Double iSMART: సరిగ్గా ఐదేళ్ల క్రితం 2019లో విడుదల అయిన ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. హీరో రామ్ పోతినేని కెరీర్‌లో ఇప్పటికీ అదే హయ్యస్ట్ గ్రాసర్. పూరి జగన్నాథ్‌కు కూడా చాలా రోజులకు సక్సెస్ దొరికింది. కానీ ఆ తర్వాత ఇద్దరికీ కలిసి రాలేదు. రామ్ చేసిన సినిమాలు ఏవీ ఇస్మార్ట్ రేంజ్ సక్సెస్ అవ్వలేదు. మరోవైపు పూరి జగన్నాథ్ కూడా ‘లైగర్’తో భారీ దెబ్బ తిన్నారు. అలాంటి టైమ్‌లో వీరిద్దరూ తమ బ్లాక్‌బస్టర్‌కు ‘డబుల్ ఇస్మార్ట్’ చేశారు. ఈ సినిమా ఇండిపెండెన్స్ డే వీకెండ్ సందర్భంగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాటల దగ్గర నుంచి టీజర్, ట్రైలర్ వరకు అన్నీ పూర్తిగా ఇస్మార్ట్ శంకర్ టోన్‌లోనే కనిపించాయి. మరి ‘డబుల్ ఇస్మార్ట్’ ఆ సక్సెస్‌ను రిపీట్ చేసిందా?
కథ: బిగ్ బుల్ (సంజయ్ దత్) ఒక ఇంటర్నేషనల్ డాన్. తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి చాలా పెద్ద ప్లాన్ వేస్తాడు. కానీ అనుకోకుండా తనకి బ్రెయిన్ ట్యూమర్ ఉందని, మూడు నెలల కంటే ఎక్కువ బతకడని తెలుస్తుంది. దానికి అసలు చికిత్స లేదని డాక్టర్లు చెప్తారు. కానీ ఎలాగైనా బతకాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న బిగ్ బుల్‌కి ఒక సైంటిస్ట్ (మకరంద్ దేశ్ పాండే) కలుస్తాడు. మెమరీ ట్రాన్స్‌ఫర్ ద్వారా మరణం లేకుండా జీవించవచ్చని చెప్తాడు. ఈ ప్రయోగం ఎవరి మీద చేసినా ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రయోగం సక్సెస్ అయిన ఇస్మార్ట్ శంకర్ (రామ్ పోతినేని) హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుసుకుంటారు. ఇస్మార్ట్ శంకర్‌ను పట్టుకొచ్చి తనకి మెమరీ ట్రాన్స్ ఫర్ చేస్తారు. తర్వాత ఏం అయింది? ఇస్మార్ట్ శంకర్... బిగ్ బుల్ గా మారాడా? అసలు బిగ్ బుల్ ఎవరు? ఇస్మార్ట్ శంకర్ తల్లి పోచమ్మకి (ఝాన్సీ), బిగ్ బుల్ కి సంబంధం ఏంటి? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలో సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్ వర్కవుట్ అవ్వకపోయినా సినిమా హిట్ అవ్వడం అన్నది ఇస్మార్ట్ శంకర్‌కే చెల్లింది. ప్యూర్‌గా హీరో క్యారెక్టరైజేషన్ మీద వర్కవుట్ అయిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. డబుల్ ఇస్మార్ట్‌లో కూడా హీరో క్యారెక్టర్‌లో అదే ఎనర్జీ కనిపించింది. కానీ ఈసారి సినిమాకు పూరి జగన్నాథ్ ఎమోషనల్ టచ్ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఐదేళ్ల క్రితం నాటి ఇస్మార్ట్ శంకర్‌కు ఒక గోల్ అనేది ఏదీ ఉండదు. లైఫ్ ఎటు తీసుకెళ్తే అటు వెళ్లిపోతారు. కానీ ఇందులో ఇస్మార్ట్ శంకర్‌కు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక గోల్ ఉంటుంది. దాని వెనక ఒక ఎమోషన్ ఉంటుంది.
‘డబుల్ ఇస్మార్ట్’ ఐడియాగా చాలా మంచి పాయింట్. ఇస్మార్ట్ శంకర్ లాంటి హైపర్ క్యారెక్టర్‌కు ఒక బలమైన ఎమోషన్ పడితే దాని నుంచి మంచి డ్రామా పండుతుంది. కానీ దాన్ని ఎఫెక్టివ్‌గా రాసుకోవడంలో పూరి ఫెయిల్ అయ్యారు. ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ చూడగానే కథ ఇది అని మీకు టూకీగా ఒక ఐడియా వచ్చేసిందా? అయితే సరిగ్గా మీరు అనుకున్న మీటర్‌లోనే సినిమా సాగుతుంది. ఇస్మార్ట్ శంకర్ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్‌తో సినిమా స్టార్ట్ అవుతుంది. తర్వాత విలన్ ఇంట్రడక్షన్ ఫైట్, హీరో ఇంట్రడక్షన్ ఫైట్... ఇలా మెల్లగా ముందుకు సాగుతూ ఉంటుంది. రామ్, కావ్య థాపర్‌ల లవ్ ట్రాక్ సోసోగా సాగుతూ ఉంటుంది. ఇంటర్వెల్ సమయానికి సినిమాలో అసలు కథ ప్రారంభం అవుతుంది.
సెకండాఫ్‌లో కథ కాస్త వేగంగా ముందుకు సాగుతుంది. బిగ్ బుల్, ఇస్మార్ట్ శంకర్ ఇద్దరికీ రెండు వేర్వేరు పెద్ద గోల్స్ ఉంటాయి. వాటి గురించి ఫస్ట్ టైమ్ రివీల్ అయినప్పుడు ఇంట్రస్ట్‌ను కలిగిస్తాయి. కానీ వాటి వైపు వారు చేసే ప్రయాణం విసిగిస్తుంది. అలాగే సెకండాఫ్‌లో ప్రగతి పాత్ర ద్వారా కాస్త ఎమోషన్ పండించాలని అనుకున్నారు. కానీ అది మిస్ ఫైర్ అయింది. ఒకానొక దశ తర్వాత స్టోరీ చాలా ప్రిడిక్టబుల్ అయిపోతుంది. క్లైమ్యాక్స్ ఎలా ఉంటుంది అనుకున్నామో అలాగే ఉంటుంది.
సినిమాలో అతిపెద్ద మైనస్ పాయింట్ అలీ ‘బోకా’ ట్రాక్. తీసేటప్పుడు బాగానే వచ్చినట్లు అనిపించినా ఎడిటింగ్‌లో చూసుకున్నప్పుడు అయినా ఆ ట్రాక్ ఎలా వచ్చిందో తెలిసి ఉండాలి. అలా తెలియలేదంటే కథ, సన్నివేశాల విషయంలో పూరి జగన్నాథ్ జడ్జిమెంట్ మిస్ అయిందనే అనుకోవాలి. ఆ ట్రాక్‌కు, ప్రధాన కథకు ఎలాంటి సంబంధం లేదు. సినిమా నుంచి తీసేసి ఉంటే కాస్త రన్ టైమ్ అయినా తగ్గి ఉండేది. క్లైమ్యాక్స్‌లో వచ్చే ట్విస్ట్ నిరాశ పరుస్తుంది. మూడో భాగానికి ఒక లీడ్ మాత్రం ఇచ్చారు.
మణిశర్మ సంగీతం అందించిన పాటల్లో ‘స్టెప్పామార్’, ‘మార్ ముంతా చోడ్ చింతా’ పాటలు వినడానికి, చూడటానికి కూడా బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం మొదటి భాగం స్థాయిలో లేదు. నిర్మాణ విలువలు పర్లేదు. పూరి, రామ్‌ల సినిమాకు ఉండాల్సిన స్థాయి మేకింగ్ అయితే స్క్రీన్‌పై కనిపించలేదు.
ఇక నటీనటుల విషయానికి వస్తే... ఇస్మార్ట్ శంకర్ పాత్రలో రామ్ ప్రాణం పెట్టేశాడు. ప్రతి సన్నివేశంలో మనకు రెగ్యులర్ రామ్ కనిపించడు. ఇస్మార్ట్ శంకరే కనిపిస్తాడు. పూరి జగన్నాథ్ ఏదో స్పెషల్ చిప్‌తో ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టరైజేషన్‌ని రామ్ బ్రెయిన్‌లోకి ఎక్కించేశాడు. ఆ ఎనర్జీ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ‘డబుల్ ఇస్మార్ట్’ అనేది పూరి జగన్నాథ్ సినిమా కాదు... పూర్తిస్థాయిలో రామ్ తన భుజాలపై మోసిన సినిమా. బిగ్ బుల్ అనేది సంజయ్ దత్ లాంటి నటుడు చేయాల్సిన స్థాయి పాత్ర అయితే కాదు. ఆ క్యారెక్టర్‌లో నటనకి పెద్దగా స్కోప్ అయితే లేదు. జన్నత్ పాత్రలో కావ్య థాపర్ ఆకట్టుకుంది. సినిమాకు ఉన్న ప్లస్ పాయింట్లలో కావ్య కూడా ఒకరు. మిగతా నటీనటులందరూ ఓకే.
ఓవరాల్‌గా చెప్పాలంటే... ‘ఇస్మార్ట్ శంకర్’ మీకు బాగా నచ్చినట్లయితే ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రై చేయవచ్చు. పూరి జగన్నాథ్ స్థాయి సినిమాను కోరుకుని వెళ్తే మాత్రం కాస్త డిజప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది.
Also Read: కమిటీ కుర్రోళ్ళు రివ్యూ: ఆ క్లైమాక్స్ పవన్ కోసమేనా - నిహారిక నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?