ధూమపానం క్యాన్సర్ కారకం అని ఎంతగా ప్రచారం చేస్తున్నా చాలా మంది ఇంకా సిగరెట్లు కాలుస్తూనే ఉన్నారు. పొగ తాగడం వల్ల గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమవుతుందని అందరికీ తెలిసిందే కానీ ఇప్పడు కంటిచూపు మందగించేలా చేయడం లేదా చూపు పూర్తిగా పోయేలా చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. పొగాకు వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీన్నే ‘వరల్డ్ నో టొబాకో డే’. 


ఎన్ని లక్షల మందో...
గ్లోబల్ అడల్డ్ టొబాకో సర్వే ఇండియా ప్రకారం మన దేశంలో 267 మిలియన్ల మంది పెద్దలు పొగాకును వినియోగిస్తున్నారు. అనేక పరిశోధనల తరువాత ధూమపానం కంటి చూపును దెబ్బతీస్తుందని బయటపడింది. మాక్యులా క్షీణతకు కారణమవుతుందని తేలింది. మాక్యులా అంటే రెటీనాకు వెనుక భాగంలో ఉండే చిన్న భాగం. ఇది రంగులను గుర్తించేందుకు, ఎదురుగా ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపించేందుకు, కేంద్ర దృష్టికి అవసరం. మాక్యులా ఫోటోరిసెప్టర్ కణాలను కలిగి ఉంటుంది. ఇవి కాంతిని గుర్తించే కణాలు.మాక్యుమా దెబ్బతింటే చూపు మధ్య భాగంలో మచ్చలా కనిపిస్తుంది. చుట్టూ ఉన్న పరిసరాలు కనిపించినా మధ్య భాగంలో ఏమీ కనిపించకుండా ఇలా నల్ల చుక్కలా కనిపిస్తుంది. ధూమపానం కళ్లకు చికాకును కలిగిస్తుంది. బర్నింగ్ సెన్సేషన్ కు దారి తీస్తుంది. ధూమపానం అధికంగా చేయడం వల్ల వయసు పెరుగుతున్న కొద్దీ మాక్యుమా దెబ్బతినడం, కంటి శుక్లాలు,  గ్లాకోమా వంటివి కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు కంటి వైద్య నిపుణులు. 


వయసు ముదురుతున్న కొద్దీ మాక్యులా సాధారణంగా వచ్చే అవకాశం ఉంది. కానీ ధూమపానం చేసేవారిలో దాదాపు పదేళ్ల ముందుగాన ఈ సమస్య మొదలవ్వచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెప్పిన ప్రకారం పొగాకు వల్ల మనదేశంలో దాదాపు పదిలక్షల మందికి పైగా మరణిస్తున్నారు. వీరంతా ధూమాపానం వల్ల కలిగే వ్యాధుల బారిన మరణిస్తున్నారు. ప్రపంచంలో పొగాకును అధికంగా వాడే అతి పెద్ద వినియోగదారు దేశం మనదే. ఇక్కడ చాలా తక్కువ ధరలకు వివిధ రకాల పొగాకు ఉత్పత్తులు లభిస్తాయి. 


ఖైనీ, గుట్కా, పొగాకుతో కూడిన బీటల్ క్విడ్, జర్దా మొదలైనవి పొగాకు ఇతర రూపాలు. సిగరెట్లతో పాటూ వీటిన్నింటికీ దూరంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. లేకపోతే ఇతర భయంకర రోగాలతో, కంటి చూపు మందగించడం వంటి సమస్య కూడా కలిగే అవకాశం ఉంది. 


Also read: ఈ లక్షణాలు కనిపిస్తే ఐరన్ లోపమేమో చెక్ చేసుకోవాల్సిందే



Also read: వీటిని మైక్రోవేవ్ అవెన్లో వేడి చేయకూడదు, అయినా చేసేస్తున్నాం


Also read: బరువు తగ్గాలనుకుంటున్నారా ? ఉదయాన చేయాల్సిన పనులు ఇవే