Housefull 5 Review - 'హౌస్‌ఫుల్ 5' రివ్యూ: తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా? అక్షయ్ కుమార్ సినిమా హిట్టా? ఫట్టా?

Housefull 5 Review In Telugu: అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్ హీరోలుగా నటించిన 'హౌస్‌ఫుల్ 5' రెండు క్లైమాక్స్‌లతో విడుదలైంది. రెండు ఎండింగ్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి? సినిమా ఎలా ఉంది?

Continues below advertisement

Akshay Kumar's Housefull 5 movie review: అక్షయ్ కుమార్ వరుస డిజాస్టర్లకు 'కేసరి 2' బ్రేక్ వేసింది. బాక్సాఫీస్ దగ్గర వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు 'హౌస్‌ఫుల్ 5'తో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్ హీరోలు. జాక్వలిన్ ఫెర్నాండేజ్, నర్గిస్ ఫక్రి, సోనమ్ బజ్వా హీరోయిన్లు. 5ఏ, 5బి అంటూ రెండు క్లైమాక్స్‌లతో సినిమా విడుదలైంది. రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటి? సినిమా ఎలా ఉంది?

Continues below advertisement

కథ (Housefull 5 Story): రంజిత్ (రంజిత్) మరణించడానికి ముందు వీలునామా రాస్తాడు. తన మొదటి భార్యకు ఓ కుమారుడు ఉన్నాడని, అతని పేరు జాలీ అని, విదేశీ వనితను పెళ్లి చేసుకున్నాడని, అతనికి ఆస్తి ఇవ్వాలని రెండో భార్య కుమారుడు దేవ్ (ఫర్దీన్ ఖాన్)కు చెబుతాడు.

రంజిత్ వారసుడు తానంటే తాను అంటూ జలాబుద్దీన్ (రితేష్ దేశ్‌ముఖ్) - జారా (సోనమ్ బజ్వా), జలభూషణ్ (అభిషేక్ బచ్చన్) - శశికళ (జాక్వలిన్ ఫెర్నాండేజ్), జూలియస్ (అక్షయ్ కుమార్) - కాంచి (నర్గిస్ ఫక్రి) వస్తారు. ముగ్గురికీ డీఎన్ఏ టెస్ట్ చేయమని ఆదేశిస్తాడు దేవ్. టెస్టులు చేసిన డాక్టర్‌ను ఎవరో చంపేస్తాడు. 

ముగ్గురు 'జాలీ'లతో పాటు బేడీ (డినో మోరియా), షిరాజ్ (శ్రేయాస్ తల్పాడే), మాయ (చిత్రాంగద సింగ్) సహా క్రూయిజ్‌లో ఉన్న మిగతా సభ్యుల మీద అనుమానాలు వ్యక్తం అవుతాయి. ఈ కేసును పోలీసులు బాబా (జాకీ ష్రాఫ్), బిద్దు (సంజయ్ దత్), దగ్డు (నానా పటేకర్) ఎలా సాల్వ్ చేశారు? అసలు హంతకుడు ఎవరు? క్రూయిజ్‌లో జరిగిన మూడు హత్యలు ఎవరు చేశారు? చివరకు ఏం తెలిసింది? అనేది సినిమా.

విశ్లేషణ (Housefull 5 Telugu Review): కామెడీ సినిమాలను రెండు కేటగిరీలుగా చూస్తే... క్లీన్ కామెడీ ఒకటి, అడల్ట్ కామెడీ మరొకటి. హిందీలోనూ అడల్ట్ కామెడీ ఫిలిమ్స్ కొన్ని వచ్చాయి. 'మస్తీ', 'గ్రాండ్ మస్తీ' వంటి అడల్ట్ కామెడీల్లో రితేష్ దేశ్‌ముఖ్ నటించారు. అయితే... 'హౌస్‌ఫుల్ 5' చూసినప్పుడు కొన్ని సీన్స్ షాక్ ఇచ్చాయి. అడల్ట్ కామెడీ సినిమాల్లో డైలాగ్స్, విజువల్స్ డైరెక్ట్ ఆ జానర్‌కు తగ్గట్టు ఉంటాయి. 'హౌస్‌ఫుల్ 5'లో స్పేస్ తీసుకుని మరీ కొన్ని జుగుప్సాకరమైన సీన్స్, డైలాగ్స్ రాశారు.

'హౌస్‌ఫుల్ 5'లో కామెడీతో పాటు స్కిన్ షో మీద ఎక్కువ ఆధారపడ్డారు. నర్గిస్ ఫక్రి, జాక్వలిన్, సోనమ్, చిత్రాంగద సింగ్... దాచుకోకుండా గ్లామర్ షో చేశారు. వీళ్ళను మించి సౌందర్య శర్మ స్కిన్ షో చేశారు. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ను ఆ గ్లామర్ ఎట్రాక్ట్ చేసే అవకాశం ఉంది. అక్షయ్, రితేష్, అభిషేక్ జోక్స్ కొంత మందిని ఎంటర్టైన్ చేయవచ్చు. అయితే... తెలుగు ఆడియన్స్‌ను ఆ జోక్స్, ఆ కథ, ఆ సీన్స్ ఎంటర్టైన్ చేయడం కష్టం.

ఆస్తి కాజేయడం కోసం అసలైన కొడుకు బదులు మరొకరు రావడం చిరంజీవి 'చంటబ్బాయ్' నుంచి తెలుగు సినిమాల్లో చూశాం. అందువల్ల, 'హౌస్‌ఫుల్ 5' కథ కొత్తగా అనిపించదు. పోనీ కథనంలో కొత్తదనం ఉందా? అంటే అదీ లేదు. కామెడీ సినిమాలకు స్క్రీన్ ప్లే, ట్విస్టులు అవసరం లేదు. కామెడీ క్లిక్ అయితే చాలు. 'హౌస్‌ఫుల్ 5'లో ఆ విధంగా క్లిక్ అయిన సన్నివేశాలు తక్కువ, హీరోయిన్స్ గ్లామర్ ఎక్కువ. పాటలు ఓకే. బాలీవుడ్ సాంగ్స్ తరహాలో ఉన్నాయి. ప్రొడక్షన్ వేల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. దర్శకుడు తరుణ్ మన్‌సుఖాని ఒక్కటంటే ఒక్క సన్నివేశంలోనూ పూర్తి స్థాయిలో నవ్వించలేదు. రచయిత, నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా సేమ్ ఓల్డ్ రొటీన్ ఫార్ములాను నమ్ముకుని ఖర్చు చేశారు. 

Also Read'థగ్ లైఫ్' రివ్యూ: కమల్‌ను శింబు డామినేట్ చేశారా? 'నాయకుడు'కు మించి మణి తీశారా? సినిమా హిట్టా? ఫట్టా?

అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్, జాక్వలిన్ ఫెర్నాండేజ్, సోనమ్ బజ్వా, నర్గిస్ ఫక్రి, ఫర్దీన్ ఖాన్, చిత్రాంగద సింగ్, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, నానా పటేకర్, శ్రేయాస్ తల్పాడే, చుంకీ పాండే, జానీ లివర్... ప్రతి ఒక్కరూ ఓవర్ యాక్షన్ చేశారు. కామెడీ బదులు ఓవర్ కామెడీ చేశారు. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని కాదు. అందరూ తమ తమ క్యారెక్టర్లలో ఓవర్ చేశారు.

'హౌస్‌ఫుల్ 5' రన్ టైమ్ 2.45 గంటలు. అయితే... మూడు గంటల కంటే ఎక్కువ ఉన్నట్లు, సాగదీసినట్టు అనిపిస్తుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు అసలు ముందుకు కదల్లేదు. ఒక ట్విస్ట్ ఇచ్చి ఇంటర్వెల్ కార్డు వేశారు. సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, నానా పటేకర్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ క్యూరియాసిటీ క్రియేట్ చేయడంతో పాటు కామెడీ జనరేట్ అవుతుందని అనుకుంటే పూర్తి స్థాయిలో జరగలేదు. అడల్ట్ జోక్స్, గ్లామర్ ఆశించే ప్రేక్షకులు ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే కొంత శాటిస్‌ఫై కావచ్చు.

PS: రెండు క్లైమాక్స్‌ల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదు. ఒక వెర్షన్‌లో ఒకరిని దోషి చేస్తే... మరొక వెర్షన్‌లో ఇంకొకరిని దోషి చేశారు. రెండిటిలో చివరకు జరిగేది ఒక్కటే.

Also Read: ఘనంగా అఖిల్ పెళ్లి... చిరంజీవి, చరణ్ to ప్రశాంత్ నీల్, తిలక్ వర్మ... అక్కినేని ఇంట స్టార్స్ సందడి... ఎవరెవరు వచ్చారో చూడండి

Continues below advertisement
Sponsored Links by Taboola