Causes of Breast Cancer: మారుతున్న జీవనశైలితో మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్లలో ఈ రొమ్ము క్యాన్సర్ ఒకటి. ఇది వారసత్వంగా వచ్చే ఛాన్స్ కూడా ఉంది. 


మహిళల్లో రొమ్ము క్యాన్సర్ అత్యంత సాధారణ క్యాన్సర్‌గా మారింది. ప్రతి 28 మంది మహిళల్లో ఒకరు రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. రొమ్ము క్యాన్సర్ అనేది కొన్ని జన్యువులలో మార్పుల కారణంగా ఏర్పడుతుంది. రొమ్ము కణాలు విభజనకు గురై.. అనియంత్రితంగా వ్యాప్తి చెందుతాయి. అవి గడ్డల్లా ఏర్పడి క్యాన్సర్‌ కణాలుగా రూపాంతరం చెందుతాయి.


గత కొన్నేళ్లుగా వివిధ రకాల క్యాన్సర్లు ఏర్పడుతున్నాయి. కానీ మహిళల్లో మాత్రం బ్రెస్ట్ క్యాన్సర్ మొదటి స్థానంలో ఉంది. సాధారణంగా, మహిళలు దాని లక్షణాలను సమయానికి గుర్తించకపోవడం, చికిత్సలో ఆలస్యం వల్ల ఇది తీవ్రమైన సమస్యగా మారుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ పెరుగుదలకు ప్రధాన కారణం జీవనశైలి అని చెబుతున్నారు. అసలు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ పెరిగేందుకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ఎందుకు పెరుగుతోంది?


ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇతర క్యాన్సర్ల తరహాలోనే రొమ్ము క్యాన్సర్ పెరుగుదలకు కారణం ఎక్కువగా జీవనశైలి. మొదటి, ప్రధాన కారణం శారీరక వ్యాయామం లేకపోవడం. ఇవేకాదు ఎక్కువగా కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య పెరుగుతోంది. హార్మోన్ల అసమతుల్యత ఒక కారణమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల రొమ్ము క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. చెడు ఆహారపు అలవాట్ల వల్ల కూడా హార్మోన్లకు ఆటంకం కలుగుతుందని, కాబట్టి మహిళలు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.


రొమ్ము క్యాన్సర్‌ను ఎలా గుర్తించాలి?


రొమ్ము క్యాన్సర్ లక్షణాలను సకాలంలో గుర్తించినట్లయితే, సరైన చికిత్స తీసుకోవడం ద్వారా దీనిని నివారించవచ్చు. దాని మొదటి లక్షణం రొమ్ము మందంగా మారడటం.  30 ఏళ్లు పైబడిన మహిళలు తమ రొమ్ము ప్రాంతంలో ఏదైనా గడ్డ ఏర్పడినట్లు.. లేదంటే రొమ్ములో మార్పులు కనిపించినట్లయితే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. రొమ్ము భాగంలో ఏర్పడిన కురుపులు లేదా గడ్డగా ఉన్న ప్రాంతంలో నొప్పి ఉన్నట్లయితే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇది కాకుండా, చనుమొనల నుంచి రక్తస్రావం, చర్మం బరువుగా ఉండటం కూడా రొమ్ము క్యాన్సర్ లక్షణం కావచ్చు. 


చికిత్స ఏమిటి?


ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, రొమ్ము క్యాన్సర్ చికిత్స అది ఏ దశలో ఉంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అటువంటి సందర్భాలలో, శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, టార్గెటెడ్ డ్రగ్ థెరపీ, హార్మోనల్ థెరపీ చికిత్స కోసం ఉపయోగిస్తారు. ప్రారంభ దశలో, ఆపరేషన్‌లో మొత్తం రొమ్మును తొలగించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. తర్వాత దశలో, మొత్తం రొమ్మును తొలగించాల్సి వచ్చినప్పటికీ, ప్లాస్టిక్ సర్జరీ ద్వారా దాన్ని పునర్నిర్మించవచ్చని వైద్యులు చెబుతున్నారు.  


అన్ని గడ్డలు కూడా క్యాన్సర్ కాదు:


మహిళ రొమ్ములో కనిపించే గడ్డలన్నీ క్యాన్సర్ కాదనే విషయం గుర్తించాలి. చాలా మంది ఆసుపత్రికి అనుమానంతో వెళ్తుంటారు. వాళ్లలో ఒక్కరిద్దరికి మాత్రమే ఈ లక్షణాలు కనిపిస్తాయి. గడ్డలు కనిపిస్తే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. పెద్దల్లో రొమ్ము క్యాన్సర్.. ఆ తర్వాతి తరాల పిల్లలకు కూడా సంక్రమించే అవకాశాలు 10 శాతం వరకు ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.


Also Read : ఒక్క ఏడాదిలో ఇడ్లీ కోసం 6 లక్షలు ఖర్చు పెట్టిన హైదరాబాదీ.. బిర్యానీలో కూడా మనమే టాప్












గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.