Healthy Lifestyle for Women in 30s : మహిళలు 30 తర్వాత తమ లైఫ్​స్టైల్​పై కచ్చితంగా ఫోకస్ చేయాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఆ వయసుకు వచ్చేసరికి చాలామందికి పెళ్లి అయిపోతుంది. పిల్లలు పుట్టేస్తారు. జాబ్ చేయని వారు ఇంటి పనులతో.. జాబ్ చేసేవారు ఇంటి, ఆఫీస్​ పనులతో తెగ సతమతమవుతూ ఉంటారు. ఈ సమయంలో వారి ఆరోగ్యాన్ని పట్టించుకోవడమే మానేస్తారు. శరీరంలో చిన్న చిన్న మార్పులు వస్తున్నా.. ఆరోగ్య సమస్యలు వస్తున్న పర్లేదులే అని దాటవేస్తారు. దీనివల్ల ఫ్యూచర్​లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి 30ల్లో ఉండే ప్రతి మహిళ తమ హెల్త్​పై ఫోకస్ చేయాలి. 

ఆరోగ్యంపై ఫోకస్ చేయాలంటే.. బయటకెళ్లి కష్టపడాలని చెప్పట్లేదు కానీ.. మీ లైఫ్​స్టైల్​లో ఈ చిన్న మార్పులు చేస్తే మంచిది. వాటివల్ల ఒత్తిడి దూరమవుతుంది. ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అందానికి కూడా మంచి ఫలితాలు వస్తాయి. మరి 30ల్లో ప్రతి మహిళ తమ లైఫ్​స్టైల్​లో ఏ మార్పులు చేస్తే మంచిదో.. వాటి వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

ఉదయాన్నే.. 

మీ రోజును ప్రారంభించే ముందు.. నిద్రలేచాక.. 5 నుంచి 10 నిమిషాలు నడవండి. ఎండలో నడిస్తే కూడా మంచిదే. నడవడానికి కుదరట్లేదు అనుకుంటే బెడ్​రూమ్​లో బాడీని స్ట్రెచ్​ చేయండి. దీనివల్ల మీ మైండ్, బాడీ రీసెట్ అవుతుంది. హార్మోన్లు అదుపులో ఉంటాయి. కండరాలు పట్టేయడం వంటివి తగ్గుతాయి. దీనిని రెగ్యులర్​గా ఫాలో అవ్వడం వల్ల రోజంతా ఎనర్జిటిక్​గా ఉంటారు.

కచ్చితంగా తాగాల్సిన డ్రింక్

చాలామంది ఉదయాన్నే కాఫీ లేదా టీని తాగుతుంటారు. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా వయసు పెరిగేకొద్ది వీటివల్ల జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం వంటివి వస్తాయి. కాబట్టి మీరు రాత్రుళ్లు మెంతులు లేదా జీలకర్ర నానబెట్టుకుని ఉదయాన్నే వాటిని తాగాలి. దీనివల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. షుగర్ క్రేవింగ్స్ అదుపులో ఉంటాయి. జీర్ణక్రియకు మంచిది. ఆఫీస్​లో ఎక్కువసేపు కూర్చొని పని చేసేవారికి కూడా ఇది మంచిది. 

ప్రోటీన్​ చాలా ముఖ్యం.. 

వయసు పెరిగే కొద్ది అందరికీ కండర బలం తగ్గిపోతుంది. ముఖ్యంగా మహిళలకు మగవారికి కంటే ఎక్కువగా కండర ద్రవ్యరాశి తగ్గుతుంది. కాబట్టి కండరాలకు బలం అందించేందుకు ప్రోటీన్​పై ఫోకస్ చేయాలి. గుడ్లు, యోగర్ట్, స్ప్రౌట్స్, చేపలు వంటివాటిని ప్రోటీన్​ రూపంలో డైట్​లో చేర్చుకోవచ్చు. ఇవి ఎక్కువసేపు ఎనర్జిటిక్​గా ఉండేందుకు హెల్ప్ చేస్తాయి. జుట్టుకు మంచిది. కండరాలకు బలాన్ని అందిస్తాయి. చిరుతిళ్లకు దూరంగా ఉండేలా చేస్తాయి. 

ప్రతి భోజనం తర్వాత చేయాల్సిన పని 

మీరు ఉదయం తిన్నా.. మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి.. ఇలా ఎప్పుడు తిన్నా సరే మీరు కచ్చితంగా ఓ పది నిమిషాలు వాకింగ్ చేయండి. ఫాస్ట్​గా నడవాల్సిన పని లేదు. మీకు ఓపిక లేకున్నా చిన్న చిన్నగా ఓ పది నిమిషాలు నడవడానికి ట్రై చేయండి. ఇది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. ఫ్యాట్ స్టోరేజ్​ని కంట్రోల్ చేస్తుంది. తిన్న తర్వాత వచ్చే బద్ధకాన్ని తగ్గిస్తుంది. 

గ్రీన్ ఫుడ్.. 

కూరగాయలు, ఆకుకూరలు కచ్చితంగా మీ డైట్​లో ఉండేలా చూసుకోండి. వారానికి కనీసం మూడుసార్లు వీటిని తీసుకోండి. కీరదోస వంటి వాటిని రోజూ తీసుకోవచ్చు. దీనివల్ల శరీరానికి ఐరన్, కాల్షియం, ఫైబర్ అందుతాయి. ఎనర్జీని అందిస్తాయి. చర్మానికి మంచి గ్లోని అందిస్తాయి. వయసు పెరిగే కొద్ది ఎముకల సాంద్రత తగ్గిపోకుండా కాపాడుతాయి. 

స్నాక్స్​ని స్వాప్ చేయండి.. 

మీరు బిస్కెట్లు, మిక్చర్ వంటివాటిని స్నాక్స్​గా తీసుకుంటున్నారా? అయితే మీరు వాటిని బాదం, వాల్​నట్స్, పల్లీలు వంటివాటితో రిప్లేస్ చేయండి. వీటివల్ల షుగర్ క్రాషెష్ తగ్గుతాయి. బ్రెయిన్ షార్ప్ అవుతుంది. హెల్తీగా ఉంటారు. ఫ్యాట్స్, ప్రోటీన్ శరీరానికి అందుతాయి. కడుపు ఉబ్బరం కూడా లేకుండా ఉంటుంది. 

డిన్నర్​లో ఆ ఒక్క మార్పు.. 

డిన్నర్​ని చాలామంది లేట్​గా అన్ని పనులు అయ్యాక చేస్తారు. కానీ.. అలా కాకుండా రాత్రుళ్లు తొందరగా భోజనం చేయడమనేది హెల్ప్ చేసుకోండి. రాత్రుళ్లు 8లోపు డిన్నర్​ ఫినిష్ చేసుకోండి. దీనివల్ల ఫ్యాట్ బర్న్ అవుతుంది. నిద్ర మెరుగవుతుంది. ఉదయాన్నే అలసిపోయినట్టు అనిపించదు. కనీసం 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. రాత్రుళ్లు బెడ్​కి రెండు లేదా మూడు గంటల ముందుగా డిన్నర్ ఫినిష్ చేయండి. 

ఈ మార్పులు మీ లైఫ్​స్టైల్​లో చేస్తే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలుంటాయి. మీ అవసరాన్ని బట్టి వీటిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు. నిపుణుల సలహాలు తీసుకుంటే మరీ మంచిది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.