Mpox Symptoms : మంకీపాక్స్(Monkeypox) మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇప్పటికే వందల మంది చనిపోయారని.. కాబట్టి అన్ని దేశాలు ఈ విషయమై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఆఫ్రికా ఖండం అంతటా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని.. ఇది ఇతర ఖండాల్లోకి ప్రవేశించే ప్రమాదం ఉన్నందున World Health Organization హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. 


హెల్త్ ఎమర్జెన్సీ


ఆఫ్రికాలో 14వేల కంటే ఎక్కువ కేసులు, 524 మరణాలు ఇప్పటివరకు నమోదయ్యాయని తెలిపింది. అంతేకాకుండా ఈ లెక్కలు గత సంవత్సర గణాంకాలను మించిపోయాయని తెలిపింది. ఇప్పటికే ఆఫ్రికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఈ మంకీపాక్స్​ను పబ్లిక్​ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. తీవ్రతను అర్థం చేసుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇంతకీ ఈ మంకీ పాక్స్ లక్షణాలు ఏంటి? ఎలా వ్యాపిస్తుంది? చికిత్స వంటి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


మొదటి కేసు ఎప్పుడు నమోదైందంటే..


మంకీపాక్స్ అనేది వైరల్ ఇన్​ఫెక్షన్. ఇది జంతువులను, మానవులను ప్రభావితం చేస్తుంది. ఆర్తోపాక్స్ వైరస్​ జాతికి చెందినదిగా గుర్తించారు. ఈ వైరస్ సోకినవారి చర్మంపై గడ్డలు, పొక్కులు ఏర్పడి అవి దురదను కలిగిస్తాయి. ఈ గడ్డలు రసి, చీముతో నిండి ఉంటాయి. దీనిని మొదటిసారిగా 1958లో కోతులలో గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్ అనే పేరు పెట్టారు. 1970లో తొమ్మిదినెలల బాలుడికి మంకీ ఫాక్స్ వచ్చినట్లు కేసు నమోదైంది. 2022లో ఈ మంకీపాక్స్​ను WHO.. mpoxగా మార్చింది. ఎలుకలు, మానవులకు కూడా ఇది సోకుతుండడంతో పేరు మార్చారు.


ఎలా వ్యాపిస్తుంది?


ఈ వైరస్ సోకిన జంతువు లేదా వ్యక్తితో సన్నిహత సంబంధం ఉన్నప్పుడు ఈ వైరస్ ఇతరులకు వ్యాపిస్తుంది. జంతువుల నుంచి కాటు, గీత, రక్తం, ద్రవాలు, ప్రత్యక్ష సంబంధం ద్వారా ఇది వ్యాపిస్తుంది. మనుషులకు కూడా ఇదే తరహాలో నేరుగా వ్యాపిస్తుంది. అయితే పాక్స్ సోకిన వ్యక్తి వినియోగించిన పరుపు, దుస్తులు, ఇతర వస్తువుల ద్వారా ఇది రేర్​గా వ్యాపిస్తుంది. 



లక్షణాలు ఇవే.. 


తలనొప్పి, జ్వరం, బాడీ పెయిన్స్​తో పాటు ముఖం, చేతులు, పాదాలు, శరీరంలోని ఇతర భాగాలపై దద్దుర్లు, గడ్డలు వస్తాయి. చీముతో కూడా మొటిమలు ఏర్పడతాయి. ఈ తరహా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల సహాయం తీసుకోవాలి. లేదంటే ఇది ప్రాణాంతకమవుతుంది. వైరస్​ సోకిన రెండు నుంచి నాలుగువారాల వరకు ఇది ఉంటుంది. లక్షణాలు డెవలప్ అవ్వడానికి మూడు నుంచి 21 రోజులు పడుతుంది. దద్దుర్లలోని ద్రవాలను టెస్ట్ చేసి ఈ వైరస్​ను గుర్తిస్తారు. కొన్ని సందర్భాల్లో వ్యక్తులకు సోకిందని తెలియకుండానే వేరొకరికి ఇది వ్యాపిస్తుంది. 


చికిత్స ఉందా?


తేలికపాటి లక్షణాలు ఉంటే త్వరగా తగ్గించుకోవచ్చు. అయితే ఈ వైరస్​కి ఎలాంటి చికిత్స, వ్యాక్సిన్​లు లేవు. ప్రస్తుతం ఈ యాంటీవైరల్ డ్రగ్ టెకోవిరిమాట్ కోసం అధ్యయనం చేస్తున్నారు. సరైన చికిత్స, వ్యాక్సిన్లు లేకపోవడం.. ఆఫ్రికా దేశాలు దాటి వైరస్ వ్యాపించడం దృష్టిలో పెట్టుకుని WHO హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. 


Also Read : బ్లడ్​లో షుగర్​ ఎక్కువగా ఉందా? ఈ డ్రింక్​ తాగితే మధుమేహంతో పాటు మరెన్నో కంట్రోల్ అవుతాయట