Charger Plugged in Dangers : ఫోన్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత చాలామంది ఫోన్‌ను ఛార్జర్ నుంచి తీసేసి.. సాకెట్‌లను అలానే వదిలేస్తారు. స్విచ్ ఆఫ్ చేయకుండా సాకెట్ అలా ఉంచే అలవాటు మీకు కూడా ఉందా? అయితే జాగ్రత్త. ఎందుకంటే చాలామంది తొందరపాటులో ఛార్జర్ నుంచి ఫోన్ తీసి స్విచ్ కూడా ఆఫ్ చేయరు. మరికొందరు బద్ధకంతో అలానే సాకేట్ ఉంచేస్తారు. ఇలా చేయడం వల్ల ఏమీ కాదులే అని అనుకుంటారు. మీరు కూడా అలాగే అనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటు పడినట్లే. ఛార్జర్ సాకేట్ను ఉంచి స్విచ్ ఆన్‌లో ఉంచడం వల్ల చాలా నష్టాలు జరుగుతాయట. అవేంటో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం.
ఛార్జర్ స్విచ్ ఆఫ్ చేయడం ఎందుకు ముఖ్యం?
ఛార్జర్ సాకెట్‌లో ఉండి.. స్విచ్ ఆన్‌లో ఉన్నప్పుడు విద్యుత్ వినియోగిస్తుందని నిపుణులు అంటున్నారు. ఛార్జింగ్ కోసం ఫోన్ పెట్టినా లేదా పెట్టకున్నా పవర్ రన్ అవుతుందట. దీనివల్ల విద్యుత్తు వినియోగం వృధా అవుతుంది. దీనినే వాంపైర్ పవర్ లేదా ఫాంటమ్ లోడ్ అని కూడా అంటారు. ఈ అలవాటు విద్యుత్ బిల్లును పెంచడమే కాకుండా.. విద్యుత్ షాక్‌కు కూడా కారణమయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఎక్కువ పవర్ ఉన్న ఛార్జర్‌లను ఆన్‌లో ఉంచడం వల్ల కరెంట్ తగిలే ప్రమాదం ఉంది. ఛార్జర్‌లు లేదా ఇతర పరికరాలు నిరంతరం ప్లగ్ ఇన్ చేయడం వల్ల వేడెక్కుతాయి. దీనివల్ల వాటిలో షార్ట్ సర్క్యూట్ లేదా పేలుళ్లు జరుగుతాయి. కాబట్టి స్విచ్ ఆన్‌లో ఉంచే అలవాటును మార్చుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల మీరు కొద్దికొద్దిగా విద్యుత్తును ఆదా చేయగలుగుతారు. అలాగే ఖర్చు కూడా తగ్గుతుంది.
గుర్తించుకోవాల్సిన విషయాలివే
ఛార్జర్‌ను ఎక్కువ కాలం ఉపయోగిస్తుంటే.. మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చాలామంది మంచం లేదా సోఫాలో కూర్చుని కేబుల్‌ను లాగి ఛార్జర్‌ను తీయడానికి ప్రయత్నిస్తారు. ఇది అస్సలు మంచిది కాదు. అలాగే ఛార్జర్ ఒకేసారి లాగడం వల్ల కేబుల్ తెగిపోవచ్చు. కాబట్టి ఎప్పుడూ అడాప్టర్‌ను నెమ్మదిగా పట్టుకుని సాకెట్ నుంచి తీయాలి. ఛార్జర్‌ను ఎప్పుడూ తడి లేదా నీటి ఉపరితలంపై ఉంచకూడదు. ఛార్జర్ తడిస్తే వాటిని ఉపయోగించే ముందు బాగా ఆరబెట్టండి. రాత్రుళ్లు పడుకునే ముందు స్విచ్ ఆఫ్ చేయకుండా ఉంచేయడం లేదా ఫోన్ రాత్రంతా ఛార్జర్లో ఉంచడం మంచి పద్ధతి కాదు. దీనివల్ల ఫోన్ లైఫ్ టైమ్ తగ్గిపోతుంది. లేదా పేలుళ్లు వంటి ప్రమాదాలు జరగవచ్చు.