ప్రపంచంలో ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్. ఈ వ్యాధి విషయంలో ఎంతో మందికి సందేహాలు, అపోహలు ఉన్నాయి. ఆ అపోహలే నిజం అనుకుని బతికేస్తున్నవారు ఎంతో మంది. ఆ అపోహలతోనే జీవితాన్ని గడిపేస్తున్న వారు ఇంకెంతోమంది. అందుకే మధుమేహంపై అవగాహన కల్పించేందుకు ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేఫన్ ప్రతి ఏడాది నవంబర్ 14న ‘ప్రపంచ మధుమేహ దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. ఈ దినోత్సవం రోజున ఆ వ్యాధికి సంబంధించి ప్రజల్ల నాటుకున్న కొన్ని అపోహల గురించి తెలుసుకుందాం. 


1. అరటి పండ్లు తినకూడదు కానీ ఆపిల్ తినవచ్చు
చాలా మందిలో ఉన్న భావన ఇదే. నిజం చెప్పాలంటే అన్ని పండ్లలో సహజ చక్కెరలు ఉంటాయి. అధికంగా వీటిలో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇది అధిక గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. కాకపోతే మధుమేహులు అన్నిపండ్లు తింటారు కానీ అరటిపండ్లు మాత్రం తినడానికి ఆలోచిస్తారు. అరటి పండ్లు కూడా అన్ని పండ్లలాగే తినవచ్చు. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ అరటిపండ్లను కూడా తినవచ్చని ఆమోదించింది. ఎందుకంటే దీనిలో ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే హై బీపీని నివారించడంలో సహాయపడుతాయి.


2. బిస్కెట్లు తినవచ్చు కానీ టీ, కాఫీలలో చక్కెర వేసుకోకూడదు.
ఎంతో టీ, కాఫీలలో చక్కెర వేసుకోవడానికి భయపడతారు. కానీ బిస్కెట్లు మాత్రం చక్కగా కావాల్సినన్నీ తినేస్తారు. నిజంగే బిస్కెట్లు అధికంగా తినడమే తగ్గించుకోవాలి. రోజుకు రెండు కప్పుల కాఫీ లేదా టీ చక్కెరతో తాగిన ఫర్వాలేదే. బిస్కట్లలో ఉండే చక్కెర, మైదా వంటివి ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. 


3. నెయ్యి తినకూడదు 
నెయ్యి తినడం వల్ల కొవ్వు పడుతుందని, కొవ్వు వల్ల ఊబకాయం వస్తుందని, ఆ ఊబకాయం వల్ల మధుమేహం వ్యాధి ముదిరిపోతుందని అంటారు. అందుకే నెయ్యి తినడం మానేస్తారు. నెయ్యి తినడం అవసరమే. మితంగా తినడం వల్ల అందులో ఉండే కొవ్వు ఆమ్లాలు ఇన్సులిన్‌కు మద్దతుగా నిలుస్తాయి. తద్వారా గుండెను రక్షిస్తాయి. కాబట్టి రోజుకు ఒక స్పూను నెయ్యి తినడం మంచిదే. 


4. నడిస్తే చాలు, ఇతర వ్యాయామాలు అవసరం లేదు
మధుమేహం బారిన పడిన వారిలో చాలా మంది అనుకునేది ఇదే. రోజూ నడిస్తే చాలు మధుమేహం అదుపులో ఉంటుంది. కానీ ఆరోగ్య నిపుణులు చెబుతున్నదాని ప్రకారం నడకతో పాటూ ఇతర వ్యాయామాలు కూడా ఉండాలి. బరువులు ఎత్తడం వంటివి చేస్తే కండరాలు బలంగా మారుతాయి. ఇన్సులిన్స్ వాడకం కూడా బావుంటుంది. 


5. ఒకసారి మధుమేహం వస్తే ఇక తినడం తగ్గించేయాలి
ఎంతో మంది చేసే పని మధుమేహం రాగానే సరిగా తినకుండా అరకొరగా తినడం. కేలరీలు పేరు చెప్పి తినడం మానేస్తారు. దీని వల్ల నీరసంగా మారిపోతారు. ఆహారం, వ్యాయామం, మంచి జీవనశైలి అలవర్చుకుంటే ఎవరైనా సాధారణ జీవితం గడపవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే ఆహారాన్ని దూరం పెడితే చాలు. మైదా, చక్కెరతో చేసిన పదార్థాలను దూరంగా ఉంచి, మిగతా రుచులను ఆస్వాదించండి. నడక, వ్యాయామం చేయండి. మధుమేహం కచ్చితంగా అదుపులో ఉంటుంది. 


Also read: అనారోగ్యంగా ఉన్నప్పుడు జిమ్‌కు వెళ్తున్నారా? గుండె పోటు ప్రమాదం పొంచి ఉండొచ్చు


















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.