మనం ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటామనే సంగతి తెలిసిందే. లేకపోతే అనారోగ్య సమస్యలను ఎదుర్కోక తప్పదు. మనం ధరించే దుస్తుల నుంచి ఇంట్లోని వస్తువుల వరకు ప్రతి ఒక్కటీ శుభ్రంగా ఉండాల్సిందే. అయితే, కొన్ని విషయాల్లో మనం చాలా అజాగ్రత్తగా ఉంటాం. ముఖ్యంగా ఇంటి డోర్ కర్టెన్లు, పరుపులు, సోఫాలు, తలగడలను శుభ్రం చేసే విషయంలో చాలా అజాగ్రత్తగా ఉంటాం. మనం తలగడ(పిల్లో) కవర్లను మారుస్తాం. కానీ తలగడలను మాత్రం ఏళ్ల తరబడి ఉపయోగిస్తూనే ఉంటాం. అయితే.. ఇది చాలా ప్రమాదకరమని మీకు తెలుసా? తలగడలు మీ అనారోగ్యానికి కారణమవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అదెలాగో చూడండి.
బ్యాక్టీరియాకు కేంద్రాలు: యూకేకు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ వైద్యుడు డాక్టర్ కరణ్ రాజ్ చెప్పిన వివరాల ప్రకారం.. ఇంట్లో తలగడ కవర్లు మార్చితే సరిపోదని, తలగడ లేదా దిండును కూడా మార్చాలని తెలిపారు. తలగడలను కనీసం రెండేళ్లకు ఒకసారైన మార్చాలన్నారు. తలగడలో బోలెడంత బ్యాక్టీరియా వచ్చి చేరుతుందని తెలిపారు. ముఖ్యంగా తలగడలు ఇంట్లోని దుమ్ము, దూళిని పీల్చుకుంటాయని వాటిని పీల్చితే మనం కూడా అనారోగ్యానికి గురవ్వుతామని తెలిపారు.
మన చెమట, చర్మమే ఆహారం: మనకు పట్టే చెమట కూడా తలగడకే అంటుకుంటుంది. దాని వల్ల తలగడలో పురుగులు కూడా పెరుగుతాయట. ఒక వ్యక్తి ఏడాదికి కనీసం 4 కిలోల చర్మాన్ని తలగడ మీద వదులుతాడట. అది క్రమేనా తలగడలోకి చేరి పురుగులకు ఆహారంగా మారుతుందట. అంటే.. ఒక రకంగా మనమే పిల్లోలోని బ్యాక్టీరియాను పోషిస్తున్నామన్న మాట.
బ్యాక్టీరియా విసర్జనలపై నిద్ర: తలగడలో ఉండే ఒక దూళికి పురుగు (కంటికి కనిపించనంత సూక్ష్మంగా ఉంటాయి).. రోజుకు దాదాపు 200 సార్లు విసర్జిస్తాయట. అంటే ఏడాదిలో వాటి విసర్జనలు తలగడలో ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. కాలం పెరిగే కొద్ది.. బ్యాక్టీరియాల విసర్జనతో తలగడలు నిండిపోతాయి. అంతేకాదు.. మన దేశంలో తలకు నూనె పెట్టి నిద్రపోయేవారు చాలామంది ఉంటారు. ఆ నూనె అంత తలగడకే అంటుకుంటుందనే సంగతి తెలిసిందే. వాటి వల్ల తలగడపై పడే అచ్చుల్లో కూడా బ్యాక్టీరియా పెరుగుతుందని డాక్టర్ కరణ్ రాజ్ తెలిపారు. చూశారుగా.. మన తలగడలు ఎంత ప్రమాదకరమైనవో. ఇకనైనా మీ తలగడలను బాగా ఉతికి ఆరేయండి. లేదా కనీసం రెండేళ్లకు ఒకసారైన మార్చి కొత్తవి ఉపయోగించండి. లేకపోతే బ్యాక్టీరియాల విసర్జనాలపై నిద్రిస్తున్నట్లే.
హాస్టళ్లలో మరీ దారుణం: ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో పరిశోధకులు 50 మంది కళాశాల హాస్టల్ విద్యార్థుల దిండ్లు, పరుపులను పరిశీలించింది. ఈ సందర్భంగా దిండులో 350,000 కంటే ఎక్కువ బ్యాక్టీరియా కాలనీలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో కొన్ని విషపూరితమైనవి, ప్రాణాంతకమైనవి ఉన్నట్లు తెలుసుకున్నారు. కేవలం తలగడ ఉపరితలంపైనే 100,000 కంటే ఎక్కువ బ్యాక్టీరియా కాలనీలు ఉన్నట్లు గుర్తించారు. అధ్యయనంలో పాల్గొన్న విద్యార్థుల్లో 40 శాతం మంది దిండ్లు, వాటి కవర్లు అస్సలు ఉతకడం లేదని చెప్పారు. మిగతావారు.. హాస్టళ్లలో ఉండటం వల్ల ఒకరి దిండ్లు మరొకరికి మారుతూ ఉంటాయని తెలిపారట. విద్యార్థులు తెలిపిన రెండో విషయం మరింత ప్రమాదకరమని పరిశోధకులు తెలిపారు. కాబట్టి దిండు మురికిని వదిలించడం తప్పనిసరి అని పేర్కొన్నారు.
ఈ విషయాలు గుర్తుంచుకోండి:
☀ ఒకరు ఉపయోగించే దిండు లేదా తలగడను మరొకరు అస్సలు ఉపయోగించకూడదు.
☀ మీరు ఒకే తలగడను రెండేళ్లు కంటే ఎక్కువ రోజులు ఉపయోగిస్తున్నట్లయితే తప్పకుండా మార్చాలి. లేదా శుభ్రం చేయాలి.
☀ తలగడను నోటిలో పెట్టుకోవడం, దానికి ముక్కు ఆన్చి గట్టిగా గాలి పీల్చడం వంటివి చేయకూడదు.
☀ డ్రైక్లినింగ్ అందుబాటులో లేకపోతే వాషర్ లేదా డ్ర్రైయర్‌లో పెట్టి దిండ్లను శుభ్రం చేయొచ్చు.
☀ దిండ్లు ఒక రోజు డిటర్జంట్లో బాగా నానబెట్టిన తర్వాతే ఉతకాలి.
☀ దిండ్లపై ఆహారం పెట్టుకుని తినవద్దు.
☀ తలగడలు దులిపేప్పుడు వచ్చే దుమ్ము కళ్లలో పడకుండా జాగ్రత్తపడాలి.
☀ పిల్లల దిండ్లను వారానికి ఒకసారైనా ఉతకాలి.
☀ బంధువులు లేదా ఇతరులు ఉపయోగించే దిండ్లను ఉతికిన తర్వాతే వాడాలి.
☀ తలగడలకు నూనె అంటకూడదు. ఒక వేళ నూనె మరకలు ఉంటే వెంటనే శుభ్రం చేసుకోవాలి.
☀ దుప్పట్లు, తలగడలు ఎండలో ఆరబెట్టడం మంచిది.
Read Also: గర్భం రాకపోయినా... గర్భం ధరించినట్టు అనిపించే లక్షణాలు, నమ్మి మోసపోకండి
Read Also: చేపల్లో మాత్రమే కాదు, వీటిలో కూడా ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు... శాకాహారులకు ప్రత్యేకం
Read Also: ఒత్తిడి, ఆందోళన వేధిస్తున్నాయా? ప్రశాంతంగా లేదా? ఈ టీలను ప్రయత్నించండి
Read Also: వంటల్లో ఈ మూడు మసాలాలు కచ్చితంగా వాడండి, క్యాన్సర్ రిస్క్‌ను సగం తగ్గించుకోండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి