ప్రపంచంలో ఎన్ని వజ్రాలు ఉన్నా.. కోహినూర్ డైమండ్ కు ఉన్న విశిష్టత వేరు. ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రంగా గుర్తింపు పొందింది. ఈ వజ్రం తెలుగు నేల మీదే కనుగొనబడినా.. ప్రస్తుతం ఇంగ్లాండ్ మ్యూజియంలో కొలువుదీరింది. ఈ వజ్రాన్ని తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం ఎన్నిసార్లు బ్రిటన్ ను కోరినా సానుకూల స్పందన రాలేదు. నిజానికి ఈ వజ్రం తొలి రోజుల్లో 793 క్యారెట్లు ఉండగా ప్రస్తుతం 105.6 క్యారెట్లకు తగ్గిపోయిందట.  


తెలుగు నేలతో కోహినూర్ కు సంబంధం


కోహినూర్ వజ్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ వజ్రాన్ని సుమారు 5 వేల ఏళ్ల క్రితం తెలుగు నేల మీదే గుర్తించారని చెప్తుంటారు. 1813 సంవత్సరంలో కోహినూర్ వజ్రం సిక్కు రాజు మహారాజా రంజిత్ సింగ్ దగ్గరికి చేరిందట. ఆయన దాన్ని తన కిరీటంలో ధరించారట. 1839లో ఆయన మరణం తర్వాత.. కుమారుడు దిలీప్ సింగ్ దగ్గరికి ఆ వజ్రం వెళ్లింది. 1849లో బ్రిటన్ సేనలు అతడిని ఓడించాయట. ఆ సమయంలో అతడు ఆ వజ్రాన్ని ఇంగ్లాండ్ రాణికి అప్పగించారట. అప్పటి  నుంచి కోహినూర్ డైమండ్ బ్రిటన్ లోనే ఉంటోంది. వాస్తవానికి ఈ వజ్రం ఒకరి ఒకరు కానుకగా ఇవ్వడం తప్ప.. అమ్మడమో.. బలవంతంగా లాక్కోవడమో జరగలేదు. ఎవరూ కొనుగోలు చేయలేదు కూడా. ఈ నేపథ్యంలో కోహినూర్ వజ్రానికి శాశ్వత యజమానులు ఎవరూ లేరు.   


భారత చట్టాలు ఏం చెబుతున్నాయ్?


ఈ వజ్రం కోసం భారత ప్రభుత్వం కొన్ని సార్లు బ్రిటన్ ప్రభుత్వాన్ని  సంప్రదించినా.. పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఇదే అంశానికి సంబంధించి భారత అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు ఓసారి విచారణ జరిపింది. ఈ విచారణలో కోహినూర్ వజ్రం తిరిగి తీసుకురావడం కష్టమని తేలింది. యాంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజర్ యాక్ట్, 1972లోని నిబంధనల ప్రకారం దేశం నుంచి అక్రమంగా ఎగుమతి చేయబడిన పురాతన వస్తువులను మాత్రమే తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారత్ కు తెప్పించే అవకాశం లేదని రుజువైంది. భారత ప్రభుత్వం సైతం  పురాతన కోహినూర్ వజ్రాన్ని తమకు ఇచ్చేయాలని యునైటెడ్ కింగ్‌డమ్‌ను బలవంతం చేయలేమని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఎందుకంటే ఈ వజ్రం దొంగిలించబడలేదు. బ్రిటీష్ వారికి బహుమతిగా ఇవ్వబడింది.   


కోహినూర్ వజ్రంతో పాటు అనేక ఇతర అరుదైన వస్తువులను, సంపదలను తిరిగి ఇచ్చేలా బ్రిటన్ హైకమిషనర్‌ను ఆదేశించాలని కోరుతూ ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ ఫ్రంట్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) విచారించిన సుప్రీం కోర్టు విచారించింది. కోహినూర్‌ ను తిరిగి దేశానికి అప్పగించాలని దాఖలైన పిల్‌ పై తన వైఖరిని స్పష్టం చేయాలని సుప్రీంకోర్టు నాటి చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ ధర్మాసం ప్రభుత్వాన్ని కోరింది. అయితే, ఇది సాధ్యం అయ్యే విషయం కాదని ప్రభుత్వం వెల్లడించింది.


కోహినూర్ ను ఇస్తే బ్రిటీష్ మ్యూజియం ఖాళీ అవుతుంది


అటు ఇంగ్లాండ్ రాణుల కిరీటంలో పలుమార్లు క్రౌన్ జ్వెల్ రూపంలో స్థానాన్ని సంపాదించుకున్న కోహినూర్ డైమండ్.. ఆ తర్వాత బ్రిటన్ మ్యూజియానికి తరలించబడింది. పలుమార్లు ఈ వజ్రాన్ని తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం ఇంగ్లాండు ప్రభుత్వాన్ని కోరింది. 2010 లో యూకే ప్రధాని డేవిడ్ కెమరాన్ ఈ విషయంపై స్పందించారు. ఒకవేళ భారత్‌‌కు కోహినూర్ తిరిగి ఇవ్వాల్సి వస్తే, చాలా దేశాలకు చాలా తిరిగివ్వాల్సి ఉంటుందన్నారు. అప్పుడు బ్రిటీష్ మ్యూజియం మొత్తం ఖాళీ అయిపోతుందని చమత్కరించారు. ఇదండి కోహినూరు వెనుక ఉన్న కథ. అందుకే, మనం దాన్ని వెనక్కి తెచ్చుకోలేకపోతున్నాం. 


Also Read: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 ఆరోగ్య రహస్యం ఇదే, మీరూ ప్రయత్నించండి


Also Read: గుండెను కాపాడుకోవాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు? ఈ పంచ సూత్రాలను తప్పక పాటించాలి