ఈ వ్యాసం రాస్తున్న రోజే నా సినిమా ‘అతడు...ఆమె...ప్రియుడు (colors of love) ముహూర్తం జరిగింది. అందులో ఒక డైలాగ్ ఉంది. "మొన్న ఛాటింగ్, నిన్న మీటింగ్. ఈరోజు మేటింగ్. పదిరోజులకి పార్టింగ్. గతంలో అమ్మా నాన్నల మధ్యన పడుకోవాలని పిల్లలు ఏడ్చేవారు. ఇప్పుడు అమ్మతో ఉంటావా, నాన్నతో ఉంటావా అంటే కోర్టులో ఏడుస్తున్నారు."

కొన్ని సందర్భాల్లో ఇలా జరగటానికి కారణం, ప్రేమించే ముందుగానీ, ప్రేమించేటప్పుడు గానీ సరియైన అవగాహన లేకపోవటమే. ప్రేమంటే ఒకరికొకరు మంచి భవిష్యత్తు ఇవ్వగలమనే నమ్మకం. ఒక బాధ్యత. ఆ విషయం తెలియని యువతీయువకులు ప్రేమ నుంచి పెళ్ళికెళ్ళేసరికి ఫెయిలయిపోతున్నారు.

ఆకర్షణలో ఆవేశం, ఉద్వేగం ఉంటాయి. ప్రేమలో ఆలోచన, అవగాహన ఉంటుంది. సాయంత్రం పూట పార్కులో కలుసుకొనే ప్రేమలో ఎదుటి వారి గుణగణాలు, కోపం, బద్ధకం, శుభ్రత లాంటివేమీ తెలియదు. కేవలం ఒకరికొకరు తమ బయటి మేలి ముసుగునే చూపిస్తారు.  అందుకే విడాకులు ఎక్కువవుతున్నాయి. 'ఇతని కోసమా / ఈమె కోసమా నేను నా వాళ్ళని వదిలేసి వచ్చిందీ’ అని ఫిర్యాదు చేసేవారు కోకొల్లలు. కానీ ఆ బాధ్యత సరిగ్గా నిర్వహించక పోవటం వల్ల వివాహాలు ఎక్కువ శాతం విఫలమవుతున్నాయి.

ప్రతిపనికీ ఒక గమ్యం ఉన్నట్టే ప్రేమకి కూడా ('మనం ఎందుకు ప్రేమిస్తున్నాం? పెళ్ళి కోసమా? థ్రిల్ కోసమా? అనే) స్పష్టమైన అవగాహన ఉండాలి. ఈ మధ్య థ్రిల్ కోసం చేసే ప్రేమలు ఎక్కువవుతునాయి. దీనివల్ల నష్టాలు ఏమిటంటే తను ప్రేమిoచిన అమ్మాయి ఒకరిని ప్రేమించినా/ ఇంకొకరిని వివాహం చేసుకుంటున్నా మొహం మీద ఆసిడ్ పోయటం, బ్లాక్ మెయిల్ చేయటం లాంటి శాడిస్టు లక్షణాలు చూస్తూనే ఉన్నాం.

పెళ్ళే గమ్యంగా వివాహం చేసుకుంటున్నప్పుడు చాలా స్పష్టంగా ఆలోచించి అప్పుడు ప్రేమలోకి దిగాలి. యువతీయువకులు ఈ కాన్సెప్టు ఒప్పుకోరు. ప్రేమంటే అది ఒక అద్భుతమైన అనుభూతి అనీ, అన్నీ లెక్కల్లో చూసుకొని దిగితే అది ప్రేమవదనీ వాదిస్తారు. వివాహం చేసుకొని ఇల్లు నిర్మించుకున్న తర్వాత ఆ ఇల్లు ఎంత బాగుండాలంటే, దూరంగా ఉన్నప్పుడు ఎప్పుడు ఇంటికి వెళదామా అని మనసు తహతహలాడాలి.

ప్రేమంటే అవతలివారిని అర్థం చేసుకోవటం ఒకటే కాదు. అవతలివారి చేత అర్థం చేసుకోబడటం కూడా. తొలి చూపు ఆకర్షణగా ఆ తరువాత క్రమక్రమంగా ప్రేమగా, ఆపై బంధంగా మారాలంటే ఒక తదాత్మ్యత ఉండాలి. తన్మయత్వం ఉండాలి. తొలి స్పర్శ, దాని తాలూకు జలదరింపు, ఉద్వేగం, ఇవన్నీ స్వచ్ఛంగా ఉండాలంటే జీవితం పట్ల ఉన్నట్లే ప్రేమ పట్ల కూడా ఒక కమిట్‌మెంట్ ఉండాలి. పేమ గుడ్డిది అంటారు. కాదు. నిజమైన ప్రేమ నాలుగు వైపులూ చూస్తుంది. ఆకర్షణ మాత్రమే గుడ్డిది. అంతేకాదు. మూగదీ, చెవిటిదీ, పిచ్చిది కూడా. అందుకే 'ఒక కుర్రవాడు నా వెనుక పడితే కొంతసేపు వాడిని ఏడిపించి తరువాత ‘ఎస్’ చెప్పాలి. ఎవరూ ప్రేమించకపోతే నేను హీరోయిన్ని కాను' అనే సూత్రాన్ని సినిమా వాళ్ళు ఆడపిల్లల మనసుల్లో చొప్పించి ఎన్నో జీవితాలని నాశనం చేశారు. 

చివరిగా ఒక మాట. ఆరోగ్యం, ధనమూ కోల్పోయినప్పుడు కూడా చిట్టచివరి వరకూ ఒక వ్యక్తితో ఉండటమే బంధం. అందుకే మనిషి ఎన్నో వేల సంవత్సరాల  ఆలోచించి, జ్ఞానం సముపార్జించిన తరువాత వివాహ వ్యవస్థ అనేకట్టుబాటుని నిర్మించుకున్నాడు. దానిని గౌరవించాలంటే ముందు చెప్పినట్టు ప్రేమ పట్ల, జీవితం పట్ల ఒక నిబద్ధత ఉండాలి.

                                                                                                                  - యండమూరి వీరేంద్రనాథ్