Can You Be A Good Man But A Bad Husband: "మంచి మగవాళ్లు భూమ్మీద చాలా అరుదు" ఈ మాట చదివి మగజాతి మొత్తం ఉక్రోశ పడక్కర్లేదుగానీ, ప్రేమించటానికో, పెళ్లి కొడుకును వెతికే సమయంలోనో ఈ మాట ఎక్కువగా వినపడుతుంది. అయితే మంచి మగవాళ్లు అనిపించుకునేవాళ్లలో ఎక్కువ మంది మంచి భర్తలు కాలేరట! అదేంటని ఆశ్చర్యపోతున్నారా? అలా అని టాక్సిక్, అబ్యూసివ్ పురుషులను పార్ట్నర్ గా ఎంచుకోమని చెప్పట్లేదు. మంచి వారుగా ఉండటానికి తాపత్రయపడే కొందరు మగవాళ్లు మంచి భర్తలుగా ఉండలేకపోతున్నారు అంటున్నాయి కొన్ని రీసెర్చ్ లు. దానికి బలమైన కారణాలు వేరే ఉన్నాయి. అవేంటో మీరే చదవండి.

Continues below advertisement

ప్రతిసారీ మీకు హెల్ప్ చేయాలనుకుంటారు

" మొత్తం మీరే చేసారు!" ఈ మాటతో మీకు అర్థమయిపోయుండాలి. పార్ట్నర్ నుంచి కొంత హెల్ప్ వస్తే బాగుంటుంది అనిపించటం సహజమే కానీ, ప్రతిదీ బొమ్మరిల్లులో ప్రకాష్ రాజ్ లా అన్ని భుజాల మీద వేసుకొని చేసేస్తుంటే మీకు సిద్ధార్థ్ లా ఆత్మన్యూనత కలుగుతుంది. కొన్నిసార్లు మీ కాళ్ల మీద మీరు నిలబడాలనుకుంటారు. అప్పుడు కూడా మీ పార్ట్నర్ వచ్చి అన్ని పనులు పూర్తి చేసేస్తే, మీ స్టామినా మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు.

ఎప్పుడూ పరోపకారమే చేయాలనుకుంటారు

మనుషులకు సహాయం చేయటం మంచి విషయమే. అది ఈ కాలంలో అరుదైన గొప్ప లక్షణం. అయితే, ఎప్పుడూ బయటి వారికోసమే సమయం, ఎనర్జీ కేటాయించే భర్తలకు వారి పార్ట్నర్ గురించి ఆలోచించే తీరిక ఉండదు. అందుకని బయటివారికి మహానుభావుళ్లా కనిపించే భర్తలకు కూడా భార్య నుంచి "పట్టించుకోరు, సమయం ఇవ్వరు..నెగ్లెక్ట్ చేస్తార"నే కంప్లైంట్స్ ఉంటాయి.

Continues below advertisement

మీరు సంతోషంగా ఉండటం వారికి "అవసరం"

మీ సంతోషాన్ని కోరుకోవటం పార్ట్నర్ కనీస లక్షణం కానీ, మీరు సంతోషంగా ఉండటం అవసరం అని భావించేవారు మంచి మగవాళ్లు. ఇక్కడున్న సమస్యేమిటంటే.. మీ ఆనందాన్ని, బాధను వారి కోణంలోనే ఆలోచిస్తారు. మీ కష్టానికి కారణం వారే అని ఊహించుకుంటారు. మీ కష్టమైనా, సుఖమైనా ఈ మ్యారేజ్ వల్లనే అని వారు భావిస్తారు. అయితే, ప్రతి ఫేజ్ లోనూ సంతోషంగా ఉండటం ఎవరి వల్లా కాదు. అలా మీకు ఏ కారణం వల్ల బాధ వచ్చినా వారి వైపు నుంచి సూపర్ హీరోలా తీర్చాలనుకోవటం మీ భుజాల మీద మోయలేని ఎమోషనల్ బరువు.

ఎట్టి పరిస్థితిలో గొడవలు రావొద్దనుకుంటారు

గొడవలు పడటం ఎవరికీ ఇష్టమవదు కానీ, భార్యాభర్తల మధ్య చిన్ని చిన్ని గొడవలు బంధాన్ని బలపరుస్తాయి. మంచి మగవాళ్లు గొడవలు రాకుండా ఉండటానికి చాలా విషయాలు దాచిపెడుతారు. ఇందువల్ల ఎన్నో విషయాలు గుర్తించకుండా ఉండిపోయి, ఒకానొక సందర్భంలో బంధానికి అవే అడ్డంకులుగా మారుతాయి. మీరెపుడయినా ఆర్గ్యూ చేసినా, "నువ్వు సంతోషంగా లేవు కదా? నా వల్ల కష్టంగా ఉందా?" లాంటి అసందర్భ ప్రశ్నలు సంధిస్తారు.

వాళ్ళకేమి కావాలో బయటకి చెప్పలేరు

వారి సొంత అవసరాలను, ఇష్టాలను బయటపెడితే అది అవతల వారికి శ్రమ అవుతుందని మంచి మగవాళ్లు భయపడుతారు. అందరి సంతోషం గురించి ఆలోచించేవారు..వారి సొంత ఆనందాన్ని నెగ్లెక్ట్ చేసి ఫీలింగ్స్ ని లోపలే దాచి ఉంచుకుంటారు. ఇది వారి ఆరోగ్యానికే కాదు. మ్యారేజ్ లైఫ్ కి కూడా నష్టమే.