Homebound Movie Review - 'హోమ్ బౌండ్' రివ్యూ: ఆస్కార్ 2026కు ఇండియా అఫీషియల్ ఎంట్రీ... జాన్వీ కపూర్ సినిమా ఎలా ఉందంటే?
Homebound Review Telugu: ఆస్కార్ 2026కు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఇండియా పంపిన సినిమా 'హోమ్ బౌండ్'. ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ నటించారు. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోండి.
నీరజ్ గేవాన్
ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ తదితరులు
India's official oscar entry 2026 Homebound movie review in Telugu: ఆస్కార్స్ 2026కు 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' కేటగిరీలో అఫీషియల్‌గా ఇండియా పంపిన సినిమా 'హోమ్ బౌండ్'. ఇందులో ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా హీరోలు. జాన్వీ కపూర్ ఓ ప్రధాన పాత్రలో కనిపించారు. 'A Friendship, a Pandemic and a Death Beside the Highway' అని బషారత్ పీర్ రాసిన ఆర్టికల్ ఆధారంగా నీరజ్ గేవాన్ దర్శకత్వం వహించారు. చిత్ర నిర్మాతలలో కరణ్ జోహార్ ఒకరు. సెప్టెంబర్ 26న థియేటర్లలో విడుదలైంది. మరి, ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోండి.
కథ (Homebound Movie Story): మొహ్మద్ షోయబ్ అలీ (ఇషాన్ కట్టర్), చందన్ కుమార్ (విశాల్ జెత్వా) స్నేహితులు. ముస్లిం కావడంతో ఒకరు, ఎస్‌సీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో మరొకరు... సమాజంలో అవమానాలకు, అణిచివేతకు గురి అవుతారు. పోలీస్ కానిస్టేబుల్ అయితే గౌరవం లభిస్తుందని రిక్రూట్మెంట్ ఎగ్జామ్ రాస్తారు. అయితే ఫలితాలు రావడం ఆలస్యం అవుతుంది.
కుటుంబ పరిస్థితుల కారణంగా ఓ కంపెనీలో ఉద్యోగానికి చేరతాడు షోయబ్ అలీ. సుధా (జాన్వీ కపూర్) కోసం కాలేజీలో చేరతాడు చందన్. ఆ తర్వాత స్నేహితులు ఇద్దరి మధ్య ఎందుకు గొడవలు వచ్చాయి? దూరం పెరిగింది? కాలేజీ మానేసిన చందన్, ఆఫీస్ బాయ్ ఉద్యోగం వదిలేసి షోయబ్ సూరత్ వెళ్లి ఫ్యాక్టరీలో పని చేయడానికి దారి పరిస్థితులు ఏమిటి? వాళ్ళిద్దరి జీవితాల్లో కరోనా ఎటువంటి మార్పులు తీసుకొచ్చింది? అనేది సినిమా.
విశ్లేషణ (Homebound Review Telugu): అవార్డులకు ఆఫ్ బీట్ ఫిలిమ్స్ ఎంపిక అవుతాయని... మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కే ఆ సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర అంత ఆదరణ ఉండదని, విమర్శకులను మాత్రమే మెప్పిస్తాయని ఒక విధమైన అభిప్రాయం నెలకొంది. అయితే... అటువంటి సినిమాలను ఆదరించే ప్రేక్షకుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. మరి, ఈ 'హోమ్ బౌండ్' ఎలా ఉంది? అనే విషయానికి వస్తే...
కరోనా ఎంతో మంది జీవితాలను తలకిందులు చేసింది. ఫ్యాక్టరీలు మాతపడటం వల్ల ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు వందల కిలోమీటర్లు నడిచి సొంతూరు చేరుకోవడం కోసం పడిన కష్టాలు ప్రజల హృదయాలను కలచివేశాయి. పతాక సన్నివేశాల్లో దర్శకుడు నీరజ్ చూపించిన ఆ దృశ్యాలు మరోసారి కంటతడి పెట్టేలా చేశాయి. కరోనా కష్టాలు ఒక్కటే కాదు... కులం కారణంతో కొందరికి ఎదురయ్యే అవమానాలు, ఉద్యోగాల్లో ఎదురయ్యే అణిచివేత వంటివీ 'హోమ్ బౌండ్'లో స్పృశించారు దర్శకుడు నీరజ్.
'హోమ్ బౌండ్' కథలో ప్రజలకు తెలియని విషయాలు ఏమీ లేవు. కుల వివక్ష, ఉద్యోగ పరమైన అవమానాలు, ఆర్థిక అసమానతలు, కరోనా కష్టాలు... అటు వార్తల్లో, ఇటు కొన్ని సినిమాల్లో చూసినవి మళ్లీ తెరపై కనిపించాయి. అందరికీ తెలిసిన పాయింట్, రొటీన్ సీన్స్ తీసుకుని ఒక ప్యాకేజీగా ఇచ్చారు దర్శకుడు నీరజ్. ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా వంటి ట్యాలెంటెడ్ ఆర్టిస్టులు ఉండటంతో ఆల్రెడీ చూసిన సన్నివేశాలు మళ్ళీ తెరపై వచ్చినా పాత వాసనలు, ఛాయలు కనిపించకుండా చేశారు. ప్రతి సన్నివేశం వీలైనంత సహజంగా చిత్రీకరించారు సినిమాటోగ్రాఫర్ ప్రతీక్ షా. అమిత్ త్రివేది స్వరపరిచిన పాటలు కథలో భాగంగా సాగాయి. నరేన్ చంద్రవర్కర్, బెనెడిక్ట్ టైలర్ నేపథ్య సంగీతంలో శబ్దాల కంటే మౌనానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు. ఆర్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ స్థాయిలో నిర్మాణ విలువలు ఉన్నాయి. సహజత్వం ఉండేలా చూసుకున్నారు.
షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్ ఎంత ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ అనేది 'హోమ్ బౌండ్'తో మరోసారి స్పష్టంగా తెలుస్తుంది. ఇంటర్వెల్ ముందు బ్రేక్ డౌన్ అయ్యే సీన్ గానీ, క్లైమాక్స్‌లో స్నేహితుడు మరణించే సన్నివేశంలో గానీ ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా చేశారు. విశాల్ జెత్వా కళ్లతో నటించిన సన్నివేశాలు ఉన్నాయి. చందన్ పాత్రలో చక్కగా చేశారు. సుధా పాత్రలో జాన్వీ కపూర్ తక్కువ సేపు కనిపించారు. డీ గ్లామర్ లుక్‌లో నటన మాత్రమే హైలైట్ అయ్యేలా చేశారు. మిగతా ఆర్టిస్టులు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
సహజత్వానికి దగ్గరగా వాస్తవాలు చెప్పే సినిమాలు అరుదుగా వస్తాయి. అటువంటి సినిమాలకు ఆదరణ తక్కువగా ఉంటుంది. ఆ జాబితాలోకి వచ్చే సినిమా 'హోమ్ బౌండ్'. మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమా ప్రేమికులకు నచ్చడం కష్టం. కానీ, ఇందులో ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేసే భావోద్వేగాలు ఉన్నాయి. పాత్రల్లో లీనమై అద్భుతంగా నటించిన ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా ఉన్నారు. వినోదం కోసం కాకుండా ఇప్పటికీ సమాజంలో కొందరు ఎటువంటి వివక్షకు గురి అవుతున్నారు? ఎన్ని అవమానాలను దిగమింగుకుని బతుకు బండి నడిపిస్తున్నారు? అనేది తెలుసుకోవడం కోసం చూడాల్సిన చిత్రమిది. ప్రేక్షకులను ఆలోచింపజేసే చిత్రమిది.
Also Read: 'ఘాటీ' రివ్యూ: క్రిష్ నుంచి పుష్ప, దసరా రేంజ్ రస్టిక్ యాక్షన్... అనుష్క సినిమా హిట్టా? ఫట్టా?