Highway Movie Review - హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?

OTT Review - Telugu Movie Highway : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'హైవే' సినిమా ఈ రోజు ఆహా ఓటీటీలో విడుదలైంది.

సినిమా రివ్యూ : హైవే
రేటింగ్ : 2/5
నటీనటులు : ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్, సయామీ ఖేర్, అభిషేక్ బెనర్జీ, రమ్య పసుపులేటి, 'స్వామి రారా' సత్య, జాన్ విజయ్ తదితరులు
మాటలు : మిర్చి కిరణ్, సాయి కిరణ్ సుంకోజు 
స్క్రీన్ ప్లే : ఖైలాష్, సుధాకర్ కె.వి.
సంగీతం : సైమన్ కె. కింగ్
నిర్మాత : వెంకట్ తలారి  
రైటర్, సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ : కె.వి. గుహన్
విడుదల తేదీ: ఆగస్టు 19, 2022
ఓటీటీ వేదిక : ఆహా

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) '118'తో టాలీవుడ్‌కు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి. గుహన్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ సినిమాకు మంచి పేరు వచ్చింది. అయితే... '118' తర్వాత దర్శకత్వం వహించిన 'WWW Movie' ఆశించిన విజయం సాధించలేదు. మరి, దర్శకుడిగా మూడో సినిమా 'హైవే' (Highway Telugu Movie) తో గుహన్ హిట్ అందుకుంటారా? లేదా? విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఎలా నటించారు? సినిమా (Highway Telugu Movie Review) ఎలా ఉంది?
  
కథ (Highway Story) : హైదరాబాద్ నగరంలో ఓ సీరియల్ కిల్లర్ (అభిషేక్ బెనర్జీ) వరుసగా అమ్మాయిలను హత్యలు చేస్తుంటాడు. ఆ కేసును పోలీస్ ఆఫీసర్ ఆశా భరత్ (సయామీ ఖేర్) టేకప్ చేస్తారు. కిల్లర్‌ను పట్టుకోవడానికి సిటీలో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేస్తారు. పోలీసులను అలర్ట్ చేస్తారామె. అయినా వాళ్ళ కళ్ళు గప్పి సీరియల్ కిల్లర్ సిటీ ఎలా దాటాడు? హైవేలో అతనికి కనిపించిన తులసి (మానస రాధాకృష్ణన్) ఎవరు? ఆమె నేపథ్యం ఏమిటి? సీరియల్ కిల్లర్ చేతికి చిక్కిందని తెలిసిన వెంటనే ఆమెను కాపాడాలని ప్రయత్నాలు ప్రారంభించిన ఫోటోగ్రాఫర్ విష్ణు (ఆనంద్ దేవరకొండ) ఎవరు? విష్ణు, తులసి మధ్య సంబంధం ఏమిటి? సీరియల్ కిల్లర్ చేతి నుంచి తులసిని విష్ణు కాపాడాడా? లేదా? అనేది సినిమాలో చూడాలి.
  
విశ్లేషణ (Highway Review) : హైవే మీద ప్రయాణం సాఫీగా, స్పీడుగా ఉంటుంది. బ్రేకులు ఎక్కువగా వాడాల్సిన అవసరం లేకుండా సాగుతుంది. మాంచి థ్రిల్లర్ సినిమాలూ అంతే! 'హైవే' పేరుతో థ్రిల్లర్ వస్తుందంటే సాధారణంగా ఎవరైనా రేసీగా సాగిపోయే సినిమా ఆశిస్తారు. అందుకు విరుద్ధంగా సాగుతుందీ 'హైవే'.

'హైవే'లో థ్రిల్స్ కంటే డ్రామా ఎక్కువైంది. అందువల్ల, ఎటువంటి ఉత్కంఠ లేకుండా చప్పగా సినిమా సాగింది. కథలో గానీ, కథనంలో గానీ నవ్యత లేదు. ప్రేమకథ హృదయాలను తాకే విధంగా ఉంటే... ఆ తర్వాత హీరో అన్వేషణ, కాపాడాలనే తాపత్రయాన్ని ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు. అటువంటిది ఏదీ జరగలేదు. స్వతహాగా సినిమాటోగ్రాఫర్ కావడంతో కె.వి. గుహన్ ప్రతి ఫ్రేమ్‌ను అందంగా తీర్చిదిద్దారు. అయితే... సన్నివేశాలు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తీయడంలో ఫెయిల్ అయ్యారు. చివరి 20 నిమిషాలు బావుంది.

నటీనటులు ఎలా చేశారు? : సాధారణంగా ఇటువంటి థ్రిల్లర్స్‌లో నటీనటులకు పెర్ఫార్మన్స్ చేసే ఆస్కారం లభించదు. సన్నివేశాల్లో తీవ్రత ఆధారంగా ఉత్కంఠ పెరుగుతూ ఉంటుంది. ఆనంద్ దేవరకొండ పాత్ర పరిధి మేరకు చేశారు. మానస రాధాకృష్ణన్ ముఖంలో అమాయకత్వం కనిపించింది. ఆమె పాత్రకు అది సూట్ అయ్యింది. సీరియల్ కిల్లర్ పాత్రలో అభిషేక్ బెనర్జీ పర్వాలేదు. సయామీ ఖేర్ ఫిట్నెస్, పాత్రకు అవసరమైన శరీరాకృతి ఉండటంతో పోలీస్ రోల్‌లో ఆమెను తీసుకున్నట్లు అనిపిస్తుంది. 'స్వామి రారా' సత్యకు పెద్దగా నవ్వించే అవకాశం లభించలేదు. రమ్య పసుపులేటి, మిగతా వాళ్ళ పాత్రలు అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి.

Also Read : తెలుగులో పబ్లిసిటీ లేకుండా విడుదలైన ధనుష్, నిత్యా మీనన్ 'తిరు' సినిమా ఎలా ఉందంటే?

ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : 'హైవే' కాదిది... నార్మల్ రోడ్. ఆ రోడ్డులో బండికి బ్రేకులు పడ్డాయి. అనూహ్యమైన మలుపులు కానీ, ఆసక్తి కలిగించే సన్నివేశాలు కానీ ఎక్కువ లేవు. చివరి 20 నిమిషాలు ఆసక్తిగా సాగింది. హత్యలు చేయడానికి సైకో కిల్లర్ చెప్పే కారణం బలంగా ఉండటంతో పాటు కథనం ఉత్కంఠగా సాగి ఉంటే ఫలితం మరోలా ఉండేది ఏమో!? ఇప్పుడు అయితే ఈ 'హైవే'ప్రయాణం కట్టుకోవడం కష్టమే.

Also Read : హలో వరల్డ్ రివ్యూ: ఆర్యన్ రాజేష్, సదా నటించిన వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

Sponsored Links by Taboola