సినిమా రివ్యూ : రూల్స్ రంజన్
రేటింగ్ : 1.5/5
నటీనటులు : కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, వైవా హర్ష, సుదర్శన్, హైపర్ ఆది, సుబ్బరాజు, అభిమన్యు సింగ్, అజయ్, మకరంద్ దేశ్ పాండే తదితరులు
ఛాయాగ్రహణం : ఎంఎస్ దులీప్ కుమార్
సంగీతం : అమ్రీష్
సమర్పణ : ఏఎం రత్నం
నిర్మాణ సంస్థ : స్టార్‌లైట్ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు : దివ్యాంగ్ లావనియా, మురళీ కృష్ణ వేమూరి
రచన, దర్శకత్వం : రత్నం కృష్ణ
విడుదల తేదీ: అక్టోబర్ 6, 2023 


టాలీవుడ్‌లో ప్రామిసింగ్ యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ఒకరు. ఆయన నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘రూల్స్ రంజన్’ (Rules Ranjann) శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్లను ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఫన్నీగా కట్ చేశారు. అన్నిటికంటే ‘సమ్మోహనుడా’ (Sammohanuda Song) పాట పెద్ద హిట్ అయి సినిమాపై అంచనాలు పెంచింది. మరి సినిమా ఎలా ఉంది?


కథ (Rules Ranjann Story): మనో రంజన్ (కిరణ్ అబ్బవరం) తిరుపతిలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ పూర్తి చేసి ముంబైలో సాఫ్ట్ వేర్ జాబ్ సంపాదిస్తాడు. కానీ తనకి హిందీ రాకపోవడం వల్ల వాళ్ల కంపెనీలో అందరూ తనని తక్కువగా చూస్తూ, తమ పనులకు మనో రంజన్‌ను వాడుకుంటూ ఉంటారు. దీంతో అలెక్సా సాయంతో హిందీ నేర్చుకుని కంపెనీని ఒక పెద్ద ప్రమాదం నుంచి బయట పడేస్తాడు మనో రంజన్. ఆ తర్వాత కంపెనీలో అందరూ తన రూల్స్ ప్రకారం నడుచుకోవాలని కండీషన్ పెడతాడు. నాలుగు సంవత్సరాల తర్వాత మనో రంజన్ జీవితంలోకి తన కాలేజీ క్రష్ సన (నేహా శెట్టి) మళ్ళీ వస్తుంది. జాబ్ ఇంటర్వ్యూ కోసం ముంబై వచ్చిన సనతో రంజన్ ఒక రోజంతా గడుపుతాడు. కానీ జాబ్ రాకపోవటంతో సన తిరిగి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రంజన్ జీవితం ఏం అయింది? మళ్ళీ సనని కలిశాడా? తెలియాలంటే రూల్స్ రంజన్ చూడాల్సిందే.


విశ్లేషణ (Rules Ranjann Review): టాలీవుడ్‌లో గడిచిన కొన్ని సంవత్సరాల్లో అత్యంత వేగంగా ఆడియన్స్‌లో గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. ఎటువంటి సపోర్ట్ లేకుండా సినిమాల్లోకి వచ్చి కిరణ్ తక్కువ కాలంలోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కానీ ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ దగ్గర నుంచి ఆయన ఎంచుకున్న కథలు నానాటికీ తీసికట్టుగా తయారవుతున్నాయి. ఇప్పుడు ‘రూల్స్ రంజన్’ కూడా ఆ కోవలోకే చేరుతుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఎక్కడా ఒక్క మూమెంట్ కూడా ఆకట్టుకోకుండా రాసుకున్నారు.


సినిమా ప్రారంభంలో వచ్చే ఆఫీస్ సన్నివేశాలు, మనో రంజన్... ‘రూల్స్ రంజన్’గా ఎలా మారాడు? ఇవన్నీ చిరాకు పెడతాయి. ముఖ్యంగా ఆఫీసు నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చూస్తే ప్రపంచంలో ఏ సాఫ్ట్‌వేర్ కంపెనీ అయినా ఇలా ఉంటుందా? అనిపిస్తుంది. బి గ్రేడ్ సినిమాల కో-డైరెక్టర్‌గా వెన్నెల కిషోర్ కామెడీ అస్సలు నవ్వించవు. నేహా శెట్టి ఎంట్రీతో తీరిగ్గా 40 నిమిషాల తర్వాత అసలు కథలోకి అడుగు పెడతారు. నేహా శెట్టి, కిరణ్ అబ్బవరంల మధ్య ‘జర్నీ’ తరహా ఎపిసోడ్‌లో కొన్ని సీన్లు అయితే ఇన్‌స్టంట్ ఇరిటేషన్. మొత్తానికి ఎలాగోలా ముంబైలో ఇంటర్వల్ ఇస్తారు.


ఇంటర్వల్ అయిపోగానే స్టోరీ హీరో విలేజ్‌కు షిఫ్ట్ అవుతుంది. వైవా హర్ష, సుదర్శన్, హైపర్ ఆది లాంటి విషయం ఉన్న కమెడియన్లు ఉన్నప్పటికీ... ఆ విషయం సీన్లలో కనిపించదు. కనీసం ఒక్క పంచ్ కూడా పేలలేదు. అక్కడ నుంచి కథ అలా సాగుతూ, సాగుతూ, సాగుతూనే క్లైమ్యాక్స్‌కు చేరుతుంది. సినిమా అయిపోతుంది అనుకున్న ప్రతిసారీ ఎక్స్‌టెండ్ అవుతూనే ఉంటుంది. సెకండాఫ్ మొత్తంలో ప్లస్ పాయింట్ ఏమైనా ఉందా అంటే అది ‘సమ్మోహనుడా’ సాంగ్ మాత్రమే. అసలు సినిమా మొత్తానికి అదొక్కటే ప్లస్ పాయింట్.


నిజానికి ‘రూల్స్ రంజన్’ సినిమాకి అన్నీ కరెక్ట్‌గా వర్కవుట్ అయ్యాయి. ప్రామిసింగ్ హీరో, యూత్‌లో పాపులర్ అయిన హీరోయిన్, సినిమా హైప్‌ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లిన పాట, వెన్నెల కిషోర్, హైపర్ ఆది, సుదర్శన్, వైవా హర్ష లాంటి టాలెంటెడ్ కమెడియన్స్, గోపరాజు రమణ, సుబ్బరాజు, అభిమన్యు సింగ్, అజయ్ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు... ఇలా అన్నీ ఉన్నాయి. కానీ కథను మాత్రం గాలికి వదిలేశారు. క్లైమ్యాక్స్‌లో హైపర్ ఆది ‘యాక్టింగ్ చేయచ్చు కానీ ఓవర్ యాక్టింగ్ చేయకూడదు’ అనగానే వెన్నెల కిషోర్ ‘నేను వాళ్లు చేసే దాంతో పాటు మీరు చేసేది కూడా చూడాల్సి వస్తుంది. కర్మరా బాబూ’ అంటాడు. రెండు గంటల 40 నిమిషాల పాటు రంజన్ పెట్టిన రూల్స్ భరించాక అసలు స్క్రీన్‌పై ఏం జరుగుతుంది? స్క్రీన్‌పై ఉన్న వాళ్లు యాక్షన్ చేస్తున్నారా? ఓవరాక్షన్ చేస్తున్నారా? ఇలాంటి వాటిని గుర్తించే ఫీలింగ్స్ కూడా చచ్చిపోతాయి.


ఆమ్రీష్ అందించిన పాటల్లో ‘సమ్మోహనుడా’ ఆకట్టుకుంటుంది. దీని పిక్చరైజేషన్ కూడా బాగా తీశారు. మిగతా పాటలన్నీ సోసోగానే ఉంటాయి. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా సినిమా తీశారు. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం కనిపిస్తాయి.


Also Read : 'మామా మశ్చీంద్ర' రివ్యూ : సుధీర్ బాబు ట్రిపుల్ యాక్షన్ హిట్టా? ఫట్టా?


ఇక నటీనటుల విషయానికి వస్తే... మనో రంజన్ లాంటి పాత్రలు చేయడం కిరణ్ అబ్బవరంకి కొత్తేమీ కాదు. ఇంత కంటే ఎక్కువ వేరియేషన్స్ ఉన్న పాత్రలు కూడా ఆయన గతంలో చేశారు. ఇక నుంచి అయినా ఆయన కథల మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ పెడితే బాగుంటుంది. నేహా శెట్టి పాత్రకు నటించడానికి పెద్దగా స్కోప్ లేదు. స్క్రీన్ మీద ఉన్న కమెడియన్స్ అందరూ నవ్వించడంలో విఫలం అయ్యారు. ఎక్కడో ఒక చోట తప్ప వీళ్ల కామెడీ కూడా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. మిగతా వారందరూ తమ పాత్రల పరిధి మేర న్యాయం చేయడానికి ప్రయత్నించారు.


ఓవరాల్‌గా చెప్పాలంటే... కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా అయితే కాదు. కుదిరితే ఓటీటీల్లో చూడవచ్చు లేకపోతే సైలెంట్‌గా స్కిప్ చేసేయచ్చు.


Also Read 'మ్యాడ్' రివ్యూ : ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ సినిమా ఎలా ఉంది? నవ్వించారా? లేదా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial