ఐర్లాండ్‌లో నివసిస్తోంది జానిస్ వాల్ష్. ఆమె ఉద్యోగం కోసం వెతుకుతోంది. అదే సమయంలో డోమినోస్ సంస్థ డ్రైవర్ల కోసం వెతుకుతున్నట్టు ప్రకటన చూసింది. దరఖాస్తు చేస్తే ఇంటర్య్వూకు పిలిచారు. ఆ ఇంటర్వ్యూలో ఆమెకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఇంటర్య్వూ ప్రారంభంలోనే ఆమె వయసును అడిగారు అక్కడి అధికారులు. ఆమె తన వయసును చెప్పాక, ‘మీరు అలా కనిపించడం లేదే’ అంటూ కామెంట్ చేశారు. అలాగే ఆమె వయసు చెప్పగానే ఇంటర్య్వూ చేసిన వ్యక్తి దాన్ని నోట్ చేసుకోవడం కూడా గమనించింది. అలాగే తన వయసు నెంబర్‌ను రాసి దాని చుట్టూ రౌండ్ చేయడం కూడా చూసింది. తరువాత తాను ఆ ఉద్యోగానికి ఎంపిక కాలేదని తెలుసుకుంది. మళ్లీ డోమినోస్ అదే ఉద్యోగానికి అభ్యర్థులు కావాలంటూ ప్రకటన ఇవ్వడం చూసింది.
వయసే కారణం
ఆమెకు కొన్ని సందేహాలు వచ్చాయి. ఆ ఉద్యోగానికి తాను ఎంపిక కాకపోవడానికి తన వయసు, తాను స్త్రీ కావడమే కారణమని అర్థం చేసుకుంది. ఎందుకంటే డ్రైవర్లుగా ఎక్కువగా మగవారే పనిచేస్తారు. అందుకే తాను ఎంపిక కాలేదని అర్థం చేసుకుంది. అలాగే అదే ఉద్యోగం చేస్తున్న వేరే వ్యక్తిని సంప్రదించగా ఆ ఉద్యోగం కేవలం 18 నుంచి 30 ఏళ్ల లోపు వారికేనని తెలుసుకుంది. వెంటనే డోమినోస్ అధికారులను ఫేస్ బుక్ ద్వారా సంప్రదించింది. తన వయసును అడిగి అవమానించారని పేర్కొంది. దానికి ఇంటర్య్వూ ప్యానెల్ సభ్యులు అలా అడగడం తప్పని మాకు తెలియదంటూ సమాధానం ఇచ్చాడు.
ఉద్యోగానికి ఎంపిక్ చేయడంలో తన వయసును, స్త్రీత్వాన్ని చూసే వివాక్ష చూపించారని అర్థం చేసుకుంది. ధైర్యంగా ఆమె కంపెనీపై న్యాయపోరాటానికి దిగింది. లింగం ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేయకపోవడం తప్పని కోర్టు తీర్పునిచ్చింది. అంతేకాదు ఆమెకు నాలుగు వేల పౌండ్లు పరిహారంగా ఇవ్వాలని డోమినోస్‌ను ఆదేశించింది. అంటే మన రూపంలో మూడున్నర లక్షల రూపాయలకు పైమాటే. ఇదంతా జరిగాక డోమినోస్ బ్రాంచ్ యజమాని ఆమెకు క్షమాపణలు చెప్పాడు.
ఈ ఘటనపై డోమినోస్ కూడా స్పందించింది. డోమినోస్ ఫ్రాంఛైజీ మోడల్ ను నిర్వహిస్తోందని, ఉద్యోగులు ఎవరిని తీసుకోవాలి అనేది అంతా ఫ్రాంచైజీలే చూసుకుంటాయని తెలిపింది. అంటే పరోక్షంగా ఈ వ్యవహారం అక్కడ ఫ్రాంఛైజీ కొనుక్కున్న వ్యక్తి తలనొప్పి అని, మాకు సంబంధం లేదని చెప్పేసింది డోమినోస్.
ఏది ఏమైనా డ్రైవర్ ఉద్యోగానికి కూడా లింగ వివక్ష చూడడం అవసరమా? అనేది మాత్రం ఇప్పుడు పుట్టిన ప్రశ్న. ఆడవాళ్లు కూడా కార్లు డ్రైవ్ చేస్తున్నారు. మరి వారు ట్రక్కులు డ్రైవ్ చేయలేరా? ఇక మగవారు డ్రైవర్లుగా 60 ఏళ్లు వచ్చే దాకా పనిచేస్తారు. మరి ఈమెను కేవలం వయసు కాస్త ఎక్కువైందనే కారణంగా ఎందుకు పక్కన పెట్టారు? ఇప్పుడు ఐర్లాండ్ లో ఈ టాపిక్‌లన్నీ వైరల్ గా మారాయి.
Also read: గర్భిణులు, పాలిచ్చే తల్లులు తప్పకుండా తినాల్సిన ఆహారాలు ఇవి
Also read: పిల్లల కోసం శునకాన్ని పెంచాలనుకుంటే ఈ జాతి శునకాలే బెటర్, ప్రేమగా ఉంటాయ్