మీ చేతి గోళ్ళ మీద కూడా తెల్లటి మచ్చలు, గీతలు ఉన్నాయా? అవి ఎందుకు వస్తున్నాయో తెలుసా? శరీరంలో ఏదైనా విటమిన్ లోపిస్తే అలా అవుతుందని అనుకుంటారు. కానీ అది ఏంటనేది చాలా తక్కువ మందికే తెలుస్తుంది. మరికొంతమంది కాల్షియం లోపం వల్ల గోళ్ళ మీద తెల్లటి మచ్చలు వచ్చాయని అనుకుంటారు. కానీ అదే కాదు.. జింక్ లోపించినా కూడా ఇలాగే జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. జింక్ శరీరానికి చాలా ముఖ్యమైనది. గుండె, ఎముకలు, ఊపిరితిత్తులకు అవసరమైన ఖనిజం.


జింక్ మన శరీరంలో ఇనుము తర్వాత రెండో అత్యంత సమృద్ధిగా లభించే ట్రేస్ మినరల్. ప్రోటీన్ ఉత్పత్తి, కణాల పెరుగుదల, డీఎన్ఏ సింథసిస్, రోగనిరోధక శక్తి, ఎంజైమ్ లు పనితీరు వంటి శారీరక విధులకు జింక్ చాలా అవసరం. అందుకే దీన్ని అద్భుతమైన ఖనిజం అని అంటారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల్ని నయం చేసేందుకు జింక్ అద్భుతంగా పని చేస్తుంది. దాదాపు 73 శాతం మంది భారతీయులు ప్రోటీన్ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వారిలో జింక్ లోపం మరింత ఎక్కువగా ఉంటుంది. జింక్ లోపాన్ని గుర్తించడం చాలా కష్టం.


మీలో ఈ లక్షణాలు కనిపిస్తే మీరు జింక్ లోపంతో బాధపడుతున్నట్టే


☀ఎక్కువసేపు నిద్రపోలేరు


☀రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటుంది


☀సెక్స్ కోరికలు తగ్గిపోవడం


☀సులభంగా బరువు పెరగడం


☀దంతాలు, చిగుళ్ళ నుంచి రక్తం కారడం


☀చేతులు, మొహం మీద ముడతలు


☀మాక్యులార్ డీజెనరేషన్‌


జింక్ అధికంగా ఉండే ఆహారాలు


☀ ఓస్టర్


☀ పీతలు, ఎండ్రకాయలు


☀ మాంసం


☀ పుట్టగొడుగులు


☀ బచ్చలికూర, బ్రకోలి, కాలే వంటి ఆకుకూరలు


☀ వెల్లుల్లి


☀ బీన్స్ వంటి చిక్కుళ్ళు


☀ పైన్, చియా, గుమ్మడికాయ వంటి గింజలు


☀ బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా వంటి తృణధన్యాలు


☀ కార్న్ ఫ్లేక్స్, మూయేస్లీ


☀ పాల పదార్థాలు


☀ డార్క్ చాక్లెట్


జింక్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చా?


ఈ లోపాన్ని అధిగమించడం కోసం జింక్ సప్లిమెంట్లు తీసుకోవచ్చు. జింక్ గ్లూకోనేట్, జింక్ సల్ఫేట్, జింక్ సిట్రేట్ వంటి వివిధ రకాల జింక్ సప్లిమెంట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వైద్యులని సంప్రదించిన తర్వాత మాత్రమే వాటిని తీసుకోవాలి. కొంతమందికి జింక్ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. కానీ మరికొంతమందికి మాత్రం వికారం, వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి వంటి దుష్ప్రభావాలు ఎదురవుతాయి.


జింక్ సప్లిమెంట్లు తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు


అధికంగా జింక్ తీసుకోవడం వల్ల రాగి, ఇనుము శోషణకి ఆటంకం కలిగిస్తుంది. వికారం, వాంతులు, విరోచనాలు కలిగిస్తుంది. పెద్దవాళ్ళు రోజుకి 40 మిల్లీ గ్రాములకు మించి జింక్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల జ్వరం, దగ్గు, తలనొప్పి, అలసట, ఫ్లూ బారిన పడే అవకాశం ఉంది. అంతే కాదు జింక్ సప్లిమెంట్లు యాంటీ బయాటిక్స్ పనీతిరుకు ఆటంకం కలిగిస్తాయి.  


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: జుట్టు రాలిపోతోందా? అందుకు కారణం రోజూ మీరు తాగే ఈ పానీయాలే!