Litchy: ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా లిచీపండ్లు అధికంగా కనిపిస్తున్నాయి. ఎర్రని తొక్కతో లోపల తెల్లని జెల్లీ లాంటి గుజ్జుతో కనిపించే లిచీ పండ్లకు అభిమానులు ఎక్కువ. ఇది ఒక ఉష్ణ మండల పండు అంటే కేవలం వేసవిలోనే దొరికే పండ్లు ఇవి. వీటిని చూడగానే నోరూరుతుంది. అందుకే ఎక్కువమంది వీటిని తినడానికి ఇష్టపడతారు. ఈ పండ్లలో పోషకాలు కూడా ఎక్కువ. తినడం వల్ల శరీరానికి అధిక లాభాలు వస్తాయి. అయితే వీటిని మితంగానే తినాలి. అధికంగా తింటే మాత్రం ఎన్నో ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం. ఒక్కోసారి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వస్తుంది. అందుకే లిచీ పండ్లను రోజుకి రెండు నుంచి మూడు కన్నా ఎక్కువ తినకపోవడమే ఉత్తమం.
లిచీ పండ్లు సహజంగానే తీపి చక్కెరను కలిగి ఉంటాయి. వీటిని అధికంగా తినడం వల్ల ఊబకాయం వారిన త్వరగా పడతారు. అలాగే దంత క్షయం కూడా రావచ్చు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉండాలి. లేకుంటే పరిస్థితులు చేజారే అవకాశం ఉంది. రక్తపోటును తగ్గించడానికి కూడా లిచీ పండ్లు చక్కగా పనిచేస్తాయి. అయితే అధిక రక్తపోటు ఉన్నారు ఉన్నవారు రోజుకు రెండు మూడు లిచీ పండ్లను తినడం వల్ల ఉపయోగం ఉంటుంది. కానీ అధికంగా తింటే మాత్రం రక్తపోటు చాలా తగ్గిపోతుంది. దీనివల్ల నీరసం, మూర్ఛ, అలసట వంటివి వస్తాయి. రక్తపోటు పడిపోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ పండ్లను అధిక మోతాదులో తినడం వల్ల అనేక అలర్జీలు కలిగే అవకాశం ఉంది. దురద, వాపు, ఎరుపుగా మారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడం వంటివన్నీ కూడా లిచీపండ్ల వల్ల కలుగుతాయి. ఈ పండ్లు అధికంగా తింటే జ్వరం రావచ్చు. అంతేకాదు అంతర్గత రక్తస్రావానికి కూడా కారణం కావచ్చు. ముఖ్యంగా గర్భిణులు, గర్భం ధరించేందుకు ప్రయత్నిస్తున్న వారు ఈ పండ్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ పండ్లు ఇన్ఫెక్షన్లను కలిగించే అవకాశం ఉంది. అంతర్గత రక్తస్రావానికి కారణమై పుట్టబోయే బిడ్డకు హాని చేసే అవకాశం ఉంది. కాబట్టి లిచీ పండ్లను ఆచితూచి తినాలి.
మితంగా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పండ్లు మన చర్మానికి, జుట్టుకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తాయి. ముఖంపై వచ్చే మచ్చలు, గీతలు, ముడతలు వంటి వాటిని తొలగిస్తాయి. హానికరమైన UV కిరణాల నుండి మన చర్మానికి రక్షణ కల్పిస్తాయి. జుట్టు పెరుగుదలకు సహకరిస్తాయి. జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. తలలో రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చేస్తాయి. ఈ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పండ్లలో ఉన్న విటమిన్ సి, కొవ్వును విచ్ఛిన్నం చేయడానికి సహకరిస్తుంది. దీనివల్ల మనకు తక్షణ శక్తి అందుతుంది. తినడం వల్ల శరీరంలో రక్తప్రసరణ సవ్యంగా జరుగుతుంది. వీటిలో ఉండే రాగి ఖనిజం ఎర్ర రక్త కణాల నిర్మాణంలో సహకరిస్తుంది. లిచీలో రుటీన్ అనే బయోఫ్లేవనాయిడ్ ఉంటుంది. ఇది రక్తనాళాలను కాపాడుతుంది. రక్తనాళాల్లో చీలిక రాకుండా సహకరిస్తుంది. పొటాషియం, సోడియం దీనిలో ఉంటాయి. ఈ రెండు సమంగా ఉంటాయి. కాబట్టి శరీరంలో అధిక రక్తపోటును నిర్వహించడానికి ఇవి అవసరం. ఈ పండ్లలో యాంటీ వైరల్ ప్రాపర్టీ, యాంటీ క్యాన్సర్ లక్షణాలు అధికంగా ఉంటాయి. వాటి నుంచి సహజంగానే రక్షణ కల్పిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఇవి ముందుంటాయి. ఎముకలకు, గుండెకు ఆరోగ్యాన్ని అందిస్తాయి. అయితే ఈ పండును కేవలం మితంగా తింటే మాత్రమే ఆరోగ్యం సిద్ధిస్తుంది. అమితంగా తింటే మాత్రం అనారోగ్యం పాడిన త్వరగా పడతారు.
Also read: మానసిక ఆందోళనను తగ్గించే కుంకుమ పువ్వు, తరచూ తింటే ఇంకెన్నో లాభాలు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.