నోటి ఆరోగ్య సంరక్షణ అనేది దినచర్యలో చాలా ముఖ్యమైన భాగం. రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవడం, ఫ్లాసింగ్ చెయ్యడం ద్వారా నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దంతాల ఆరోగ్యంగా లేకపోతే గుండెజబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్ కు కూడా కారణం కావచ్చు. అయితే, మీ శరీరంలో ఏమైనా సమస్యలుంటే.. మీ దంతాలు ముందుగానే మిమ్మల్ని హెచ్చరిస్తాయి. ఆ సంకేతాలను చాలామంది పట్టించుకోరు. అల్సర్లు, నోటి దుర్వాసనలను నిర్లక్ష్యం చేస్తుంటారు. మరి ఎలాంటి నోటి సమస్యలు.. ఏయే వ్యాధులను సూచిస్తాయో చూద్దామా.
చిగుళ్ల నుంచి రక్తం రావడం
బ్రష్షింగ్ సమయంలో లేదా ఫ్లాసింగ్ సమయంలో చిగుళ్ల నుంచి రక్త స్రావం జరుగుతుంది. ఇది చిగుళ్లకు సంబంధించిన అనారోగ్యానికి సంకేతం. తరచుగా గమ్ లైన్ ప్లేక్ ఏర్పడడం వల్ల ఇలా జరుగుతుంది. ఈ ప్లేక్ వల్ల చిగుళ్లలో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఈ చిగుళ్ల సమస్యను జింజివైటిస్ అంటారు. ఇది సాధారణమే కానీ నిర్లక్ష్యం చెయ్యకూడదు.
జింజివైటిస్ ను నిర్లక్ష్యం చేస్తే.. అది నోటి దుర్వాసన, దంతాలు రాలిపోవడం నుంచి కార్డియోవాస్క్యూలార్ సమస్యలు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వరకు రకరకాల అనారోగ్యాలతో ముడిపడి ఉండే సమస్య. చిగుళ్లలో రక్తస్రావం కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. దంతాల మీద చేరిన ప్లేక్, టార్టార్ తొలగించేందుకు నిపుణుల చేత డెంటల్ క్లీనింగ్ తో పాటు సరైన నోటి శుభ్రత పాటించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
నోటి దుర్వాసన ప్రమాదకరం
నోటి దుర్వాసన సాధారణమైనదే. అయితే నోటిని శుభ్రం చేసుకుంటే పోతుంది. కానీ దుర్వాసన దీర్ఘకాలికంగా వేధిస్తుంటే అది హాలిలోసిస్, చిగుళ్ల వ్యాధి, లేదా దంతక్షయం వంటి సమస్యల వల్ల కావచ్చు. అయితే ఒక్కోసారి డయాబెటిస్ లేదా జీర్ణాశయాంతర సమస్యల వంటి అంతర్లీన అనారోగ్యాల వల్ల కావచ్చు. డయాబెటిస్ వల్ల వచ్చే నోటి దుర్వాసన కుళ్లిన ఆపిల్ పండులా ఉంటుంది. తరచుగా చేసుకునే దంత పరీక్షలతో శరీరంలో అనారోగ్య సమస్యలను తెలుసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. రోజూ రెండు సార్లు తప్పక బ్రష్ చెయ్యడం, ఫ్లాసింగ్ చెయ్యడం నోటిని శుభ్రంగా ఉంచుతుంది. నోటి దుర్వాసన కిడ్నీ, లివర్ సమస్యలతో పాటు ఆసిడ్ రిఫ్లక్స్ వల్ల కూడా రావచ్చు.
నోటిలో అల్సర్లు
నోటిలో అల్సర్లు రావడం సాధారణమైన విషయమే. వెంటనే ఉపశమనం దొరకడం కోసం అప్పటికప్పుడు చేసే చికిత్సలు అవసరమవుతాయి. నోటి అల్సర్లు రెండు వారాలకు మించి వేధిస్తుంటే మాత్రం తప్పకుండా డాక్టర్ ను సంప్రదించాలి. రెండు వారాలకు మించి తగ్గని నోటి పూతలు క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలకు సంకేతం. తెల్లగా లేదా ఎర్రగా కనిపిస్తున్న నోటి అల్సర్, దవడ కదలికల్లో ఇబ్బంది వంటి సంకేతాలు ఉంటే తప్పకుండా డెంటిస్ట్ ను సంప్రదించాలి.
ఇవి మాత్రమే కాదు మింగడంలో ఇబ్బంది ఏర్పడడం, తరచుగా ఎటువంటి కారణం లేకుండా స్వరం బొంగురుపోవడం, తరచుగా శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్లు రావడం ఇవ్వన్నీ కూడా తీవ్రమైన అనారోగ్యాలకు సూచనలని మరచి పోవద్దు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.