బరువు తగ్గడానికి సాధారణంగా ఆహారంలో మార్పులు చేసుకుంటారు. వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, చురుగ్గా ఉండటం వంటివి బరువు తగ్గించేందుకు సహాయపడే మార్గాలు. బరువు విషయంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. కానీ కొంతమంది అతి జాగ్రత్త కారణంగా తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాన్ని ఎంపిక చేసుకుంటారు. కానీ అది మేలు చేయకపోగా మరిన్ని అనార్థాలు తీసుకొచ్చి పెడుతుంది.


శరీరానికి తగినంత కార్బోహైడ్రేట్స్ ముఖ్యం. తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కానీ వైద్యుని సలహా లేకుండా వాటిని పరిమితి కంటే ఇంకా తక్కువ తీసుకోవడం అసలు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరానికి ప్రధాన వనరు కార్బోహైడ్రేట్స్. మెదడు, కండరాలు, ఊపిరితిత్తుల పనితీరు కోసం శరీరం కార్బోహైడ్రేట్స్ ని శక్తిగా మారుస్తుంది. అందుకే ఎంతో కీలకమైన వీటిని తగ్గించి తీసుకోవడం వాటి మీద ప్రభావం చూపిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.


అసలు ఏంటి ఈ తక్కువ కార్బో ఫుడ్?


ప్రస్తుతం చాలా మంది బరువు తగ్గేందుకు ఈ తక్కువ కార్బ్ ఆహార నియమాన్ని పాటిస్తున్నారు. అంటే రోజుకు మనిషికి 2000 కేలరీలు అవసరం అవుతాయి. కానీ వాటిని మరింత తగ్గించి తీసుకోవడాన్ని తక్కువ కార్బ్ ఆహార నియమంగా పరిగణిస్తారు. మధుమేహం, కొన్ని అలర్జీలతో బాధపడే వాళ్ళు కూడా ఈ తక్కువ కార్బ్ ఆహారం తీసుకుంటారు. మయో క్లినిక్ ప్రకారం తక్కువ కార్బ్ ఆహారం తీసుకుంటే కార్బోహైడ్రట్ల సంఖ్యని పరిమితం చేస్తుంది. సాధారణంగా కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా జీర్ణమవుతాయి. అవి రక్తంలో చక్కెరపై తక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. జీర్ణ క్రియ సమయంలో పిండి పదార్థాలు సాధరణ చక్కెరగా మారి రక్తంలోకి విడుదల అవుతాయి.


తక్కువ కార్బ్ ఆహారం వల్ల దుష్ప్రభావాలు


బరువు నిర్వహణ కోసం పాటించే చాలా మందికి ఇది సరిగ్గా సరిపోతుంది. బరువు తగ్గించడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రిస్తుంది. కానీ దీన్ని దీర్ఘకాలికంగా ఉపయోగించడం వల్ల దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటంటే..


దీర్ఘకాలిక తలనొప్పి


మాయో క్లినిక్ ప్రకారం కార్బోహైడ్రేట్ పరిమితులు శరీరం కీటోన్‌లుగా విడిపోవడానికి కారణమవుతాయి. శరీరం కీటోసిస్ స్థితికి వెళుతుంది. ఇది తలనొప్పి, అలసట, బలహీనత వంటి దుష్ప్రభావాలను కలిగిస్తుంది. దీర్ఘకాలిక తలనొప్పికి దారి తీస్తుంది. ఇది ఆరోగ్యానికి హానికరం.


మలబద్ధకం


తక్కువ కార్బ్ ఆహారం తీసుకోవడం వల్ల ఎదురయ్యే సాధారణ సమస్యే ఇది. ఆహార విధానంలో మార్పులు పేగు సమస్యలని తీసుకొస్తాయి. అందువల్ల దీర్ఘకాలికంగా మలబద్దకం సమస్య ఏర్పడుతుంది. అందుకు కారణం సరిపడినంత ఫైబర్ తీసుకోకపోవడమే అని వైద్యులు వెల్లడించారు. 


కండరాల తిమ్మిరి


మెగ్నీషియం, పొటాషియం వంటి అవసరమైన ఖనిజాలని ఆహారంలో సరిగా పొందకపోతే శరీర కండరాలు తిమ్మిరి సమస్యతో బాధపడాల్సి వస్తుంది. పొటాషియం, ఉప్పు, మెగ్నీషియం కండరాల సంకోచానికి ఉపయోగపడుతుంది.   మూత్రవిసర్జన, ఉచ్ఛ్వాసానికి సంబంధించిన అనేక ఇతర ముఖ్యమైన కార్యకలాపాలను నియంత్రిస్తాయి.


అలసట


తక్కువ కార్బ్ ఆహారం కారణంగా శరీరంలో గ్లైకోజెన్ ఎక్కువగా ఉత్పత్తి మందగిస్తుంది. దాని వల్ల శక్తి స్థాయిలు తగ్గిపోతాయి అలసటకి కారణం అవుతుంది. దీని వల్ల శరీర సామర్థ్యం తగ్గిపోతుంది.


దుర్వాసన


తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారాలు కూడా నోటి దుర్వాసనకు కారణమవుతాయి. దీనిని హాలిటోసిస్ అని కూడా పిలుస్తారు. శరీరంలో గ్లైకోజెన్ లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది. శక్తి కోసం కీటోన్‌ను ఆశ్రయించాల్సి వస్తుంది. అప్పుడు మూత్రవిసర్జన, ఉచ్ఛ్వాసము ద్వారా కీటోన్లు తొలగించబడతాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: వండని ఓట్స్ తినొచ్చా? వాటి వల్ల వచ్చే అనార్థాలు ఏంటి?