గెలీలియో గెలీలి చెప్పిన దాన్ని బట్టి విశ్వాన్ని వివరించే భాష గణితం. గణిత సమీకరణాల ద్వారా సృష్టి రహస్యాలను పరిష్కరించడం సాధ్యమవుతుందని ఆయన ప్రతిపాదనలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాలకు చెందిన ఆధ్యాత్మికవేత్తలు సంఖ్యల్లో నే శాస్త్రం దాగుందని అంటుంటారు. యోగులు 108 సంఖ్య ఈ పూర్తి సృష్టి రహస్యానికి కీ వంటిదని బోధిస్తారు.
యోగాలో 108 సంఖ్య ఆధ్యాత్మిక సంపూర్ణతకు సంకేతం వంటిది. అందుకే జపమాలలు 108 పూసలతో ఉంటాయి. మేరు పూసను చేరిన తర్వాత తిరిగి వెనుకకు జపమాలను తిప్పుతూ జపం చెయ్యాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రాణాయామాలు కూడా 108 సైకిల్స్ చెయ్యాల్సిందిగా సూచిస్తారు యోగా గురువులు. సూర్య నమస్కారాలు కూడా మొత్తం పన్నేండు యోగాసనాలు తొమ్మిది సైకిళ్లుగా చెయ్యాల్సి ఉంటుంది. 12 ను 9తో గణించినపుడు 108 అవుతుంది. ఈ పవిత్ర సంఖ్యతో మనలోని రిథమ్ ను అనుసంధానం చెయ్యడాన్ని సృష్టితో అనుసంధానం చేసినట్లుగా విశ్వసిస్తారు.
హిందువులకు పవిత్రం
అనేక పవిత్ర విషయాలు ఈ 108 సంఖ్యలో ఉంటాయి. హిందువులంతా పవిత్రంగా కొలుచుకునే నది గంగా నది కొలతలు కూడా 108. గంగా నది అక్షాంశం 9 అయితే రేఖాంశం 12. ఈ రెండు సంఖ్యలను గుణించినపుడు వచ్చేది 108. మన దేశంలో 108 పవత్ర స్థలాలు ఉన్నాయి. వీటినే అష్టాదశ పీఠాలు అంటారు. ఉపనిషత్తులు 108, వాటిలో మర్మాలు 108. సంస్కృతంలోనూ 54 అక్షరాలు ఉంటాయి. వీటికి స్త్రీ పురుష రూపాలుంటాయి. వీటి మొత్తం కూడా 108 ఏ అవుతుంది.
జ్యోతిషంలోనూ..
జ్యోతిష శాస్త్రంలో నక్షత్రాలు అత్యంత ముఖ్యమైనవి. మొత్తం నక్షత్రాలు 27, ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు. మొత్తం నక్షత్ర పాదాలన్నీ కూడా 108 యే ఉంటాయి. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు ఈ 108 పాదాల్లో ఒక దానికి చెంది ఉంటారు. అలాగే రాశి చక్రంలో రాశులు 12, గ్రహాల 9 ఈ రెండింటి గుణకారం కూడా 108.
ఖగోళ శాస్త్రంలోనూ..
సూర్యుడికి మధ్య దూరం సూర్యుని వ్యాసానికి 108 రెట్లు ఉంటుందని మన ప్రాచీన ఖగోళ శాస్త్రం లెక్క కట్టింది. సూర్యుని వ్యాసం భూమి వ్యాసంతో పోలిస్తే 108 రెట్లు ఎక్కువ. ఇంకా చంద్రుని వ్యాసం భూమి కంటే 108 రెట్లు తక్కువ.
ఇతర మతాల్లోనూ..
జైన మతంలో కర్మ ప్రవాహ సంఖ్య ను 108 గా చెబుతారు. బౌద్ధంలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ గంటను 108 సార్లు మోగిస్తారు. బౌద్ధ ధమ్మంలో మనిషిగా పుట్టిన వాడు 108 ప్రలోభాలను దాటుకుని పుణ్యలోకాలను చేరాల్సి ఉంటుందని చెప్పబడింది. 108 ముడులు వేసిన ఉన్ని దారాన్ని పవిత్రమైందిగా సిక్కులు భావిస్తారు. చైనీస్ జ్యోతిషశాస్త్రంలో 108 నక్షత్రాలు ఉన్నాయి. వాటిలో 72 హానికరమైనవి అయితే, మిగిలిన 36 ప్రయోజనకరమైనవి. టిబెటన్ ఇతిహాసాల్లో 108 మంది మాస్టర్స్, దీక్షాపరులు కూడా 108. క్రైస్తవుల సెలవు దినాలు నవంబర్ 2 నుంచి డిసెంబర్ 25 వరకు 54 పగళ్లు, 54 రాత్రులు. ఈ రెండు తేదీల మధ్య కాలంలో చీకటి వెలుగుగా 108 సార్లు పరివర్తన చెందిందని భావిస్తారు.
Also Read: వైవాహిక జీవితం - లైంగిక సంబంధాలు.. చాణక్యుడు చెప్పిన ఆసక్తికర అంశాలు