అత్యంత చమత్కార వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంలో మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రా తర్వాతే ఎవరైనా అని చెప్పుకోవచ్చు. తాజాగా ఈయన పోస్టు చేసిన ఓ వీడియా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. ‘ప్రపంచంలో అత్యుత్తమ బొలెరో డ్రైవర్’ అనే టైటిల్ తో 36 సెకన్ల నిడివి కలిగిన వీడియో క్లిప్ షేర్ చేశారు. ఇందులో ఓ ఏనుగు బొలెరోను తరుముతున్నట్లు కనిపిస్తున్నది.
ఈ వీడియోను చూసిన వారికే చెమటలు పడుతున్నాయి. ఆ పరిస్థితుల్లో ఉన్న వారు ఎంత టెన్షన్ గా ఫీలయ్యారో అర్థం చేసుకోవచ్చు. ఓ ఏనుగు బొలేరో వాహనంపై దాడి చేసే ఉద్దేశంతో ఎదురుగా దూసుకొస్తుంది. డ్రైవర్ మాత్రం కూల్ గా వెహికల్ ను రివర్స్ చేస్తున్నాడు. ఏనుగు ఎంత వేగంగా దూసుకొస్తే.. అంతే వేగంగా తను వెనక్కి రివర్స్ చేస్తున్నాడు. కొద్ది సేపు బొలేరో ను వెంబడించేందుకు ప్రయత్నించి.. అలసి పోయింది. అదే సమయంలో పెద్దగా అరుస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ వీడియోను తాజాగా ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ లో షేర్ చేశారు. గత వారం కర్ణాటకలోని కబిని ఫారెస్ట్ రిజర్వ్ లో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. ఈ డ్రైవర్‌ను మిస్టర్ కూల్ గా అభివర్ణించారు మహీంద్రా. అంతేకాదు.. “వరల్డ్ బెస్ట్ బొలేరో డ్రైవర్” అంటూ కితాబిచ్చారు. వాహనంలోని ప్రయాణీకులను సురక్షితంగా కాపాడినందుకు డ్రైవర్ ను అభినందించారు.
ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో బాగా వైరల్ అవుతున్నది ఇప్పటి వరకు సుమారు 40 వేల వరకు లైక్ లు వచ్చాయి. చాలా మంది నెటిజన్లు రీ ట్వీట్లు చేస్తున్నారు. డ్రైవర్ చాకచక్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. " కొన్ని విషయాలు మన చేతుల్లో లేనప్పుడు ప్రశాంతంగా ఎలా ఉండాలో అతడు మనకు చూపించాడు. ప్రతికూల పరిస్థితుల్లో అన్ని ఇంద్రియాలను నియంత్రించుకోవడం అంత కష్టం కాదనేందుకు ఈ డ్రైవర్ ఒక ఉదాహరణ” అని వెల్లడించాడు. డ్రైవర్ ప్రశాంతంగా రివర్స్ గేర్ లో ప్రయాణీకుల ప్రాణాలను కాపాడటం థ్రిల్లింగ్ గా ఉందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మొత్తంగా ఆనంద్ మహీంద్రా తరచుగా నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తించే ఆకర్షణీయమైన పోస్ట్ లను షేర్ చేస్తుంటారు. ఈ దిగ్గజ పారిశ్రామికవేత్తకు ట్విట్టర్‌లో 9.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
Also Read: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలి అనుకుంటున్నారా? తక్కువ ధర కలిగిన బెస్ట్ టూ వీలర్స్ ఇవే!
Also Read: కారు కొంటున్నారా? అయితే, ఈ టాప్ 10 భద్రతా ఫీచర్లను పరిశీలించండి