాగ్స్ చెప్పారు. అయితే... కేవలం కామెడీ మీద కాన్సెంట్రేట్ చేయడం వల్ల తనలోని నటుడిని పూర్తిగా పక్కన పెట్టినట్టు అనిపిస్తుంది. 'సింగిల్' క్లైమాక్స్‌లో ఎమోషనల్ సీన్స్ శ్రీ విష్ణు లో నటుడుని స్క్రీన్ మీద చూపించాయి.
శ్రీ విష్ణు వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్ సెట్ అయ్యింది. ఒక సాధారణ సన్నివేశాన్ని సైతం తమ నటనతో నవ్వించేలా చేశారు. కేతికా శర్మ, ఇవానా తమ పాత్రలకు తగ్గట్లు నటించారు. వీటీవీ గణేష్ ఓకే. రాజేంద్రప్రసాద్ సినిమా చివర్లో వచ్చారు. ప్రేక్షకులు అందరూ చిన్నపాటి ఎమోషన్‌కు గురి అయ్యేలా నటించి వెళ్ళారు.
#సింగిల్... రెండు గంటలు హాయిగా నవ్వుకునే సినిమా. ఇందులో కథ, ట్విస్ట్స్ వంటివి ఎక్స్‌పెక్ట్ చేయవద్దు. శ్రీ విష్ణు తన ఇమేజ్‌కు తగ్గట్టు, తన నుంచి ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేసే కామెడీ అందించారు. కామెడీ కోసం సినిమాకు వెళ్లొచ్చు. అందులో మరో సందేహం అవసరం లేదు. ఇది శ్రీవిష్ణు కైండ్ ఆఫ్ సినిమా. శ్రీవిష్ణు జానర్ సినిమా.
Also Read: హిట్ 3... రెట్రో... రెండిటి కథ ఒక్కటేనా... ఎందుకీ కంపేరిజన్స్? ఈ రెండు సినిమాల్లో ఏముంది?