Kidney Problems Rise with Winter Mistakes : చలికాలం మూత్రపిండాలకు ప్రమాదకరమైన జోన్‌ అంటున్నారు నిపుణులు. తెలియకుండా చేసే కొన్ని రోజువారీ తప్పులు.. శరీరంలో కీలకమైన అవయవంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి. అవే కిడ్నీలు. మూత్రపిండాలు విష పదార్థాలను ఫిల్టర్ చేయడంలో, అదనపు ద్రవాలను తొలగించడంలో, రక్తాన్ని శుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఆ సమయంలో చేసే చిన్నపాటి తప్పులు కూడా వాటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. మరి చలికాలంలో చేసే తప్పులు ఏంటో.. వాటిని నివారించేందుకు ఏమి ఫాలో అవ్వాలో చూసేద్దాం. 

Continues below advertisement

శీతాకాలంలో కిడ్నీల సమస్యలకు కారణాలివే

శీతాకాలంలో చేసే అతిపెద్ద తప్పులలో ఒకటి నీరు తక్కువగా తాగడం. చల్లని వాతావరణం దాహాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల చాలా మంది ఎక్కువ నీరు తాగాల్సిన అవసరం లేదని భావిస్తారు. కానీ ఇది తప్పు. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడానికి శరీరం బాగా హైడ్రేటెడ్‌గా ఉండాలి. కాబట్టి మీకు దాహం వేయకపోయినా.. ప్రతి ఒకటి నుంచి రెండు గంటలకు నీరు తాగడం మంచిది. హైడ్రేటెడ్గా ఉంటే మూత్రపిండాలపై ఒత్తిడి తగ్గి.. రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని దూరం చేస్తుంది.

గోరువెచ్చని నీరు

శీతాకాలంలో గోరువెచ్చని నీరు సురక్షితమైన, అత్యంత ప్రయోజనకరమైన ఎంపిక. ఇది శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా చేస్తుంది. మూత్రపిండాల నుంచి హానికరమైన వ్యర్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. చల్లని నీటితో పోలిస్తే.. గోరువెచ్చని నీరు జీర్ణక్రియకు కూడా మద్దతు ఇస్తుంది. రోజంతా శక్తిని అందిస్తుంది. మూత్రపిండాల పనితీరును రక్షించడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

Continues below advertisement

ఆహారపు అలవాట్లు

మూత్రపిండాల సంరక్షణలో కేవలం నీరు మాత్రమే సరిపోదు. ఆహారం కూడా అంతే ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక ఉప్పుతో కూడిన భోజనం మూత్రంలో కాల్షియం స్థాయిలను పెంచుతుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది కాబట్టి.. తాజా, తేలికపాటి భోజనం సిఫార్సు చేస్తున్నారు.

పాలకూర, బీట్‌రూట్, చాక్లెట్, టీ వంటి ఆక్సలేట్లు అధికంగా ఉండే ఆహారాలను మితంగా తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, పప్పులు, ఆరోగ్యకరమైన భోజనం తీసుకోవడం వల్ల కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

శారీరక శ్రమ 

చలికాలంలో ఏ పని చేయబుద్ధి కాదు. లేజీగా ఉంటాము. దీనివల్ల మూత్రపిండాలపై అదనపు ఒత్తిడి పెరుగుతుంది. చలికి భయపడుతుంటే.. ఇంట్లో తేలికపాటి వ్యాయామాలు చేయమంటున్నారు. లేదంటే జీవక్రియను నెమ్మదించి.. శరీరం హానికరమైన పదార్థాలను బయటకు పంపకుండా చేస్తుంది. కాబట్టి రోజువారీ నడకలు, తేలికపాటి స్ట్రెచింగ్ లేదా సాధారణ వ్యాయామాలు శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి. ఇవి మూత్రపిండాల పనితీరుకు మద్దతు ఇస్తాయి.

హెచ్చరిక సంకేతాలను విస్మరించవద్దు

మూత్రపిండాల సమస్యలను ఎప్పుడూ విస్మరించకూడదని సూచిస్తున్నారు వైద్యులు. ముఖ్యంగా శీతాకాలంలో కిడ్నీ సమస్యలు సైలెంట్గా పెరుగుతాయని.. ఆ సమయంలో వాటిని అస్సలు ఇగ్నోర్ చేయొద్దని అంటున్నారు. నడుము నొప్పి తరచుగా రావడం, మూత్రవిసర్జన సమయంలో మంట లేదా మూత్రంలో రక్తం వంటివి తీవ్రమైన లక్షణాలు ఉంటే వైద్య సహాయం వెంటనే తీసుకోవాలి. ఆలస్యం చేస్తే తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రారంభంలోనే గుర్తిస్తే చాలా ఈజీగా తగ్గించుకోగలుగుతారు.