సాధారణంగా ఒక వయసుకి వచ్చిన తర్వాత రోగాలు దాడి చేస్తాయి. కానీ ఇప్పటి అనారోగ్యకరమైన జీవనశైలి ఇతర కారణాల వల్ల త్వరగా రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన మహిళలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. 40 ఏళ్ళకు స్త్రీలు మెనోపాజ్ దశలోకి అడుగుపెడతారు. అటువంటి సమయంలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా కొన్ని సమస్యలు వస్తాయి. అవి వచ్చే ముందు కొన్ని సంకేతాలు, లక్షణాలు కనిపిస్తాయి. ఇవి కనుక మీరు గుర్తిస్తే ప్రమాదకరమైన రోగాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.
కిడ్నీలో రాళ్ళు
ఇప్పుడు ఎక్కువ మంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య ఇదే. ఇది చాలా బాధకరమైనది. వయసు పెరిగే కొద్ది ఇది వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. సాధారణంగా మూత్రపిండాల్లో రాళ్ళు ఎక్కువగా పురుషులలో వస్తాయని అనుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో స్త్రీలలోనూ కనిపిస్తుంది. వెన్నులో విపరీతమైన నొప్పి, మూత్రంలో రక్తం, జ్వరం, చలి, వాంతులు, మూత్రం దుర్వాసన, మూత్రవిసర్జన సమయంలో మంటగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి మీలోనూ తరచూ కనిపిస్తుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.
ఆర్థరైటిస్
ఎముకలు బలహీనంగా చేసే మరొక జబ్బు ఆర్థరైటిస్. 40 ఏళ్లు పైబడిన మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఎముకల్లో క్షీణత, కీళ్ల ప్రాంతాల్లో నొప్పి, దృడత్వం కోల్పోవడం, మోకాళ్ళలో విపరీతమైన నొప్పి అనుభవిస్తారు.
మధుమేహం
ఈరోజుల్లో యువత కూడా మధుమేహం బారిన పడుతున్నారు. 40 ఏళ్ల తర్వాత మహిళల్లో మధుమేహం ముప్పు పెరుగుతుంది. అలసట, విపరీతమైన దాహం, మూత్రవిసర్జన పెరగడం, చూపు మందగించడం, బరువు తగ్గడం, చిగుళ్ళ వ్యాధులు వంటివి మహిళల్లో మధుమేహం వచ్చే ముందు కనిపించే సంకేతాలు.
బోలు ఎముకల వ్యాధి
40 ఏళ్ల తర్వాత ఎముకల్లో బలం తగ్గిపోతుంది. హార్మోన్లలో మార్పులు కారణంగా శరీరంలోని అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఎముకల ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండాలంటే మహిళలు ఎప్పుడు కాల్షియం సమృద్ధిగా తీసుకోవాలి. విటమిన్ డి స్థాయిలు సరిగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. కీళ్లలో దీర్ఘకాలిక నొప్పులు, పెళుసైన ఎముకలు బోలు ఎముకల వ్యాధికి సంకేతాలు.
మూత్రం ఆగకపోవడం
మూత్రాశయం పనితీరు మందగిస్తుంది. ఫలితంగా మూత్రం ఆపుకోలేరు. వృద్ధాప్యం కారణంగా మూత్రాశయం పని చేయడానికి సహాయపడే నరాలు బలహీనపడతాయి. కండరాలు వదులుగా మారడం వల్ల మూత్రంపై నియంత్రణ ఉండదు. దగ్గు, తుమ్ములు వచ్చిన సమయంలో మూత్రం పడిపోతుంది.
అధిక రక్తపోటు
గుండె పోటు, గుండె వైఫల్యం, మూత్రపిండాల వైఫల్యం, స్ట్రోక్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు మూల కారణం అధిక రక్తపోటు. ఇది ప్రాణాంతకమైన సమస్య.
ఊబకాయం
వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు ఊబకాయం అందరినీ ఇబ్బంది పెడుతుంది. మహిళలు ఊబకాయం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాడీ మాస్ ఇండెక్స్ పై దృష్టి పెట్టడం చాలా అవసరం. 40 ఏళ్ల తర్వాత మహిళలు బరువు పెరిగే అవకాశం ఉంది. పెరిమెనోపాసల్ హార్మోన్లు పనితీరు మందకొడిగా ఉంటుంది. దీని వల్ల శరీరం బరువు తగ్గడానికి వీలు పడదు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read; రోజూ నిమ్మరసం తాగుతున్నారా? దాని వల్ల ఎన్ని ప్రమాదాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు!