Stroke Day 2025 : ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 29వ తేదీన వరల్డ్ స్ట్రోక్ డే(World Stroke Day) నిర్వహిస్తున్నారు. ప్రజల్లో స్ట్రోక్ గురించి అవగాహన పెంచడం, తీవ్రతను గుర్తించడం, సమయానికి చికిత్స ఎంత అవసరమో చెప్తూ.. వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ (World Stroke Organization) 2006లో దీనిని ప్రారంభించింది. అసలు స్ట్రోక్ అంటే ఏమిటి? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వస్తే తీసుకోవాల్సిన చికిత్సలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
స్ట్రోక్ (Stroke Meaning)
స్ట్రోక్ అంటే బ్రెయిన్‌కు రక్తప్రవాహం ఆగిపోవడం లేదా మెదడులో రక్తస్రావం జరగడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఇలా జరిగినప్పుడు మెదడులోని కణాలు కొన్ని నిమిషాల్లోనే చనిపోవడం మొదలవుతాయి. ఆ సమయంలో శరీరంలో ఒకవైపు పక్షవాతం జరగడం, మాటలు తడబడటం, చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
స్ట్రోక్ రావడానికి కారణాలు ఇవే.. (Causes of Stroke)
కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు స్ట్రోక్ రావడానికి కారణాలు అవుతాయి. వాటిలో అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ ప్రధానంగా ఉన్నాయి. ఒత్తిడి కూడా స్ట్రోక్‌కు కారణమవుతుంది. అలాగే ఎక్కువగా పొగ తాగేవారికి కూడా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. మద్యం సేవించడం, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం కూడా స్ట్రోక్ రావడానికి కారణాలు అని చెప్తున్నారు నిపుణులు.
స్ట్రోక్ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. (Symptoms of Stroke)
స్ట్రోక్ వచ్చినప్పుడు ముఖం ఒకవైపు వంగిపోతుంది. చేతులు లేదా కాళ్లు లేపలేని స్థితి వస్తుంది. మాటలు తడబడతాయి. లేదా పూర్తిగా మాట్లాడలేకపోతారు. తలనొప్పి, మలబద్ధకం, చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
FAST పరీక్ష అంటే..
స్ట్రోక్‌ను ఈజీగా గుర్తించడానికి FAST పద్ధతిని ఉపయోగిస్తారు. అదేంటంటే.. F – Face : ముఖం వంగిపోయిందా లేదా చూడాలి. A – Arm : ఒక చేయి బలహీనమైందా చెక్ చేయడం. S – Speech : మాటలు తడబడటం. T – Time : వెంటనే వైద్యుడిని సంప్రదించడం. ఈ టెస్ట్ ఈజీగా స్ట్రోక్ వచ్చిందో లేదో తెలుపుతుంది కాబట్టి.. వైద్య సహాయం వెంటనే తీసుకోవాలి.
జాగ్రత్తలు, నివారణ చర్యలు (Precautions & Prevention):
స్ట్రోక్ రాకూడదంటే లైఫ్స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోవాలి. రోజూ 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఉప్పు, ఫ్యాట్, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు తగ్గించాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే మంచిది. పొగ, మద్యం తాగడం మానేయాలి. రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవాలి. హైడ్రేటెడ్‌గా ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి.
స్ట్రోక్ వస్తే పరిస్థితి చాలాసార్లు దారుణంగా మారుతుంది. కానీ సకాలంలో గుర్తిస్తే సమస్య తీవ్రం కాకుండా చూసుకోవచ్చు. అలాగే ప్రాణాలను రక్షించగలుగుతారు.