Hot Drinks for Weight Loss : చలికాలంలో సహజంగానే క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఉష్ణోగ్రతలు తగ్గుతున్న కొద్దీ.. దానిని అధిగమించేందుకు కోల్డ్ డ్రింక్స్ వదిలేసి.. వేడి వేడి పానీయాలు తాగాలనుకుంటారు. టీ, కాఫీలు తాగుతారు. లేదా మొత్తానికి తాగడం తగ్గించేస్తారు. దీనివల్ల శరీరం హైడ్రేషన్ కోల్పోతుంది.  అంతేకాకుండా వింటర్లో టేస్టీగా తినాలనే కోరికతో డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. పైగా శారీరక శ్రమ కూడా తగ్గిపోతుంది. దీనివల్ల బరువు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారా? అయితే ఈ డ్రింక్స్ ట్రై చేయండి. 

Continues below advertisement

బరువు తగ్గడంలో హెల్ప్ చేసి.. శీతాకాలంలో వచ్చే చలిని దూరం చేసే డ్రింక్స్ చాలానే ఉన్నాయి. ఇవి శరీరానికి లోపలి నుంచి వేడిని అదించడమే కాకుండా.. జీర్ణక్రియకు తోడ్పడతాయి. చలికాలంలో ఎక్కువగా వచ్చే జీర్ణ సమస్యలని దూరం చేస్తాయి. కడుపు ఉబ్బరాన్ని తగ్గించడం, క్రేవింగ్స్ కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. పైగా ఈ పానీయాలు ఇంట్లో సులభంగా తయారుచేసుకోవచ్చు. ఇంతకీ ఆ డ్రింక్స్ ఏంటి? వాటివల్ల కలిగే లాభమేంటో చూసేద్దాం.

సోంపు గింజల నీరు

సోంపు గింజలు జీర్ణక్రియకు తోడ్పడి.. శరీరంలో నీటి నిల్వను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడుతుంది. సోంపు గింజలను గోరువెచ్చని నీటిలో నానబెట్టి.. ఆ నీటిని రోజంతా తాగడం వల్ల క్రేవింగ్స్ తగ్గించుకోవచ్చు. కడుపు ఉబ్బరాన్ని తగ్గించుకోవచ్చు. దీని సహజమైన తేలికపాటి తీపిదనం, సువాసన చల్లని వాతావరణంలో హాయినిస్తాయి. ఈ పానీయం జీర్ణక్రియ సమతుల్యతను కాపాడుతూనే.. కడుపును తేలికగా చేస్తుంది.

Continues below advertisement

గోరు వెచ్చని అల్లం రసం

గోరువెచ్చని అల్లం నిమ్మరసం.. శీతాకాలం పానీయంగా ప్రసిద్ధి చెందింది. ఇది మీకు లోపలి నుంచి వెచ్చదనాన్ని ఇస్తుంది. జీవక్రియకు తోడ్పడుతుంది. నిమ్మకాయ జీర్ణక్రియకు, శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఈ పానీయాన్ని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల జీర్ణవ్యవస్థను మెరుగుపరచుకోవచ్చు. అయితే.. నిమ్మకాయ మీ శరీరానికి పడదు అనుకుంటే దానిని వేసుకోకపోయినా పర్లేదు. 

దాల్చిన చెక్క, తేనె 

గోరువెచ్చని నీటిలో దాల్చిన చెక్క, తేనె కలిపి తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది. రుచికరమైన పానీయం తయారవుతుంది. దీనిని చలికాలంలో ఆస్వాదించడం సులభం. దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. తేనె సహజమైన తీపిని అందిస్తుంది.  జీవక్రియకు తోడ్పడుతుంది. భోజనాల మధ్యలో వెచ్చగా, తేలికగా తాగాలనిపించినప్పుడు ఈ పానీయం తీసుకోవచ్చు. ఇది అనవసరమైన స్వీట్ క్రేవింగ్స్ తగ్గిస్తుంది.

నిమ్మ, అల్లం కలిపిన గ్రీన్ టీ

బరువు తగ్గడంలో గ్రీన్ టీ మంచి ప్రయోజనాలు అందిస్తుంది. యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉండే ఇది.. జీవక్రియను పెంచడానికి, కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. నిమ్మకాయ కలపడం వల్ల డీటాక్స్ ప్రభావం పెరుగుతుంది. అల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వెచ్చదనాన్ని ఇస్తుంది. ఈ కలయిక గ్రీన్ టీని చలికాలంలో మరింత హాయిగా, శక్తివంతంగా మారుస్తుంది.

చామంతి టీ

చామంతి టీ శాంతపరిచే గుణాలకు ప్రసిద్ధి చెందింది. శీతాకాలంలో సాయంత్రం దీనిని తీసుకుంటే చాలా హాయిగా ఉంటుంది. దీనిలో కాస్త తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపితే రుచి మరింత పెరుగుతుంది. చలి నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా.. బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుంది. రాత్రుళ్లు ఫుడ్ క్రేవింగ్స్ తగ్గించి.. మెరుగైన నిద్రను అందిస్తుంది. మొత్తం ఆరోగ్యం, బరువు సమతుల్యతను కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.