సినిమా రివ్యూ : జవాన్
రేటింగ్ : 3/5
నటీనటులు : షారుక్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి, సాన్యా మల్హోత్రా, దీపికా పదుకోనే, యోగి బాబు తదితరులు
స్క్రీన్ ప్లే : అట్లీ, ఎస్.రమణగిరి వాసన్
ఛాయాగ్రహణం : జీకే విష్ణు
సంగీతం : అనిరుధ్ రవిచందర్
నిర్మాతలు : గౌరి ఖాన్, గౌరవ్ వర్మ
దర్శకత్వం : అట్లీ
విడుదల తేదీ: సెప్టెంబర్ 7, 2023


ఈ సంవత్సరం ప్రారంభంలో ‘పఠాన్’తో హిందీ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు కింగ్ ఖాన్ షారుక్. వెంటనే ఎనిమిది నెలల వ్యవధిలోనే ‘జవాన్’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘పఠాన్’ కంటే ఎక్కువ అంచనాలతో జవాన్ విడుదల అవుతోంది. అపజయం ఎరుగని అట్లీ దర్శకత్వం, అనిరుధ్ సంగీతం ఇవన్నీ సినిమాపై అంచనాలు మరిన్ని పెంచాయి. ‘పఠాన్’ కంటే ఎక్కువ వసూళ్లను ‘జవాన్’ సాధిస్తుందని కూడా ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంది?


కథ: భారత్, చైనా సరిహద్దులో ఉన్న ఒక గ్రామం దగ్గర ఉండే నదిలోకి కొట్టుకొస్తాడు ఒక గుర్తు తెలియని వ్యక్తి (షారుక్ ఖాన్). తలకు పెద్ద దెబ్బ, ఒంటి నిండా బుల్లెట్లతో ఉన్న అతనికి ఆ గ్రామంలో ఉండే వారు వైద్యం చేసి బ్రతికిస్తారు. ఆ గ్రామానికి ఒక కష్టం వచ్చినప్పుడు వారిని అతను కాపాడతాడు. కానీ తన గతం మర్చిపోతాడు. 30 సంవత్సరాల తర్వాత అతను ఆరుగురు అమ్మాయిలతో (ప్రియమణి, సాన్యా మల్హోత్రా గ్యాంగ్) మెట్రో ట్రైన్ హైజాక్ చేస్తాడు. తన పేరు విక్రమ్ రాథోడ్ అని అందరికీ ప్రకటిస్తాడు. హైజాకర్లతో మాట్లాడటానికి ప్రభుత్వం తరఫున నర్మద (నయనతార) వస్తుంది. అదే మెట్రోలో ప్రముఖ బిజినెస్‌మ్యాన్, వెపన్స్ డీలర్ కాళీ గైక్వాడ్ (విజయ్ సేతుపతి) కూతురు ఆలియా (ఆశ్లేష ఠాకూర్) కూడా ఉంటుంది. దీంతో విక్రమ్ రాథోడ్ అడిగిన మొత్తం రూ.40 వేల కోట్లను కాళీనే చెల్లిస్తాడు. అసలు విక్రమ్ ఎవరు? తనకు కాళీ గైక్వాడ్‌కి సంబంధం ఏంటి? ఈ కథలో జైలర్ ఆజాద్ (మరో షారుక్ ఖాన్) పాత్ర ఏంటి? అన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.


విశ్లేషణ: ‘జవాన్’ సినిమా చాలా ఇంట్రస్టింగ్‌గా ప్రారంభం అవుతుంది. ఒక సైన్యాన్ని కూడా ఎదుర్కోగల వ్యక్తి తన గతం మర్చిపోయి ఒక గ్రామంలో ఉండటం, 30 సంవత్సరాల తర్వాత మెట్రో ట్రైన్ హైజాక్... ఇలా ఆసక్తికరంగా సినిమాను ప్రారంభించాడు దర్శకుడు అట్లీ. మొదటి అరగంట తర్వాత రివీల్ అయ్యే కీలకమైన ట్విస్ట్ షాక్ ఇస్తుంది. ప్రథమార్థం అంతా చాలా రేసీగా, ఫాస్ట్‌గా సాగుతుంది. ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే గూస్‌బంప్స్ ఇవ్వడం ఖాయం. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది.


సెకండాఫ్‌లో విక్రమ్ రాథోడ్ ఫ్లాష్‌బ్యాక్ ఎమోషనల్‌గా సాగుతుంది. షారుక్ ఖాన్, విజయ్ సేతుపతి మొట్టమొదటిసారి ఒకరికి ఒకరు ఎదురు పడే ఇన్వెస్టిగేషన్ సీన్ ఎమోషనల్‌గా సాగుతుంది. కానీ ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ చుట్టేసినట్లు అనిపిస్తుంది. ఫ్లాష్‌బ్యాక్ ముగిశాక కథ చాలా వేగంగా సాగుతుంది. అక్కడ నుంచి రెండు యాక్షన్ బ్లాక్‌ల్లో సినిమా ఎండ్ చేసేస్తారు. ఒక బాలీవుడ్ స్టార్ క్యామియో, దాని తర్వాత వచ్చే ట్విస్ట్‌లకు కథలో స్పేస్ లేకపోయినా జొప్పించినట్లు అనిపిస్తుంది.


షారుక్ ఖాన్ ఫ్యాన్స్‌కు ‘జవాన్’ గూస్‌బంప్స్ ఇస్తుంది. అందులో మాత్రం నో డౌట్. ఒక సౌత్ ఇండియన్ మాస్ ఎంటర్‌టైనర్‌లో బాలీవుడ్ స్టార్‌ను చూడటం అక్కడి ఆడియన్స్‌కు కచ్చితంగా కొత్తగా ఉంటుంది. నిజానికి ఈ సినిమాతో షారుక్ టార్గెట్ కూడా అదే. దానికి అట్లీ 100 శాతం న్యాయం చేశారు. సాంగ్స్ ప్లేస్‌మెంట్ కథకు అడ్డం పడతాయి. ఉదాహరణకు సెకండాఫ్‌లో షారుక్, దీపిక పదుకొనేల మధ్య ఒక పాట వస్తుంది. ఆ పాట ట్యూన్ అంతగా ఆకట్టుకోదు. అక్కడ అవసరం లేకపోయినా దీపికా పదుకోనే కోసం పెట్టినట్లు అనిపిస్తుంది.


కథలో కొన్ని పాయింట్లు కూడా చాలా సిల్లీగా అనిపిస్తాయి. కమర్షియల్ సినిమాలో లాజిక్స్ వెతక్కూడదు అంటారు కరెక్టే కానీ అవి మరీ పంటి కింద రాయిలా అడ్డం పడుతూ ఉంటాయి. సినిమాలో ఒక జైలు ఉంటుంది. కానీ అది జైలులా ఉండదు. అందులో ఖైదీలు ఉంటారు. కానీ వాళ్లు ఖైదీల్లా ఉండరు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ప్రకాష్ రాజ్ భాషలో చెప్పాలంటే... ఒక మంచి జైలు, అందులో మంచి ఖైదీలు, అంతకంటే మంచి జైలర్ అన్నమాట.


నయనతార పాత్రను రాసుకున్న విధానం ఆకట్టుకుంటుంది. కమర్షియల్ సినిమాలో హీరోయిన్‌ను బిడ్డకు తల్లిగా చూపించడం అనేది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. విలన్ పాత్రను కూడా చాలా బలంగా రాశారు. విజయ్ సేతుపతి వన్ లైనర్స్ అక్కడక్కడా నవ్విస్తాయి. సినిమాలో యాక్షన్ సీన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సినిమాలో ఐదు ప్రధాన యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. వీటన్నిటినీ అద్భుతంగా తెరకెక్కించారు. ప్రీ-క్లైమ్యాక్స్‌లో వచ్చే ఛేజ్, ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మాస్ ఎలివేషన్లతో గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. చిన్నపిల్లలకు అట్లీ సినిమాల్లో మంచి ప్రాధాన్యం ఉంటుంది. ఇందులో కూడా అది కనిపిస్తుంది. నయనతార కూతురు, షారుక్ ఖాన్ మధ్య ప్రథమార్థంలో వచ్చే సన్నివేశాలు సరదాగా ఉంటాయి.


అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు సోసో గానే ఉన్నాయి. ‘చలోనా’ పాట పిక్చరైజేషన్ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం గూస్‌బంప్స్ ఇస్తుంది. జీకే విష్ణు ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. కొన్ని కెమెరా మూమెంట్స్ చాలా కొత్తగా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉంటాయి.


ఇక నటీనటుల విషయానికి వస్తే... విక్రమ్ రాథోడ్, ఆజాద్ రెండు పాత్రల్లోనూ షారుక్ ఖాన్ కనిపించి మెప్పించారు. ముఖ్యంగా విక్రమ్ రాథోడ్ పాత్రలో చాలా మాస్‌గా, స్వాగ్‌తో కనిపించి ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించారు. నయనతారకు కెరీర్‌లో మొదటిసారి పూర్తి స్థాయి యాక్షన్ రోల్ దక్కింది. ప్రథమార్థంలో వచ్చే ఒక యాక్షన్ ఎపిసోడ్‌లో స్టంట్స్ కూడా అద్భుతంగా చేశారు. విలన్ పాత్రలో విజయ్ సేతుపతిని గతంలో మనం చూశాం. ఇందులో కాస్త ఏజ్డ్ పాత్రలో కనిపించి విజయ్ సేతుపతి ఆకట్టుకుంటారు. బాలీవుడ్‌లో ఆయనకు మరిన్ని విలన్ పాత్రలు దక్కే అవకాశం ఉంది. ప్రియమణి, సాన్యా మల్హోత్రా గ్యాంగ్‌లో ఉన్న ఆరుగురికి కథలో మంచి స్కోప్ ఉంది. వారి కథల్లో మంచి ఎమోషన్ ఉంటుంది. దాన్ని వారంతా చక్కగా పండించారు. తెలుగు యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్, బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంతు చిన్న పాత్రలో కనిపిస్తారు.


Also Read : 'భోళా శంకర్' రివ్యూ : మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన సినిమా - ఎలా ఉందంటే?


ఓవరాల్‌గా చెప్పాలంటే... షారుక్ ఖాన్ ఫ్యాన్స్‌కు ‘జవాన్’ మస్ట్ వాచ్. ఈ స్థాయి కమర్షియల్ సినిమాలో షారుక్ ఈ మధ్యకాలంలో కనిపించలేదు. జనరల్ ఆడియన్స్‌కు కూడా ఈ సినిమా నచ్చుతుంది. బాలీవుడ్‌కు మరో రూ.1000 కోట్ల గ్రాసర్ దాదాపు దొరికినట్లే.


Also Read మిస్టర్ ప్రెగ్నెంట్ రివ్యూ: సొహెల్ ‘పురుష గర్భం’ ప్రయోగం ఎలా ఉంది? డెలివరీ హిట్టా? ఫట్టా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial