Kishkindhapuri Review Telugu - 'కిష్కింధపురి' రివ్యూ: బెల్లంకొండ - అనుపమ కలిసి భయపెట్టారా? హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Kishkindhapuri Review In Telugu: 'రాక్షసుడు' విజయం తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా 'కిష్కింధపురి'. హారర్ థ్రిల్లర్‌ చిత్రమిది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.

Bellamkonda Sai Srinivas's Kishkindhapuri Review In Telugu: సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్ 'రాక్షసుడు'తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంట విజయం అందుకుంది. ఇప్పుడీ జంట హారర్ థ్రిల్లర్ 'కిష్కింధపురి'తో థియేటర్లలోకి వచ్చింది. 'చావు కబురు చల్లగా' ఫేమ్ కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వం వహించారు. పెయిడ్ ప్రీమియర్ షోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? రివ్యూలో తెలుసుకోండి. 

కథ (Kishkindhapuri Story): రాఘవ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్), మైథిలీ (అనుపమ పరమేశ్వరన్)ది కిష్కింధపురి. వాళ్లిద్దరూ ఓ ఘోస్ట్ వాకింగ్ టూర్ కంపెనీలో ఉద్యోగులు. ప్రతిసారీ తాము ఎంపిక చేసిన పాడుబడ్డ భవంతిలోకి ప్రజలను తీసుకువెళ్లి కట్టుకథలు చెప్పి వస్తుంటారు. ఓసారి ప్రజలు ఎంపిక చేసిన, 35 ఏళ్ళ క్రితం మూసివేసిన సువర్ణ మాయ రేడియో స్టేషన్‌లోకి వెళ్ళవలసి వస్తుంది. అక్కడ నిజంగా దెయ్యం ఉంటుంది.

సువర్ణ మాయ రేడియో స్టేషన్ కథ ఏమిటి? భూషణ్ వర్మ (తనికెళ్ళ భరణి), విశ్రవ పుత్ర (శాండీ) ఎవరు? సువర్ణ మాయ రేడియో స్టేషన్‌లో ఏం జరిగింది? రాఘవ్, మైథిలీకి తమతో పాటు అందులోకి వచ్చిన వాళ్ళను దెయ్యం టార్గెట్ చేసి చంపుతుందని తెలిసి ఏం చేశారు? వాళ్ళను కాపాడటం కోసం రాఘవ్ ఏం చేశాడు? మైథిలీ దెయ్యంగా ఎందుకు మారింది? చివరకు ఏమైంది? అనేది సినిమా.

విశ్లేషణ (Kishkindhapuri Review Telugu): రామాయణంలో కిష్కింధకాండ గురించి ఈతరం ప్రేక్షకులకు తెలిసే అవకాశం తక్కువ. సీతాదేవిని వెతుకుతూ అడవికి వెళ్లిన రాముడికి సుగ్రీవుడు, హనుమంతుడు కలుస్తారు. వాలిని చంపడంలో సుగ్రీవుడికి రాముడు సాయం చేస్తాడు, అదీ విషయం! రాముని సాయం వల్ల ఓ ఆత్మ బారి నుంచి కొందరిని హీరో ఎలా కాపాడాడు? అనేది 'కిష్కింధపురి' కథ.  

దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటికి పురాణాల మీద పట్టుంది. 'కిష్కింధపురి'లోని చాలా సన్నివేశాల్లో పరోక్షంగా అది కనిపించింది. ఆస్పత్రికి సంజీవని అని పేరు పెట్టారు. లంకను గుర్తు చేసేలా ఆత్మగా మారిన యువకుడి ఊరు పేరు పెట్టడం, స్మశాన వాటిక పేరు... పలు సన్నివేశాల్లో ట్యాలెంట్ చూపించారు. పురాణాల మీద పట్టు చూపించడంలో పెట్టిన శ్రద్ధ కథ, కథనాల్లో పట్టు ఉందో లేదో అనే అంశం మీద పెట్టలేదు.

హారర్ థ్రిల్లర్ సినిమాల్లో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం ముఖ్యం. 'కిష్కింధపురి' ప్రారంభంలో కాసేపు రొటీన్ రెగ్యులర్ లవ్ స్టోరీ చూసినట్టు ఉంటుంది. తనకు హీరో అంటే ఎందుకు ఇష్టమనేది హీరోయిన్ చెప్పే సన్నివేశాలు, ఆ పాట అనవసరం అనిపిస్తాయి. సువర్ణ మాయలో అడుగుపెట్టిన క్షణం నుంచి సినిమా పరుగులు పెట్టింది. బ్యాక్ టు బ్యాక్... భయపెట్టే బ్లాక్స్ పడ్డాయి. చైతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం తోడు కావడంతో స్కేరీ మూమెంట్స్ వర్కవుట్ అయ్యాయి. రైల్వే ట్రాక్ సీన్ ది బెస్ట్ అని చెప్పాలి. అయితే సెకండాఫ్ ట్రాక్ తప్పింది. సువర్ణ మాయలో అడుగు పెట్టిన ప్రజలను ఆత్మ చంపడానికి చూపించిన కారణం మరీ సిల్లీగా ఉంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో పట్టు లేదు. క్లైమాక్స్ సోసోగా ఉంది. 

దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి హారర్ థ్రిల్లర్ మూమెంట్స్ కొన్ని భలే రాశారు. ఆ డాట్స్, తన థాట్స్ కనెక్ట్ చేస్తూ ఎంగేజ్ చేసే కథ రాయలేదు. అతని మిస్టేక్స్ కవర్ చేసేలా చైతన్ భరద్వాజ్ ఆర్ఆర్ సాగింది. నిర్మాత సాహు గారపాటి ఖర్చుకు అసలు వెనుకాడలేదు. తెరపై ఆ సంగతి కనపడుతుంది. వీఎఫ్ఎక్స్ బెటర్ చేసి ఉండొచ్చు. కానీ, కంప్లైంట్ చేసే స్థాయిలో అయితే లేవు. రిచ్ ప్రొడక్షన్ వేల్యూస్ ఉన్నాయి.

Also Read: 'మిరాయ్' రివ్యూ: క్లైమాక్స్‌లో శ్రీరాముడు వచ్చాడు... తేజా సజ్జా - మంచు మనోజ్ మూవీ హిట్టేనా?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాగా చేశారు. యాక్షన్ సన్నివేశాలు ఎప్పటిలా చేశారు. అయితే కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర ఒకరి మరణం చూసి చలించిపోయే సన్నివేశంలో గానీ, పాపను రక్షించేటప్పుడు గానీ, అనుపమకు దెయ్యం పట్టినప్పటి సన్నివేశాల్లో గానీ పరిణితి చూపించారు. ఫస్టాఫ్ వరకు అనుపమ పరమేశ్వరన్ సాదాసీదాగా కనిపిస్తారు. నటిగా చక్కగా చేశారు. కానీ సెకండాఫ్ హాస్పిటల్ సీన్‌లో విశ్వరూపం చూపించారు. విశ్రవ పుత్రగా శాండీ మెథడ్ యాక్టింగ్ చేశారు. తనికెళ్ళ భరణి, ప్రేమ, హైపర్ ఆది, సుదర్శన్ తదితరులు పాత్రలకు తగ్గట్టు చేశారు.

'కిష్కింధపురి'లో భయపెట్టే సీన్స్ కొన్ని ఉన్నాయి. దెయ్యంగా అనుపమ నటన అద్భుతం. అయితే సీన్లు సీన్లుగా చూసినప్పుడు బావుంటాయి. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే సినిమాగా శాటిస్‌ఫై చేస్తుంది. హారర్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ తీసిన చిత్రమిది.

Also Read: మిరాయ్ vs కిష్కింధపురి... ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఎవరిది అప్పర్ హ్యాండ్? ఏ సినిమాను ఎన్ని కోట్లకు అమ్మారంటే?

Sponsored Links by Taboola